అజ్మల్‌పై నిషేధం
సందేహాస్పద బౌలింగ్‌పై ఐసీసీ చర్యలు
అప్పీలు చేయనున్న పీసీబీ
దుబాయ్ / కరాచీ: నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని, ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది.
గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్‌ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అజ్మల్ మరోసారి తన బౌలింగ్‌ను పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు 25న బ్రిస్బేన్‌లో జాతీయ క్రికెట్ సెంటర్లో ఐసీసీకి చెందిన ‘హ్యూమన్ మూవ్మెంట్ స్పెషలిస్ట్’లు బౌలర్ యాక్షన్ పూర్తిస్థాయిలో విశ్లేషించారు. అజ్మల్ బౌలింగ్ నిబంధనల ప్రకారం లేదని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది.
2009లో తొలిసారి ఆరోపణలు
అజ్మల్ బౌలింగ్ సందేహాస్పదంగా ఉందని అతను అరంగేట్రం చేసిన ఏడాది (2009)లోనే ఆరోపణలు వచ్చాయి. అతను వేసే ‘దూస్రా’ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పెర్త్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా’లో బౌలింగ్ యాక్షన్‌ను విశ్లేషించిన నిపుణులు క్లీన్చిట్ ఇచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది బౌలర్లకు పెర్త్ యూనివర్సిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో... ఇటీవలే ఐసీసీ తన బౌలింగ్ యాక్షన్ ప్రొటోకాల్‌ను మార్చి బ్రిస్బేన్‌లోని సెంటర్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌ను విశ్లేషించిన నిపుణులు నిబంధనలకు అనుకూలంగా లేదని తేల్చారు.
పాక్‌కు ఎదురుదెబ్బ
అజ్మల్‌పై నిషేధం విధించడంతో పాక్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా చాలా మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన అతను వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడు కూడా. పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడిన అజ్మల్ 178 వికెట్లు తీశాడు. 111 వన్డేల్లో 183 వికెట్లు తీసి జట్టు బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారాడు.
అప్పీలు చేస్తాం: పీసీబీ
ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘పూర్తి విషయాలు మాకు ఇంకా తెలియవు. అయితే అజ్మల్‌కు మరో అవకాశం ఉంది. తన బౌలింగ్‌పై కసరత్తులు చేస్తే తాజా పరీక్షలు చేయాలని కోరుతాం. రెండు వారాల్లో దీనిపై అప్పీల్ చేస్తాం’ అని ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న అజ్మల్‌కు తన సహచరుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించింది.
ప్రపంచకప్‌లో ఆడతా: అజ్మల్
కరాచీ: ఐసీసీ నిషేధంపై పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అజ్మల్ అన్నాడు. దేశం తరఫున ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంత వరకైనా వెళ్తానన్నాడు. ‘బయోమెకానిక్ పరీక్ష నిరాశపర్చింది. అయితే దీన్ని అంత సులువుగా వదిలిపెట్టను. నిషేధం పెద్ద సమస్య కాదు. అవసరమైన చర్యలు తీసుకుంటా. మళ్లీ జట్టులోకి వస్తా. వీలైంతన తొందరగా పీసీబీ పెద్దలను కలిసి తదుపరి చర్యల గురించి ఆలోచిస్తా. వైద్య నివేదికలు వచ్చిన తర్వాత దీనిపై అప్పీలు చేస్తాం’ అని అజ్మల్ వెల్లడించాడు.