సమ్మె జయప్రదానికి వినతి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు (పట్నంబజారు): కార్మిక చట్టాలను కాలరాస్తూ.. వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. సెప్టెంబర్ రెండో తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల వ్యవధిలో రెండుసార్లు సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. అనాదిగా ఉన్న 45 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చి పార్లమెంట్లో ఆమోదం పొందిన తరువాత, రాజ్యసభలో కూడా ఆమోదింపచేసేందుకు మోదీ సర్కార్ యోచించటం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలు కార్మికుల జీవితాలను రోడ్డున పడేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పక్కనబెట్టి చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. యడ్లపాడు, సత్తెనపల్లిలోని స్పిన్నింగ్ మిల్లును ఇష్టానుసారంగా మూసివేసి అమ్మకాలు కూడా చేశారని, దీనివల్ల వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వేల కుటుంబాలకు ఆధారమైన భజరంగ్ జూట్‌మిల్లు మూతపడి ఏడాది పైనే అవుతున్నా టీడీపీ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. కార్మిక లోకం చేపడుతున్న సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు.