చెత్త రికార్డుపై స్పందించిన ఎయిరిండియా
విమానయాన సంస్థల పనితీరుపై డేటా సర్వీసు కంపెనీ ఫ్లైట్ స్టాట్స్ వెల్లడించిన రిపోర్టుపై ఎయిరిండియా స్పందించింది. ఫ్లైట్ స్టాట్స్ రిపోర్టుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఫ్లైట్ స్టాట్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత చెత్త విమానయాన సంస్థలో ఎయిరిండియా మూడో స్థానంలో ఉంది. సరియైన సమయంలో ప్రయాణికులకు గమ్యం చేర్చలేకపోవడంతో ఎయిరిండియా అధ్వాన పనితీరు జాబితాలో 3వ స్థానానికి వచ్చినట్టు ఫ్లైట్ స్టాట్స్ తెలిపింది. ఎయిరిండియాపై ఫ్లైట్ స్టాట్స్ పబ్లిష్ చేసిన రిపోర్టుతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని, తాము చెత్త కాదని సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రాథమికంగా ఈ రిపోర్టు కల్పితమని తాము గుర్తించినట్టు, దీనిపై ఎయిరిండియా మేనేజ్మెంట్ విచారణ చేపడుతుందని తెలిపింది. గ్లోబల్‌గా విమానయాన సంస్థలు ఎలాంటి పనితీరు కనబరుస్తున్నాయో పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే ఈ రిపోర్టును ప్రకటించినట్టు ఫ్లైట్ స్టాట్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. గత ఎనిమిదేళ్లలో ఆన్-టైమ్ ఫర్ఫార్మెన్స్ సర్వీసెస్(ఓపీఎస్) అందిస్తున్న సంస్థగా తామెంతో పేరుగాంచామని, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌గా అవార్డ్స్ పొందుతున్నట్టు ఎయిరిండియా చెపుకొస్తోంది.