సాగర్ చివరి భూములకూ నీరందిస్తాం
రెడ్డిగూడెం: నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే విధంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ వీర్రాజు అన్నారు. నాగార్జున సాగర్ ఆధునికీకరణ పథకం కింద నూజివీడు బ్రాంచి కెనాల్ రంగాపురం మేజర్‌కాలువ పనులను శనివారం ఆయన పరిశీలించారు. సాగునీరును చివరి భూముల వరకు అందే విధంగా రూ. 191 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ. 112 కోట్ల బిల్లుల చెల్లింపు జరిగిందన్నారు.జనవరి నాటికి పూర్తిస్థాయిలో పనులు చేసే విధంగా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సాగర్ మూడవ జోన్‌కు రెండున్నర టీఏంసీ నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించిందని, నెలాఖరు నుంచి మూడో జోన్‌కు నీరు విడుదల చేస్తారన్నారు. మూడో జోన్ పరిధిలోని చెరువులను నింపడం జరుగుతుందన్నారు. ఈఈ అర్జునరావు, డీఈ అనందబాబు పాల్గొన్నారు.