ఓటమితో ఆరంభం సానియా జంటకు షాక్
సిడ్నీ: గత ఏడాది చివర్లో వరుసగా రెండు టైటిల్స్ సాధించి సత్తా చాటుకున్న సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట కొత్త సంవత్సరాన్ని ఓటమితో ఆరంభించింది. అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 3-6, 2-6తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-అజ్లాత్ తామ్లిజనోవిచ్ (క్రొయేషియా) జోడి చేతిలో ఓడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది.