డ్రైవర్ల ప్రోత్సాహకాలు స్వాహా
♦ ఆర్టీసీలో మరో ‘చిల్లర కొట్టుడు’
♦ కరీంనగర్ జిల్లాలో బయటపడ్డ బాగోతం
♦ అన్ని డిపోల్లో విచారణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు బిల్లులు.. బస్టాండ్లలోని దుకాణాల అద్దెలు.. ఇలా ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన సొమ్మును గుటుక్కుమనిపిస్తున్న ఆర్టీసీ సిబ్బంది చివరకు కార్మికుల అలవెన్సులనూ వదిలిపెట్టడం లేదు. పనితీరులో మంచి ప్రతిభను కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు చెల్లించే అలవెన్సును స్వాహా చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోలో ఈ తతంగం బయటపడటంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అన్ని డిపో ల్లో తనిఖీలు చేపట్టారు. ఆ డిపోలో బాధ్యుడిగా గుర్తించి న సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి పోలీసు కేసు నమోదు చేశారు.
హుజురాబాద్ డిపోకు ఇలా వచ్చిన మొత్తంలో 49 వేలను స్వాహా చేసినట్లు ఆడిటింగ్‌లో బయటపడింది. అధికారులు ఆ మొత్తాన్ని రికవరీ చేసి సంబంధిత డ్రైవర్లకు పంపిణీ చేశారు. మిగతా డిపోల్లో విచారణ జరుగుతున్నందున మరో రెండుమూడు రోజు ల్లో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఇటీవల ఇ లాంటి ‘చిల్లరకొట్టుడు’ వ్యవహారాలు వెలుగుచూస్తుం డటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న యాజమాన్యం ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే విజిలెన్సు విభాగంతో విచారణ జరిపి నిగ్గుతేలుస్తోంది. అయితే అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేస్తుండటం మాత్రం విమర్శలకు కారణమవుతోంది.
డ్రైవర్లకు అవగాహన లేక: బస్సులను జాగ్రత్తగా నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ యాజమాన్యం పదేపదే డ్రైవర్లకు సూచిస్తోంది. అలా సురక్షిత డ్రైవింగ్ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ప్రత్యేక అలవెన్సు ఇస్తోంది. ఇది తోటి డ్రైవర్లను ఆకట్టుకుని వారు కూడా సురక్షితంగా బస్సులను నడిపేందుకు దోహదం చేస్తుందనేది దీని ఉద్దేశం. గరిష్టంగా రూ.2,400 వరకు ఒక్కో డ్రైవర్‌కు చెల్లిస్తారు. ప్రతి ఏటా అలాంటి వారిని గుర్తించి అంతమేర నిధులను డిపోలవారీగా పంపిణీ చేస్తారు. ఏడాదికి ఒకసారే చెల్లించే మొత్తం కావటంతో... ఏ డ్రైవరుకు ఆ మొత్తం వచ్చిందనే విషయంలో పెద్దగా అవగాహన ఉండట్లేదు. దీంతో ఆ మొత్తం అందకున్నా అడిగేవారుండటం లేదు. దీన్ని ఆసరా చేసుకుని కొందరు సిబ్బంది ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలుస్తోంది.