మనవాళ్ళు బంగారం | Sakshi Editorial On Womens World Boxing Championship | Sakshi
Sakshi News home page

మనవాళ్ళు బంగారం

Published Tue, Mar 28 2023 12:30 AM | Last Updated on Tue, Mar 28 2023 12:36 AM

Sakshi Editorial On Womens World Boxing Championship

ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్‌ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది.

ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్‌ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్‌ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు.

మొత్తం నలుగురూ తమ బాక్సింగ్‌ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్‌ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్‌ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్‌ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు.

స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్‌ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది.

వారిలో భారత మహిళా బాక్సింగ్‌ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్‌ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. 

గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్‌ టైటిల్‌ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్‌ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్‌ ఛాంపియన్‌ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్‌ తీ తామ్‌పై ఫైనల్‌లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్‌ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు.

మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్‌లో రెండుసార్లు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్‌ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్‌ మెలకువల్లో ఆరితేరిన నిఖత్‌ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్‌ వెయిట్‌ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. 

రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్‌ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు.

2018లో క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్‌ మహాకుంభ్‌’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్‌ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. 

‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది.

మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్‌ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్‌ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు.

ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్‌ మేరీ కోమ్‌ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్‌ సింగ్‌ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్‌ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement