నెలాఖరు వరకు వానలు పడతాయ్
నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయన్నారు. ఫలితంగా పలుచోట్ల గాలులతో కూడిన వానలు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెల నుంచి మళ్లీ రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. తమ అంచనా ప్రకారం ఈ సారి సీజన్ ఆశాజనకంగానే ఉందని చెప్పారు. రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర భారతం వైపు వెళ్లాయని, అది సాధారణంగా సీజన్లో జరిగే ప్రక్రియేనని పేర్కొన్నారు.