19వ శతాబ్దపు చివరి వ్యక్తి ఇకలేరు
⇔ ప్రపంచ వృద్ధురాలు మృతి
లండన్: ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో శనివారం తుదిశ్వాస విడిచారు. 117 సంవత్సరాలున్న మార్టినా ఉత్తర ఇటలీలోని వెర్బానియాలోగల తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని స్థానికి మీడియా వెల్లడించింది. 1899, నవంబరు 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేవరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. సుదీర్ఘకాలం పాటు జీవించడం వెనుక ఉన్న రహస్యమేంటని ఎమ్మా మార్టినాను అడిగినప్పుడు.. గత 90 సంవత్సరాలుగా తాను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నానంటూ చెప్పేదని స్థానిక పాత్రికేయులు గుర్తుచేసుకున్నారు.
రోజుకు రెండు పచ్చి గుడ్లను, ఓ ఉడికించిన గుడ్డును, పాస్తా, మాంసాన్ని ఆహారం తీసుకునేవారని, తన చివరి రోజు వరకు ఈ ఆహారాన్నే తీసుకున్నారని చెప్పారు. అమెరికాకు చెందిన జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం.. ఎమ్మా మరణంతో 19వ శతాబ్దంలో జన్మించిన వారెవరూ ఇక భూమిపై లేనట్టే. వారి రికార్డుల మేరకు.. 1900, మార్చి10న జమైకాలో జన్మించిన వైలెట్ బ్రౌన్ ఇప్పుడు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న బామ్మగా అవతరించింది.