world cup Archery tournment
-
Archery World Cup: సురేఖ డబుల్ ధమాకా
పారిస్: పునరాగమనంలో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్–జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్ ఆఫ్’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి. -
Dhiraj Bommadevara: రెండో రౌండ్లో ధీరజ్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర వ్యక్తిగత రికర్వ్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో జోస్ కార్లోస్ లోపెజ్ (గ్వాటెమాలా)పై విజయం సాధించాడు. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్ సెట్స్’ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్కో సెట్లో ఆర్చర్లకు మూడు బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. మూడు బాణాలు సంధించాక అత్యధిక స్కోరు సాధించిన ఆర్చర్ సెట్‌ను గెలిచినట్టు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు... స్కోరు సమం అయితే ఇద్దరికీ చెరో పాయింట్ ఇస్తారు. ధీరజ్ తొలి సెట్‌ను 28–23తో... రెండో సెట్‌ను 30–27తో... మూడో సెట్‌ను 27–24తో గెలిచి ఓవరాల్‌గా 6–0తో విజయాన్ని అందుకున్నాడు. భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ 6–0తో ఇవాన్ గొంజాలెజ్ (మెక్సికో)పై గెలుపొందగా... ప్రవీణ్ జాదవ్, అతాను దాస్‌లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు దీపిక, అంకిత, కోమలిక, మధు వేద్వాన్లకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
కాంస్య పతక పోరులో సురేఖ–వర్మ ద్వయం
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ మరో పతకంపై దృష్టి పెట్టింది. కాంపౌండ్ ఈవెంట్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం రేసులో నిలిచింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ–వర్మ ద్వయం 153–155తో సోఫీ–జూలియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 155–152తో నెదర్లాండ్స్ ద్వయంపై నెగ్గింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో బెల్జియం జంటతో సురేఖ– వర్మ జోడీ తలపడుతుంది. శుక్రవారమే జరిగే కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చైనీస్ తైపీతో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఆడనుంది. -
ఆర్చరీలో తుది పోరుకు
వ్రోక్లా (పోలాండ్): వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత మహిళా ఆర్చర్లు టీమ్ విభాగంలో రాణించారు. ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్లో రికర్వ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన ఈ విభాగం పోటీల్లో దీపిక కుమారి, రిమిల్ బురులీ, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో భారత్ 217-216తో ఇండోనేసియాను ఓడించాక... క్వార్టర్ ఫైనల్లో 211-202తో మెక్సికోపై గెలిచింది. సెమీఫైనల్లో టీమిండియా 214-206తో డెన్మార్క్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుతో భారత్ తలపడుతుంది.