సక్లయిన్ ముస్తాక్ నెలకు రూ.10 లక్షలు!
కరాచీ:పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తో ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించడంతో అతని యాక్షన్ సరిదిద్దేందుకు పాకిస్తాన్ నడుంబిగించింది. ఇందులో భాగంగానే సక్లయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న అజ్మల్ పై నిషేధం అంశం పాకిస్తాన్ క్రికెట్ ను కలవర పెట్టింది. వచ్చే ప్రపంచకప్ నాటికి అతని బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మరోమారు అంతర్జాతీయ క్రికెట్ లోకి తీసుకు రావాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అందుకు గాను ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ సహాయం కోరింది. దీనికి అంగీకరించిన పీసీబీ అతనికి నెలకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్నకారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించారు. ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్‌ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశారు.