wrestling coach
-
నేను చేసిన తప్పేంటో వెతుకుతున్నా
న్యూఢిల్లీ: భారత మహిళల రెజ్లింగ్ కోచ్ పదవి నుంచి తనను తప్పించడానికి గల కారణమేమిటో తనకు ఇంకా అంతుపట్టడం లేదని ఆండ్రూ కుక్ పేర్కొన్నాడు. రెప్పపాటులో మొత్తం మారిపోయిందని అతనన్నాడు. ఈ చర్య ద్వారా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తనకు తీరని నష్టం చేసిందని కుక్ ఆరోపించాడు. ఆన్లైన్ సెషన్లకు కుక్ గైర్హాజరు కావడంతోనే అతన్ని కోచ్ పదవి నుంచి తప్పించినట్లు డబ్ల్యూఎఫ్ఐ పేర్కొనగా... ఆ సెషన్ కోసం తాను ఉదయం 3 గంటలకే నిద్రలేచి సిద్ధంగా ఉన్నట్లు ఆండ్రూ కుక్ వెల్లడించాడు. కరోనా నేపథ్యంలో స్వదేశం అమెరికా వెళ్లిన కుక్ భారత రెజ్లర్ల కోసం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నానని తెలిపాడు. ‘భారత్ నన్ను పూర్తిగా దెబ్బతీసింది. మళ్లీ నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దని కోరుకుంటున్నా. నిజంగా అసలేం జరిగిందో నాకు తెలియదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు. ఆన్లైన్ తరగతుల కోసం నేను ఉదయం 3 గంటల సమయంలోనూ అందుబాటులో ఉన్నా. ఆ సెషన్‌కు రెజ్లర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇంత చేసినా నన్ను పదవి నుంచి తప్పించినట్లు మీడియాలో చూసి తెలుసుకున్నా. ఇప్పటికీ సాయ్, డబ్ల్యూఎఫ్ఐ నుంచి నాకు అధికారికంగా ఎలాంటి సందేశం రాలేదు. చాలా నిరాశగా ఉంది’ అని కుక్ వివరించాడు. -
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
న్యూఢిల్లీ: కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్ కుక్ అమెరికాకు, గ్రీకో రోమన్ కోచ్ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. -
రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్‌కు ద్రోణాచార్య
జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్ కు ఢిల్లీ హై కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు ప్రతిష్టాత్మక ద్రోణా చార్య అవార్డు అందించాలని కోర్టు కేంద్రాన్ని నిర్ధేశించింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై వినోద్ కుమార్ స్పందిస్తూ.. తన అభ్యర్థనను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈనెల ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ మరో రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును సిఫార్సు చేసింది. దీంతో తన కంటే జూనియర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని వినోద్ కుమార్ కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశం సకాలంలో వచ్చిందని వినోద్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా ఆవార్డుల కార్యక్రమం జరగ నుంది.