‘అసహనం’పై సినీ బాణం
* ఒకే రోజు జాతీయ అవార్డులు తిరిగిచ్చిన 24 మంది ఫిల్మ్మేకర్లు
* తన అవార్డును సైతం వెనక్కిచ్చిన రచయిత్రి అరుంధతీ రాయ్
న్యూఢిల్లీ/ముంబై: దేశంలో అసహన పరిస్థితుల పెరిగిపోతున్నాయంటూ నిరసన గళం వినిపిస్తున్న మేధావుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 24 మంది ఫిల్మ్మేకర్లు వారికి లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో ప్రముఖ దర్శక రచయిత కుందన్ షా, దర్శకుడు సయీద్ మిర్జా, రచయిత్రి, బుకర్‌ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, అన్వర్ జమల్, వీకేంద్ర సైనీ, ప్రదీప్ కృష్ణన్, మనోజ్ లోబో, సుధాకర్‌రెడ్డి యెక్కంటి తదితరులున్నారు.
వీరితో కలిపి జాతీయ లేదా సాహిత్య అవార్డులు తిరిగిస్తున్నట్లు ప్రకటించిన మేధావుల సంఖ్య 75కు చేరింది. భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులతోపాటు ముగ్గురు మేధావుల హత్యకు నిరసనగా వీరంతా గళమెత్తుతున్నారు. సైద్ధాంతిక క్రూరత్వానికి నిరసనగా 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ టు దోజ్ వన్స్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో అందుకున్న జాతీయ అవార్డును తిరిగిస్తున్నట్లు అరుంధతీ రాయ్ ప్రకటించారు. ఎఫ్‌ఈఐఐ చైర్మన్‌గా బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్‌ను నియామకానికి నిరసనగా జాతీయ అవార్డును వెనక్కిస్తున్నట్లు కుందన్ చెప్పారు.
మోదీ సర్కారుకు కళాకారుల బాసట
అవార్డులను తిరిగిస్తున్న మేధావుల తీరును పలువురు కళాకారులు తప్పుబట్టారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆశ్చర్యపోయిన దేశంలోని ఒక వర్గం మేధావులు వారి కక్ష తీర్చుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షుడు లోకేశ్, రచయిత భైరప్ప సహా 36 మంది మేధావులు సర్కారుకు మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.