World Womens Boxing Championships
-
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్‌పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్‌లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్‌లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్‌హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
రెండో రౌండ్‌కు మేరీ కోమ్, సరితా దేవి
అస్టానా (కజకిస్తాన్): భారత స్టార్ బాక్సర్లు మేరీ కోమ్ (51కేజీ), ఎల్.సరితా దేవి (60కేజీ) ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్‌కు చేరారు.