Worlds oldest person
-
‘వందేళ్లకు పైగా డాక్టర్‌ను చూడని బామ్మ’
మాస్కో : ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా భావిస్తున్న రష్యా మహిళ టాంజిలియా బిసెంబెయేవా 123 సంవత్సరాల వయసులో దక్షిణ రష్యాలోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బిసెంబెయేవా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారని డైలీ మెయిల్ పేర్కొంది. ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని, కుటుంబ మెమోరియల్‌లో ఆమెను ఖననం చేశారని అధికారులు తెలిపారు. ఆమె అంతిమయాత్రను వీక్షించేందుకు గ్రామం మొత్తం తరలివచ్చిందని చెప్పారు. టాంజిలియా బిసెంబెయేవా 1896 మార్చి 14న జన్మించినట్టు చెబుతున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు కాగా, పది మంది మనుమలు, 13 మంది మునిమనుమలు, మరో ఇద్దరు మునిమనుమల కుమారులున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎప్పుడూ కుదురగా కూర్చోదని, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారని అదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆమె పులియబెట్టిన పాలు ఎక్కువగా తీసుకునేవారని వెల్లడించారు. ఆమె తొలిసారిగా వైద్యుడ్ని సంప్రదించినప్పుడే ఆమెకు వందేళ్లు పైబడ్డాయని స్ధానికులు చెప్పారు. కాగా, 2016లో టాంజిలియా బిసెంబెయేవా 120 సంవత్సరాల వయసుతో ప్రపంచంలోనే జీవిస్తున్న అతిపెద్ద వయస్కురాలిగా అధికారికంగా గుర్తించినట్టు రష్యన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. -
112 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే
టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాకా మంగళవారం ప్రపంచ రికార్డుకెక్కారు. జూలై 25, 1905న జపాన్‌లోని హొక్కాయ్డోలో జన్మించిన మసాజో నూటపన్నెండేళ్ల వయస్సులో ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మసాజో ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన ఎక్కువగా స్వీట్లు తినడానికి ఇష్టపడతారని, వేడి నీళ్ల స్నానం అంటే ఆయనకు మక్కువని వారు తెలిపారు. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రతి రోజూ దినపత్రిక చదువుతారని వెల్లడించారు. స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో న్యూజెన్ ఒలివెరా పేరు మీద ఉన్న ప్రపంచరికార్డు ఆయన మరణానంతరం మసాజోకు దక్కింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వయో వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ పేరు గాంచింది. తమ దేశంలో దాదాపు 68000 శతాధిక వృద్ధులు జీవిస్తున్నారని జపాన్ ప్రభుత్వం గతంలో వెల్లడించింది. -
19వ శతాబ్దపు చివరి వ్యక్తి ఇకలేరు
⇔ ప్రపంచ వృద్ధురాలు మృతి లండన్: ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో శనివారం తుదిశ్వాస విడిచారు. 117 సంవత్సరాలున్న మార్టినా ఉత్తర ఇటలీలోని వెర్బానియాలోగల తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని స్థానికి మీడియా వెల్లడించింది. 1899, నవంబరు 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేవరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. సుదీర్ఘకాలం పాటు జీవించడం వెనుక ఉన్న రహస్యమేంటని ఎమ్మా మార్టినాను అడిగినప్పుడు.. గత 90 సంవత్సరాలుగా తాను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నానంటూ చెప్పేదని స్థానిక పాత్రికేయులు గుర్తుచేసుకున్నారు. రోజుకు రెండు పచ్చి గుడ్లను, ఓ ఉడికించిన గుడ్డును, పాస్తా, మాంసాన్ని ఆహారం తీసుకునేవారని, తన చివరి రోజు వరకు ఈ ఆహారాన్నే తీసుకున్నారని చెప్పారు. అమెరికాకు చెందిన జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం.. ఎమ్మా మరణంతో 19వ శతాబ్దంలో జన్మించిన వారెవరూ ఇక భూమిపై లేనట్టే. వారి రికార్డుల మేరకు.. 1900, మార్చి10న జమైకాలో జన్మించిన వైలెట్ బ్రౌన్ ఇప్పుడు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న బామ్మగా అవతరించింది. -
ప్రపంచ పెద్దావిడ కన్నుమూశారు
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన కురువృద్ధురాలు మిసావో ఒకావా కన్నుమూశారు. గత నెలలోనే 117వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆమె గుండె పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచ కురు వృద్ధురాలిగా జపాన్‌కు చెందిన ఒకావా 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నారు. 1898 మార్చి 5న జన్మించిన ఆమె గత పదిరోజులుగా ఆకలి మర్చిపోయిందని, కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోలేకపోయిందని ఆమె మనుమడు తెలిపాడు. ఈ మధ్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె అనతికాలంలోనే తమను విడిచి వెళ్లడం బాధాకరమని అన్నారు. యూకియో అనే వ్యక్తిని 1919లో పెళ్లాడిన ఒకావాకు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు సంతానం. భర్త యూకియో 1931లో చనిపోయాడు. ఆమెకు మనవళ్లు, మునిమనవళ్లు కూడా ఉన్నారు.