అందమైన సందేశం
‘వీడు మరీ వయొలెంట్‌గా ఉన్నాడు. పువ్వులు, అమ్మాయిలను చూపించండర్రా...’ హీరోనుద్దేశించి ఓ సినిమాలో డైలాగ్. అమ్మాయిల విషయం పక్కకు పెట్టేస్తే... పువ్వులతో ప్రశాంతత కచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి సంగీతం, నాట్యం లాంటివి తోడైతే మనసు మరింత ఆహ్లాదంగా మారుతుంది. ఈ విషయాన్ని వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ చెబుతోంది. ఇటీవల బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన ‘యాన్ ఈవెనింగ్ ఆఫ్ జపనీస్ కల్చర్, ఇకెబెనా వర్క్‌షాప్’లతో నిత్యం బిజీగా ఉండే నగరవాసులకు ప్రశాంతతను చేకూర్చుకోవడమెలాగో చేసి చూపించింది..
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలనే కాన్సెప్ట్‌తో 1996లో వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ ఏర్పాటైంది. దీని వ్యవస్థాపకుడు దుబూమ్ తుల్కూ. టిబెటన్ అయిన ఈయన హర్యానాలో ఉంటున్నారు. మొదటి నుంచి సంస్కృతి, కళలను అభిమానించే దుబూమ్... వాటిని జీవన విధానానికి జోడించి ప్రశాంతంగా బతకడమెలాగో చెబుతున్నారు. అందుకే దేశమంతటా ‘ఇకెబానా, డ్యాన్స్ థీమ్స్’తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించే పని చేయకూడదు’ అంటాడాయన.
ప్రకృతితో మమేకం
ఒక్కో పువ్వుది ఒక్కో అందం. ఒక్కో ఆకుది ఒక్కో ఆకృతి. అందమైన ఆకులను, పరిమళించే పువ్వులను ఒక్కచోట చేర్చితే... వర్ణించడానికి మాటలు చాలవు. అదే ఇకెబెనా. ప్రకృతి ప్రతిబింబించేలా అమర్చే అందమైన కళ. ఫ్లవర్‌వాజ్ లేదా మరేదైనా ట్రే, పాత్రలో పూలను అందంగా అలంకరించే పద్ధతి. కేవలం అలంకరణే కాదు.. దాని ద్వారా ఆనందం పొందడమెలాగో చేసి చూపించారు జపాన్ కళాకారులు.
మయూమీ మెజెకీ.. ఇకెబెనా ప్టైల్ నిపుణురాలు. 18 ఏళ్ల వయసులోనే ఇకెబెనా నేర్చుకున్న ఈమె... ప్రస్తుతం జపాన్‌లోని ఇకెబెనా స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యకుమోగోటో అనే సంగీత వాయిద్యాన్నీ అద్భుతంగా వాయిస్తుంటారు. ఇకెబెనా పూల అలంకరణ ద్వారా ఆనందం, అభినందనవంటి భావాలను వ్యక్తపరచొచ్చని చెప్పారామె. ‘పూల అలంకరణ అంటే మామూలే అనుకున్నాను. కానీ, ఇక్కడకు వచ్చాక తెలిసింది ఈ పని ద్వారా ఎంత ప్రశాంతత పొందవచ్చో’ అని ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఆంజనేయులు చెబుతున్నాడు.
- నిఖితా నెల్లుట్ల
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి