చరిత్ర సృష్టించిన సందీప్
బుడాపెస్ట్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకంతో మొదలుపెట్టిన భారత్ పతకంతోనే ముగించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరిరోజు భారత్‌కు కాంస్య పతకం లభించింది. పురుషుల గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సందీప్ తులసీ యాదవ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సందీప్ చరిత్ర సృష్టించాడు. ‘రెప్‌చేజ్’ కాంస్య పతక పోరులో సందీప్ 4-0తో అలెగ్జాండర్ మక్సిమోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు.
అంతకుముందు ‘రెప్‌చేజ్’ రెండో రౌండ్లో సందీప్ 6-4తో షారూర్ వర్దాన్‌యాన్ (స్వీడన్)పై నెగ్గి కాంస్య పతక బౌట్‌కు అర్హత పొందాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సందీప్ రెండో రౌండ్లో 5-0తో శాంచెజ్ (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6-2తో మిహైల్ కాస్నిక్‌యెను (మాల్దొవా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో సందీప్ 0-10తో హాన్ సు రియు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయా డు. హాన్ సు రియు ఫైనల్‌కు చేరడంతో సందీప్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది.