మహిళకు గుర్తింపేదీ..?
♦ పని కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యమే ఎక్కువ
♦ లింగ వివక్ష బాధితుల్లో 72 శాతం మహిళలు
♦ సామాజిక, సంస్థాగత స్థాయి రెండిట్లోనూ ఇదే తీరు
♦ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన టీమ్‌లీజ్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అని పదే పదే మహిళల్ని ఆకాశానికి ఎత్తేసే సమాజం.. ఆచరణలోకి వచ్చే సరికి ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందట. దేశంలో నేటికీ మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటుండమే ఇందుకు ఉదాహరణ అని బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న హెచ్ఆర్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ఒక నివేదికలో పేర్కొంది. పలు ఆసక్తికర విషయాలు లీమ్లీజ్ సహా-వ్యవస్థాపకురాలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీతూపర్నా చక్రబోర్తి మాటల్లోనే..
దేశంలో నేటికీ మహిళలను శ్రామికశక్తిగా గుర్తించటం లేదు. పని కేంద్రాల్లో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. సమానత్వమనేది రాతలకే పరిమితమైంది. వాస్తవరూపంలోకి వచ్చే సరికి దేశంలోని 72% మహిళలు పనికేంద్రాల్లో వివిధ రూపాల్లో లింగ వివక్ష బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంత మహిళ లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంత మహిళల విషయంలో ఇది ఎక్కువ.
సామాజిక, సంస్థాగత స్థాయి రెండింట్లోనూ మహిళల కంటే పురుషులకే అదనపు హక్కులున్నాయి. విధానాలు, పద్ధతులు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. వ్యవస్థలో పురుషుల ఆధిపత్యం కారణంగా మహిళల అభివృద్ధి తిరోగమనంలో, పురుషుల వృద్ధి పురోగమనంలో ఉంది.
{పస్తుత పరిస్థితికి కారణం మహిళలు ఉన్నత విద్య ను ఎంచుకోకపోవడమేనని చెప్పాలి. దేశంలో 61% కంటే ఎక్కువ మహిళలు నాన్-ప్రొఫెషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. దీంతో అత్యుత్తమ ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు.
మహిళా కార్మిక శక్తి గణాంకాలను పరిశీలిస్తే... పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి 20 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతంగా ఉంది. వివిధ రంగాల్లో కింది నుంచి పై స్థాయి వరకు మహిళా ప్రాతినిధ్యం చూస్తే.. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 6 శాతం, సాఫ్ట్వేర్ రంగంలో 5 శాతం ఉన్నారు. తయారీ, ఇంజనీరింగ్ మరియు ఆటో విభాగాల్లో అయితే పరిస్థితి ఇంకా తీసికట్టు.
సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా మహిళల వృద్ధి విధానపరమైన నిర్ణయాలు, కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుంది. మహిళలు కోరుకుంటున్న విధానాలు, కార్యక్రమాలు, కార్పొరేట్ కంపెనీలు చేసే కార్యక్రమాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అసలు మహిళలు కోరుకుంటున్నదేంటంటే.. సరళమైన సమయం, నాయకత్వ శిక్షణ, లైంగిక వేధింపుల పాలసీ వంటివి. కార్పొరేట్ మహిళా ఉద్యోగుల్లో వేతనాల విషయాల్లోనూ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది.