ఏజెన్సీకి జ్వరం
♦ ‘ముసురు’కున్న వ్యాధులు
♦ 25 రోజుల్లో 8,300 మంది జ్వర బాధితులు
♦ జనవరి నుంచి జ్వరాలు, వ్యాధులతో 51 మంది మృతి
ఉట్నూర్(ఖానాపూర్): జ్వరాలు, అతిసార, రక్తహీనత, ఇతర వ్యాధులతో ఏజెన్సీ తల్లడిల్లుతోంది. కేవలం 25 రోజుల్లో 8,300 మంది జ్వరాల బారిన పడడం వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాకాలం కావడంతో ‘ముసురు’కుంటున్న వ్యాధులకు గిరిజనులు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇంద్రవెల్లి మండలంలో సోమవారం ఒక్క రోజే ఇద్దరు జ్వరాలతో మృతి చెందడం గిరి గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 44 పాత మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వర్షాకాలంలో గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించి, బావుల్లో క్లోరినేషన్ చేయకపోవడం కారణంగా ఏటా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఐటీడీఏ, అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమన చర్యలే గానీ శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) పరిధిలో జ్వరాలు, అతిసార, రక్తహీనత, తదితర వ్యాధులతో 51 మంది గిరిజనులు మృతిచెందారు. వెలుగులోకి రాని గిరిజన మరణాలు ఈ సంఖ్యకు మూడింతలు ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. గత నెల 21 నుంచి ఏజెన్సీ పీహెచ్‌సీల్లో చేపట్టిన ర్యాపిడ్ ఫీవర్ సర్వేల్లో చేదు నిజాలు బయటపడుతున్నాయి.
31 పీహెచ్‌సీలు.. 2,262 వైద్య శిబిరాలు..
ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జూన్ 21 నుంచి ఈ నెల 20 వరకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని ఐటీడీఏ చేపట్టింది. ఇందులో భాగంగా వైద్యాబృందాలు నిత్యం గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై నివేదికలను ఎప్పటికప్పుడు ఐటీడీఏకు అందిస్తున్నాయి. సర్వే ప్రారంభం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు.. అంటే 25 రోజుల్లో 31 పీహెచ్‌సీల పరిధిలో 2,262 వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యబృందాలు 1,17,368 మందికి వైద్య పరీక్షలు చేశారు. 8,300 మంది జ్వరాలు, 14 మంది మలేరియా, 51 మంది టైఫాయిడ్ బారిన పడ్డారని, 1,573 మంది అతిసారతో మంచం పట్టారని గుర్తించారు. సర్వే ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వైద్య బృందాలు చెబుతున్నాయి. ఈ సర్వే లెక్కలు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేవేనని, అధికారిక లెక్కలకు మించి మూడొంతుల మంది వ్యాధుల బారిన పడ్డారని గిరిజనులు అంటున్నారు.
ఏటా తాత్కాలిక చర్యలే..
వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంతంలో వ్యాధులు, జ్వరాలు గిరిజనులను చుట్టుముడుతుంటాయి. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. ఏజెన్సీలోని 235 గ్రామ పంచాయతీల్లో క్లోరినేషన్, పారిశుధ్యం నివారణకు ఎన్ఆర్హెచ్ఎం ద్వారా సబ్‌సెంటర్ ఏఎన్ఎం, పంచాయతీ వీఆర్వోల ఖాతాలోకి ఏటా వచ్చే రూ.20 వేలు గత రెండేళ్లుగా రావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్ చర్యలు చేపట్టడం లేదు. సబ్‌సెంటర్లకు వచ్చే రూ.10 వేలు అన్‌టైడ్ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సబ్సెంటర్లో అత్యవసరంగా మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు చిల్లిగవ్వ లేదని సిబ్బంది వాపోతున్నారు. ఏటా అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడమే గానీ శాశ్వత నివారణ మార్గాలు అన్వేషించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 986 ప్రభావిత గ్రామాలను గుర్తించి దోమల నివారణకు చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. మొదటి విడతలో ఇప్పటి వరకు 211 గ్రామాల్లో దోమల నివారణకు ఐఆర్ఎస్(ఇండోర్ రెసిడెన్షియల్ స్ప్రే) పూర్తి చేశారు. మిగతా గ్రామాల్లో ఎప్పటి వరకు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఖాళీలతో సతమతం
ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలకు ఉట్నూర్ కేంద్రంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర(సీహెచ్‌సీ)మే పెద్ద దిక్కు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో నలుగురు కాంట్రాక్టు వైద్యాధికారులు సేవలు అందిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీల్లో 841 మంది వైద్య సిబ్బంది వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 717 మంది మాత్రమే ఉన్నారు. 124 ఖాళీలు ఉన్నాయి. ఇటీవల ఉన్నత విద్య కోసం కొందరు వైద్యాధికారులు వెళ్లిపోవడంతో 34 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఐటీడీఏ కాంట్రాక్ట్ పద్ధతిన 18 మందిని నియమించగా.. ఇంకా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 73 వైద్యాధికారులకు గాను 57 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 10 మంది మాత్రమే ప్రభుత్వ వైద్యాధికారులు కాగా మిగతా వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు.
రోజుకు 300పైగా ఓపీ కేసులు..
ఉట్నూర్‌లోని సీహెచ్‌సీకి సమస్మాత్మక మండలాల నుంచి జ్వర, అతిసార బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజుకు 300 పైగా వైద్య పరీక్షల కోసం వస్తుండగా.. వీరిలో 30 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు.
ఏం చేయాలో తెలియడం లేదు..
నా కొడుకు మారుతిరావుకు నాలుగు రోజుల నుంచి విపరీతంగా జ్వరం వస్తంది. ఉట్నూర్ ఆసుపత్రికి తీసుకు వస్తే ఇక్కడే ఉండమనడంతో నాలుగు రోజులుగా ఉంటున్నాం. అయినా కొడుకు జ్వరం తగ్గడం లేదు. గ్రామాల్లో ఇంటికి ఒక్కరిద్దరికి జ్వరాలు వస్తున్నాయి. గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
– అడ మాన్కుబాయి, గ్రామం :రాంనగర్, మం : ఉట్నూర్
మూడు రోజులుగా జ్వరం, వాంతులు
మా బాబు అభికృష్ణకు మూడు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నా తగ్గడం లేదు. గ్రామాల్లో ఎక్కడికక్కడ బురద ఏర్పడడంతో దోమలు పెరుగుతున్నాయి. జ్వరాలు, వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. అధికారులు గ్రామాల్లో చర్యలు చేపట్టి జ్వరాలు తగ్గుముఖం పట్టేలా చూడాలి.
– సుద్దమల్ల మల్లీశ్వరి, గ్రామం : కొమ్ముగూడెం, మం : ఉట్నూర్
తేదీ ఇన్‌పేషెంట్లు
జూలై 03 40
04 53
05 54
06 49
07 32
08 41
09 50
10 78
11 50
12 36
13 36
14 20
15 36
16 26
17 23
18 20