Nuclear test: డ్రాగన్‌పై అణుమానాలు!
డ్రాగన్ దేశం మళ్లీ అణు పరీక్షలకు సిద్ధపడుతోందా? అందుకోసం చాపకింద నీరులా కొన్నేళ్లుగా క్రమంగా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తోందా? ఏ క్షణంలోనైనా భారీ స్థాయిలో అణు పరీక్షలు చేపట్టనుందా? అంటే అవుననే అంటోంది తాజా పరిశోధన ఒకటి.
అణు నిరాయు«దీకరణ చర్యలను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయతి్నస్తున్న ఈ తరుణంలో చైనా తాజా చర్యలు కలకలం రేపుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ పోటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి...
అది వాయవ్య చైనాలోని మారుమూల జిన్జియాన్ అటానమస్ ఏరియా. అక్కడి ఓ ప్రాంతంలో కొన్నేళ్లుగా పలురకాలుగా హడావుడి పెరుగుతూ వస్తోంది. రకరకాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొండల్ని తొలిచి సొరంగాల్లాంటివి వేసే పనులూ సాగుతున్నాయి. ఇంకోవైపు కొత్త వైమానిక స్థావరం నిర్మాణంలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్నపాటి శాటిలైట్ టౌన్ పుట్టుకొస్తోంది.
బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఈ కార్యకలాపాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్ రెనీ బాబియార్జ్ బయట పెట్టిన ఉపగ్రహ చిత్రాలతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇవన్నీ జరుగుతున్నది 1964లో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపిన లోప్‌నూర్ ప్రాంతంలో కావడమే అందుకు కారణం!
త్వరలో భారీ ఎత్తున అణు పరీక్షలకు చైనా సిద్ధమవుతోందనేందుకు ఇవన్నీ తిరుగులేని ఆధారాలని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాజీ విశ్లేషకుడు కూడా అయిన రెనీ లోప్‌నూర్‌లో కార్యకలాపాలకు సంబంధించి కొన్నేళ్లుగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను లోతుగా పరిశీలించారు. ఆ మీదట ఆయన అందజేసిన సాక్ష్యాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది.
పక్కాగా ఏర్పాట్లు...!: న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని అభూత కల్పనగా చైనా కొట్టిపారేసింది. ఏదేదో ఊహించుకుని రాసిన నిరాధార కథనంగా దాన్ని అభివరి్ణంచింది. కానీ ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసిన విషయాలు మాత్రం చైనా కచి్చతంగా ఏదో దాస్తోందనేందుకు ఊతమిస్తున్నాయి. ఎందుకంటే ఒకట్రెండు శిథిల భవనాలు తప్ప 2017 దాకా నిద్రాణావస్థలోనే ఉన్న లోప్‌నూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లలో అత్యాధునిక భవనాల భవన సముదాయాలు పుట్టుకొచి్చన వైనం ఆ చిత్రాల్లో స్పష్టంగా కని్పస్తోంది.
అంతేగాక నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన ఓ పటిష్టమైన బంకర్ కూడా ఉందక్కడ. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు తదితరాలు కూడా కొట్టొచ్చినట్టు కని్పస్తున్నాయి. వీటితో పాటు ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్ పైపులు కూడా ఉన్నాయి. దాని సాయంతో బహుశా నేలలోకి నిలువుగా కనీసం పావు మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారన్నది బాబియార్జ్ అంచనా.
లోప్నూర్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మలాన్ ప్రాంతంలో కూడా ఓ అత్యాధునిక శాటిలైట్ సిటీ నిర్మాణంలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అక్కడ కూడా రిగ్గింగ్ యంత్రాలు తదితర సెటప్ కనబడుతోంది. ఇదంతా బహుశా లోప్‌నూర్ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో ముందస్తు శిక్షణ కోసమని భావిస్తున్నారు.
ప్రాంతీయ భద్రతకు ముప్పే
చైనా అణు దూకుడు ఆసియాలో ప్రాంతీయ భద్రతను కూడా ప్రమాదంలో పడేసే పరిణామమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇది మరీ ఇబ్బందికర పరిణామమే కానుంది. 1998 ఫోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం వాటిపై భారత్ స్వీయ నిషేధం విధించుకోవడం తెలిసిందే.
అణు పరీక్షలు ఎందుకంటే...
చైనా అణు పరీక్షలకు దిగనుండటమే నిజమైతే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకు రక్షణ నిపుణులు పలు కారణాలను చూపుతున్నారు....
► అణు కార్యకలాపాల విషయంలో కొద్దికాలంగా చైనా దూకుడు పెంచింది.
► దశాబ్దం క్రితం దాకా దానివద్ద కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి.
► వాటిని 2028 కల్లా ఏకంగా 1,000కి పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవలే పెంటగాన్ వార్షిక నివేదిక వెల్లడించింది.
► వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా చైనా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది.
► ఈ దిశగా కొంతకాలంగా పలు అత్యాధునిక అణు వార్హెడ్లను చైనా తయారు చేస్తోంది.
► వాటిని అధునాతన ఖండాంతర, క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది.
► ఆ వార్హెడ్లను పూర్తిస్థాయిలో పరీక్షించి సరిచూసుకునే ఉద్దేశంతో డ్రాగన్ దేశం ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అనుమానిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్