'మరో రేసుకు చైనా సై'
బీజింగ్: చైనా ఓ బృహత్తర కార్యక్రమానికి తెరతీసింది. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులను ఆకర్షించే దేశంగా రూపొందడానికి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టింది. అలసటలో ఉన్నవారికి సేద తీరాలనే ఆలోచన రాగానే టక్కున తమ దేశమే గుర్తుకు వచ్చేలా తన రూపాన్ని మార్చాలని చూస్తోంది. 2020లో వరల్డ్ లైజర్ కాంగ్రెస్ను తమ దేశంలోని పింగూ జిల్లాలో నిర్వహించనున్నట్లు బీజింగ్ పర్యాటక అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమానికి ప్రపంచదేశాల నుంచి యూనివర్సిటీలు, అకాడమిక్ సంస్థలు, ఎంటర్ప్రైజెస్ సంస్థలకు చెందిన ఉన్నతస్థాయి ప్రముఖులను 1000మందిని ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. ఇందులో సేదతీరేందుకు అవసరమైన 16 రకాల ఉల్లాసభరితమైన కార్యక్రమాలు ఏర్పాటుచేయనుంది. వారి ద్వారా విస్తృత ప్రచారం జరిగి ప్రముఖ సేద తీరే ప్రాంతంగా చైనా అని అందరికీ తెలుస్తుందని వారి ఆలోచన. ఇప్పటికే అన్ని రంగాల్లో దూసుకెళుతున్న చైనాలో సహజ సిద్ధంగానే చక్కటి ప్రకృతి వనరులు కలవు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల్లో తమ వస్తువులను కుమ్మరిస్తున్న ఆ దేశం తాజాగా.. పర్యాటక దేశంగాను దూసుకెళ్లాలనుకుంటోంది.