శరవేగంగా పుష్కర పనులు
రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం
{పధాన పీఠాధిపతులకూ పిలుపు
గోదావరి పుష్కర పనులపై
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష
వచ్చే నెల 15లోగా
పూర్తి చేయాలని ఆదేశం
మరిన్ని నిధులకు కేంద్రానికి విజ్ఞప్తి
ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. జూన్ 15లోగా అన్నింటినీ పూర్తి చేయాలన్నారు. గోదావరి పుష్కరాలకు చేస్తున్న ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. కుంభమేళా తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ప్రధాన పీఠాధిపతులను కూడా రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారికి ఆ బాధ్యతలను అప్పగించారు.
మరోవైపు పుష్కరాలకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి వివరించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలోనే అధికంగా ఉందని.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పుష్కరాలకు కేంద్రం అధిక నిధులను కేటాయించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుష్కర పనుల పురోగతిని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులు మంత్రికి వివరించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి పర్యటించనున్నట్లు, ఎక్కడికక్కడ జిల్లా అధికారులతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుంటూ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.