కార్మికుల శ్రమ దోపిడీకే ‘మేకిన్ ఇండియా’
జవహర్నగర్: కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే ప్రధాన మంత్రి మోదీ ‘మేకిన్ ఇండియా’ అంటున్నారని, చట్టాల సవరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం బాలాజీనగర్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను, ఎఫ్డీఐల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య మాట్లాడుతూ.. తెల్లదొరల కాలంలోనే దేశంలోని కార్మికవర్గం ఉద్యమాలు చేసి చట్టాలను సాధించిందన్నారు.
కార్మిక చట్టాల అడ్డు తొలగించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా యత్నిం స్తోందని.. దీనిని కార్మికులంతా అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ విదేశాలలో సమావేశాలు నిర్వహిస్తూ ఇండియాలో కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పడం విచారకరమన్నారు. కార్మికుల శ్రమను దోచిపెట్టడానికే మోదీ మేకిన్ ఇండియా నినాదం ఎత్తుకున్నారని ఆమె దుయ్యబట్టారు.
డిసెంబర్ 5న హైదరాబాద్లో నిర్వహించే కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇప్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నరేందర్, జంటనగరాల ఉపాధ్యక్షుడు సీహెచ్ బాలనర్సింహ, జిల్లా నాయకులు జయసుధ, వెంకన్న,రామిరెడ్డి, అరుణోదయ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.