‘నవోదయ’కు దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2014-15 సంవత్సరానికి గాను 6వతరగతిలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు వచ్చేనెల 31తేదీ లోగా ఆసక్తిగల బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని చేవెళ్ల మండల మానవ వనరుల విద్యాకేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రవేశ పరీక్ష వచ్చేసంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ 2015 (శనివారం) నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ పరీక్ష రెండు గంటలపాటు ఉంటుంది. ప్రతిభగల బాలబాలికలకు ఇదో సువర్ణావకాశం.
ప్రత్యేక వసతులు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రత్యేక అన్ని వసతులు కల్పిస్తారు. బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం, అర్హత, అనుభవం కలిగిన బోధనా సిబ్బంది, విద్యలో సాంకేతిక శాస్త్ర సమాచారం తదితర అంశాలను బోధిస్తారు. తగిన సహ పాఠ్య కార్యక్రమాలు, క్రీడలు, ఆటలు, యోగా ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, భోజన వసతి ఉచితంగా సమకూరుస్తారు.
రిజర్వేషన్లు..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వేషన్ ఉంటుంది. వికలాంగులకు 3 శాతం, షెడ్యూలు కులాలవారికి 15 శాతం, షెడ్యూలు తెగలవారికి 7.5 శాతం కనీస రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం..
జిల్లాలోని పలు విద్యా కేంద్రాల్లో సమాచార సంచిక (ప్రాస్పెక్టస్) దరఖాస్తు ఫారం ఉచి తంగా లభిస్తుంది. జిల్లా విద్యాధికారి కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, 5వ తరగతి ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, ఎక్రిడేటెడ్ సంస్థ, జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ, జవహర్ విద్యాలయ కార్యాలయాలలో దరఖాస్తు ఫారాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ఫారాన్ని డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.నవోదయ.ఎన్ఐసీ.ఐన్ అనే వెబ్సైట్ నుంచి కూడా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను జిల్లాలోని సంబంధిత మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో అక్టోబర్ 31లోగా అందజేయాల్సి ఉంటుంది.
అర్హులెవరంటే..
ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాల బాలికలు అర్హులు. 01-05-2002 నుంచి 30-04-2006లో మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 3,4 తరగతులు ఉత్తీర్ణులై ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న వారు అర్హులు.
పోటీ పరీక్షకు సబ్జెక్టులు..
ఈ పోటీ పరీక్షకు ఆయా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. 50 శాతం మేధాశక్తి, 25శాతం గణిత ం, 25 శాతం భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల వ్యవధితో 100 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థి తాను ఐదో తరగతిలో ఏ భాషా మాధ్యమంలో అభ్యసిస్తున్నారో అదే భాషా మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. మంచి భవిష్యత్తు కలిగిన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు ఆసక్తిగల బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.