చంద్రబాబు మోసగాడు.. నమ్మకండి
సాక్షి, ఇందుకూరుపేట: సీఎం చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడమే పని. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. త్వరలో జరిగే ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపిస్తే అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తారు’ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కుడితిపాలెం గ్రామంలో మంగళవారం ప్రసన్న పర్యటించారు. స్థానిక నేత టంగుటూరు ఉదయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసన్న మాట్లాడుతూ టీడీపీ రాక్షసపాలన అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. జగన్ ప్రజల మధ్య ఉంటూ వారికోసం ఉద్యమాలు, దీక్షలు చేశారన్నారు.
ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఈ ఐదేళ్లలో వారిలో ఆ ఆనందం చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేవారు కరువయ్యారని చెప్పారు. సోమశిల, కండలేరలో నీరున్నా పంటలు పండించుకోలేకపోయారని తెలిపారు. అన్నదాతలకు నీరందించాలనే ఉద్దేశం మంత్రులకు లేకుండాపోయాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలను బాబు కాపీ కొట్టాడన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మరిపించగల సత్తా జగన్‌కు ఉందన్నారు. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి తెలుగు తమ్ముళ్లు కనిపించలేదన్నారు.
ఒక వ్యక్తికి పెత్తనం ఇచ్చి సీనియర్లను సైతం అవమానింపజేసిన విషయం తెలియాదా?, ఆ రిపోర్ట్‌లను సీఎం తెప్పించుకోలేదా అని ప్రశ్నించారు. జగన్ కార్యకర్తలను గౌరవించే వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, నాయకులు అడపాల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకుడు ఉదయకుమార్‌రెడ్డి కేక్ కట్ చేసి ప్రసన్నకుమార్‌రెడ్డికి తినిపించారు.