రోడ్డు ప్రమాదంలో వర్క్ ఇన్స్పెక్టర్ మృతి
మల్కాపురం(విశాఖ పశ్చిమ): విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని ఎస్. భూర్జవలస పోలీస్ స్టేషన్ పరిధిలో మరడాం జగ్గయ్యమ్మ తోట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాండ్రంకి సత్యనారాయణ (40) అనేవ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అం దించిన వివరాలు... విశాఖపట్నం కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్(ఒప్పంద ఉద్యోగి)గా పనిచేస్తున్న సత్యనారాయణ సాలూరులో బంధువుల ఇంట జరగనున్న ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు భార్య రాధ, కుమార్తె నిత్యతో పాటు ద్విచక్రవాహనంపై విశాఖ నుంచి సాలూరు బయలు దేరాడు. ఎస్.భూర్జవలస సమీపంలోకి వచ్చేసరికి సాలూ రు నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా భార్య, కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. 108లో క్షతగాత్రులను విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెం దాడు. ఇంటిపెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది, అధికారులు కలవర పడ్డారు.మృతుడి స్వగ్రామం మెంటాడ. ఎస్ఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 46వ వార్డు ఉప్పరకాలనీ ప్రాంతానికి చెందిన పాండ్రంకి సత్యనారాయణ(41)జీవీఎంసీ ఇంజినీరింగ్ వర్క్స్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్( ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సత్యనారాయణ 45 నుంచి 49వ వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.