world Team chess championship
-
భారత్‌కు నాలుగో స్థానం
ఆస్తానా (కజకిస్థాన్): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న భారత్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. గురువారం రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 1.5–2.5తో ఓడిపోయింది. ఈ గేమ్‌ను 2–2తో డ్రా చేసుకున్నా.... కనీసం భారత్‌కు కాంస్య పతకం లభించి ఉండేది. సెర్గీ కర్జాకిన్ తో ఆదిబన్ , దిమిత్రి ఆండ్రే కీన్ తో అరవింద్ చితాంబరమ్, ఇయాన్ నెపొనియాచితో సూర్య గంగూలీ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా... మూడో బోర్డుపై అలెగ్జాండర్ గ్రిస్చుక్ చేతిలో ఎస్పీ సేతురామన్ ఓడిపోయాడు. దీంతో భారత్ 11 పాయింట్ల తో నాలుగో స్థానంలో నిలిచింది. 16 పాయింట్లతో రష్యా స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, 13 పాయింట్లతో ఇంగ్లండ్ రజతాన్ని, చైనా (12 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను ఆధిబన్ (6/9), సూర్య గంగూలీ (7/9) పసిడి పతకాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో భారత్ 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. హంగేరీతో తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత్ 2–2తో డ్రా చేసుకుంది. -
భారత జట్ల విజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఈజిప్ట్ జట్లతో బుధవారం జరిగిన ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు గెలిచాయి. పురుషుల జట్టు 2.5–1.5తో... మహిళల జట్టు 3–1తో విజయం సాధించాయి. పురుషుల జట్టులో ఆదిబన్‌కు విజయం దక్కగా... విదిత్, కార్తికేయన్, నేగి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల జట్టులో తానియా, ఇషా, విజయలక్ష్మి తమ గేముల్లో గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక 59 ఎత్తుల్లో వఫా ష్రూక్ చేతిలో ఓడిపోయింది. ఐదో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో, మహిళల జట్టు మూడో స్థానంలో ఉన్నాయి. -
మహిళల జట్టుకు తొలి విజయం
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ చెంగ్డూ (చైనా): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలి విజయం సాధించింది. గురువారం అమెరికాతో జరిగిన ఐదో రౌండ్లో భారత్ 3-1తో నెగ్గింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 60 ఎత్తుల్లో అబ్రహమ్యాన్ను ఓడించి ఆధిక్యాన్ని అందించింది. ద్రోణవల్లి హారిక 58 ఎత్తుల్లో నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను.. పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో ఫొయిసర్తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించారు. సౌమ్య స్వామినాథన్ 57 ఎత్తుల్లో అలీసా మెలెకినాను ఓడించింది. శుక్రవారం జరిగే ఆరో రౌండ్లో భారత జట్టు ఈజిప్టుతో తలపడుతుంది. పురుషుల జట్టు ఓటమి సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ ఐదో రౌండ్లో భారత జట్టు 1.5-2.5 తేడాతో ఉక్రెయిన్ చేతిలో ఓడింది. ఇది భారత జట్టుకు రెండో పరాజయం. హరికృష్ణ, పొనోమరియోవ్ గేమ్ 46 ఎత్తుల్లో డ్రా అయ్యింది. సేతురామన్, ఇవాన్చుక్ గేమ్ 32 ఎత్తుల్లో... విదిత్, మొయిసీంకో గేమ్ 56 ఎత్తుల్లో డ్రా అయ్యాయి. శశికిరణ్ 41 ఎత్తుల్లో క్రివోరుచ్కో చేతిలో ఓడాడు. ఆరో రౌండ్లో భారత జట్టు రష్యాతో తలపడుతుంది.