భూమాత భద్రంగా..
ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. మదర్ ఎర్త్‌ను పరిరక్షించాలని అందరికీ ఉంటుంది. అయితే వ్యక్తులుగా మనం ఏం చేయాలనే సందేహానికి సమాధానం ఉండదు. ఆ సందేహానికి సమాధానాలు వీళ్లంతా. లీలాలక్ష్మారెడ్డి రీ ఫారెస్టేషన్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురైన గ్రీన్హౌస్ గ్యాసెస్ విడుదలను నియంత్రిస్తున్నారు. అంకారావు గ్లోబల్ క్లీనప్ కాన్సెప్ట్‌లో అడవులను కాపాడుతూ ప్లాస్టిక్ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాల నుంచి వన్య్రపాణులను రక్షిస్తున్నారు. స్పందన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పవర్ వినియోగాన్ని తగ్గించడం, సస్టెయినబుల్ ఫ్యాషన్‌లో భాగంగా రీ యూజ్‌ని ప్రోత్సహిస్తూ కెరీర్‌ని పర్యావరణహితంగా మలుచుకున్నారు. చిన్నారి ఆరాధన సముద్రాల నుంచి ప్లాస్టిక్‌ని ఏరివేస్తూ సముద్రజీవుల సంరక్షణ కోసం పని చేస్తోంది. వీరంతా మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలని చెబుతున్నారు భావి తరాలకు పరిశుభ్రమైన భూమిని అందించాలనే ప్రపంచ ఎర్త్‌డే లక్ష్యానికి మార్గదర్శనం చేస్తున్నారు.భూగోళాన్ని కాపాడుదాం!గ్లోబల్ ఎర్త్ డే 2025... ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ థీమ్‌తో మన ముందుకు వచ్చింది. ‘మనకు రకరకాల శక్తి వనరులున్నాయి. భూమికి హాని కలిగించకుండా భవిష్యత్తును నడిపించే ఇంధనం పునరుత్పాదక శక్తి మాత్రమే’ అనే అంశాన్ని ప్రతిబింబించే పోస్టర్ తయారైంది. నిజానికి ఎర్త్ డే అంటే ఎర్త్ యాక్షన్ డే. భూమిని పరిరక్షించుకోవడానికి మనుషులుగా మనమంతా కార్యాచరణ చేపట్టాల్సిన రోజు. ఏటా ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్‌డేని జరుపుకుంటున్నాం. 55 ఐదేళ్ల కిందట 1970లో యూఎస్‌లో మొదలైన ఈ ఎర్త్ డే నిర్వహణ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం 193 దేశాలు భూమిని పరిరక్షించే బాధ్యతలో పాలు పంచుకుంటున్నాయి. ప్రతి రోజూ ఎర్త్ డే!సీజీఆర్ (కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్) ను పదిహేనేళ్ల కిందట ఎర్త్ డే రోజునేప్రారంభించాం. అప్పటి నుంచి 13 లక్షల మంది ఎర్త్ లీడర్స్‌ను తయారు చేశాం. యంగ్ ఎర్త్ లీడర్స్ప్రోగ్రామ్ నిర్వహించడంలో మా ఉద్దేశం... కొత్త తరాలకు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవరచడమే. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ కన్వర్జేషన్‌ను చేపట్టాం. ఎర్త్ డే అంటే ఏడాదికి ఒక రోజు మాట్లాడుకుని మరిచి పోవడం కాదు. ప్రతి రోజూ ఎర్త్ డేనే. పిల్లల పుట్టిన రోజు ఏడాదికి ఒక రోజు చేస్తాం. మిగిలిన రోజుల్లో కూడా వాళ్లకు పోషకాహారం, అనారోగ్యం వస్తే వైద్యం చేయించడంతోపాటు వారి బాగోగులన్నీ చూసినట్లే ఇది కూడా. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాలను అంకితం చేసే పేరెంట్స్‌కి కూడా వారి కోసం మంచి ఎన్విరాన్మెంట్ని అందించాలనే ధ్యాస ఉండడం లేదు. భూమిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎవరికి వారు ఇది తమ ఒక్కరి బాధ్యత కాదన్నట్లు ఉంటున్నారు. మనకున్నది ఒక భూమి– ఒక కుటుంబం– ఒక భవిష్యత్. ఇవి బాగుండాలంటే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన మదర్ ఎర్త్‌ని ఇవ్వగలుగుతాం.– కోరుపోల్ లీలా లక్ష్మారెడ్డి, ప్రెసిడెంట్, సీజీఆర్తొలకరి... మొక్కల పండగ!ప్రకృతికి మనం ఏమిస్తే అది మనకు తిరిగి దానినే ఇస్తుంది. మంచి చేస్తే మంచినందుకుంటాం. చెడు చేస్తే ఆ పర్యవసానాలను చవి చూస్తాం. వందల ఏళ్ల వెనక్కు వెళ్తే మన గ్రామాల్లో పండుగకో చెట్టు నాటే అలవాటుండేది. మొక్కను ప్రేమించడం, పూజించడం మన సంస్కృతి. ఆ కల్చర్‌ని విసిరిపారేశాం, తిరిగి అదే డైలీ రొటీన్‌ని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే కోటి విత్తన బంతుల ఉద్యమం చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాను. తొలకరి చినుకులు పడగానే మొక్క నాటడాన్ని అలవాటు చేసుకోవాలి. తొలకరిని మొక్కల వసంతంగా వేడుక చేసుకోవాలి.– అంకారావు (జాజి) కొమ్మెర, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాఎకో వారియర్సేవ్ ఓషన్ ఇనిషియేటివ్‌లో భాగంగా పదేళ్ల తారాగై ఆరాధన 11.30 గంటలు నీటి లోపల ఉండి 1200 కిలోల ప్లాస్టిక్‌ని ఒడ్డుకు చేర్చింది. చెన్నైకి చెందిన ఆరాధన ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్’ సర్టిఫికేట్ పొందిన స్కూబా డైవర్. ఐదేళ్ల వయసులో డైవింగ్ మొదలు పెట్టిన ఆరాధన ఇప్పటి వరకు 30 వేల కిలోల ప్లాస్టిక్‌ని వెలికి తీసి సముద్రానికి ఊపిరిపోసింది. భూమండలంలోని అన్ని సముద్రాల్లో కలిపి యాభై ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని అంచనా. ఇది ఇలాగే కొనసాగితే తీరం కోతకు గురవడంతోపాటు సముద్రాలు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు, 700 రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది కూడా. ‘ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తున్న ప్రతి చోటా క్లాత్ బ్యాగ్ కావాలని అడగండి. మొదట మీ ఇంటిని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చుకోండి. ఆ తర్వాత మీరు నివసిస్తున్న వీథిని మార్చండి. ఆ తర్వాత సముద్రాన్ని ప్రక్షాళన చేయండి’ అని ఆరాధన ప్రతి ఒక్కరినీ వేడుకుంటోంది.జెన్ జెడ్ ఎంటర్ప్రెన్యూర్మేము మోడరన్ ఎనర్జీ మినిమమ్ థీమ్‌లో భాగమయ్యాం. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి స్టోర్ కోసం గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే భవనాన్ని ఎంచుకున్నాం. పగలు లైట్, ఫ్యాన్ వేయాల్సిన అవసరమే ఉండదు. ప్లాస్టిక్ రహితంగా కూడా డిజైన్ చేశాం. క్యారీ బ్యాగ్‌ల విషయానికి వస్తే పేపర్ బ్యాగ్‌లు రీ యూజ్‌కి ఉపయోగపడడం లేదు. దాంతో నాన్ఓవన్ బ్యాగ్‌లు వాడుతున్నాం. సొసైటీలో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే... మా కస్టమర్లు మా స్టోర్ వైపు నుంచే వెళ్లేటప్పుడు ఆ బ్యాగ్‌లను రీ యూజ్ కోసం తెచ్చిస్తున్నారు. ప్రైస్ ట్యాగ్‌కి దారం, నూలు, పేపర్లనే వాడుతాం. మంచినీటికి మాత్రం కొందరు కస్టమర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లనే అడుగుతున్నారు. ఇక మా దగ్గరకు వచ్చే క్లాత్ వేస్ట్‌ని రీ యూజ్ చేయడానికి రకరకాలుగా ఆలోచిస్తున్నాం, ఇంకా స్పష్టమైన రూపం రాలేదు. మా పార్టనర్స్ అనూష, అమృతలు కూడా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ని గౌరవిస్తారు. కాబట్టి మా స్టోర్‌ని ఇలా యూనిక్‌గా తీసుకురాగలిగాం. ఒక మోడల్ని ఎవరో ఒకరు మొదలుపెడితే మిగిలిన వాళ్లు అందుకుంటారు. ఆ మొదటి అడుగు వేశాం.– వి. స్పందన, కో ఫౌండర్, లావెండర్ లేన్ – హౌస్ ఆఫ్ ఫ్యాషన్నేడు ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్‘ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్–2025’ ఈరోజు అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతుంది. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి మహిళల ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ‘నాయకత్వ స్థాయిలో మహిళలు ఉండడం వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి’ అంటున్నారు గ్లోబల్ గ్రీన్ సిఇవో విలియం బ్రిడ్జ్. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ, వ్యాపార, పౌర సమాజ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి