వాటర్ గ్రిడ్ కు సవాళ్లు..!
⇒ జిల్లాలో ఎత్తయిన కొండలు, గుట్టలు
⇒ కడెం గ్రిడ్‌కు త్వరలో టెండర్లు
⇒ మిగితా మూడింటికి కొనసాగుతున్న సర్వే పనులు
⇒ పనుల పరిశీలనకు నేడు మంత్రి కేటీఆర్ రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎత్తయిన కొండలు.. గుట్టలు.. అడవి.. చెట్టు.. పుట్టలు.. భౌగోళికంగా విభిన్న పరిస్థితులున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు ప్రధాన సవాల్‌గా మారనుంది.
సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న ఆవాసాలకు ఈ గ్రిడ్ల పైప్లైన్ల నిర్మాణం, వాటి నిర్వహణకు అనేక అడ్డంకులు అధిగమించాల్సి రానుందని ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి.ఎత్తయిన ప్రదేశాలకు నీటిని తరలించడానికి సర్జ్ ట్రీట్మెంట్, జీరో వెలాసిటీ వాల్స్ వంటి నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు అవసరమైన నీటి వనరుల లభ్యత ఉన్నా, ఆ నీటిని జిల్లా ప్రజల చెంతకు చేర్చడానికి ఏ జిల్లాలో లేనివిధంగా అడ్డంకులు ఎదురవుతాయని గ్రామీణ నీటి సరఫరా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నార్నూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, కెరమెరి, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ తదితర మండలాల పరిధిలో సుమారు వందకు పైగా ఆవాసాలకు ఈ గ్రిడ్ ద్వారా అసలు తాగునీటిని సరఫరా చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది.వీటి కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న ఈ వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నారు.
పూర్తయిన కడెం గ్రిడ్ సర్వే పనులు..
ఖానాపూర్ నియోజకవర్గానికి తాగునీటిని సరఫరా చేసేందుకు మొదటి విడతలో కడెం గ్రిడ్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనుల సర్వే ఇప్పటికే పూర్తి కాగా, రూ.370 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన మూడు.. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి గ్రిడ్ల సర్వే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు.
ఈ మూడు గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు నాలుగు ఏజెన్సీలను ఎంపిక చేసి నామినేషన్ పద్ధతిలోనే సర్వే పనులు అప్పగించారు. 26 బృందాలు ఈ సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ వాటర్‌గ్రిడ్‌ల లక్ష్యం..
రానున్న మూడున్నరేళ్ల తర్వాత తాగునీటి కోసం ఏ ఒక్క మహిళా కూడా బిందెతో రోడ్డుపై రావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, పట్టణ ప్రాంతల్లో 135 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.3,940 కోట్లతో నాలుగు గ్రిడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మరో రూ.150 కోట్లతో ముథోల్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు గడ్డెన్నవాగు గ్రిడ్‌ను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మంత్రి పర్యటన ఇలా..
కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకుని హెలిక్యాప్టర్‌లో ఉదయం 11 గంటలకు చెన్నూరు మండలంలోని ఎల్ మడుగుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ పనుల ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు చేరకుంటారు. గ్రిడ్ పనుల్లో భాగంగా కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఈ సమీక్షలో కేటీఆర్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార వర్గాల్లో హడావుడి నెలకొంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి, ఆసిఫాబాద్ వద్ద హెలిప్యాడ్లను నిర్మించారు.