భారత మహిళల క్లీన్‌స్వీప్
చెంగ్డూ (చైనా) : బరిలోకి దిగిన నలుగురు క్రీడాకారిణులూ గెలుపొందడంతో... ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో విజయాన్ని సాధించింది. ఈజిప్టుతో శనివారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 4-0 పాయింట్ల తేడాతో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 65 ఎత్తుల్లో అయా మొతాజ్పై, పద్మిని రౌత్ 58 ఎత్తుల్లో షాహెందా వఫాపై, సౌమ్య స్వామినాథన్ 30 ఎత్తుల్లో అమీనా షరీఫ్‌పై, మేరీ ఆన్‌గోమ్స్ 62 ఎత్తుల్లో ష్రూక్ వఫాపై నెగ్గారు.
ఆరో రౌండ్ తర్వాత భారత్ ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరో రౌండ్లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో రష్యా చేతిలో ఓడిపోయింది. పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్ గుజరాతి తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.