వైస్క్రీన్స్‌తో యుఎఫ్‌వో ఒప్పందం
⇒ రూ.2వేల కోట్లకుపైగా పెట్టుబడులు
⇒ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వైఎస్టీడీ సెంటర్లు నిర్మాణం
సాక్షి, అమరావతిబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో మినీ థియేటర్లు నిర్మించి వినోదరంగంలో గుర్తింపు తెచ్చుకున్న వైస్క్రీన్స్ యుఎఫ్‌వోతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో యుఎఫ్‌వో భాగస్వామ్యంతో కలిసి దాదాపు రూ.2,150 కోట్ల రుపాయలు పెట్టుబడులను వైస్క్రీన్స్ ఇన్వెస్ట్ చేయనుంది. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్క్రీన్స్ సీఎండీ యార్లగడ్డ రత్నకుమార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వినోదరంగంలో ఒక సంచలనమన్నారు. ఇదే తరుణంలో తెలంగాణలో కూడా పెట్టుబడులు పెరగడానికి అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
2022 నాటికి 800 వైఎస్టీడీ సెంటర్లు, 1600 స్క్రీన్స్ ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే వైస్క్రీన్స్ ఎత్తున్న వైఎస్టీడీ సెంటర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో ఈ రెండు సంస్థలు కలిసి వైస్క్రీన్స్ నోవా సినీ మ్యాజ్ అనే సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నాయి. భారతీయ సినిమా రంగంలో యుఎఫ్వోకు మంచి ప్రాధాన్యం ఉంది. డిజిటల్ సినిమా డిస్ట్రిబ్యూషన్‌తోపాటు అడ్వర్టయిజ్మెంట్ ప్లాట్ఫారం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఉంది.
భారత్ ,నేపాల్‌లో యుఎఫ్‌వో సంస్థ దాదాపు 5 వేలకు పైగా స్క్రీన్స్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1700కు పైగా సినిమాలను 25 భాషాల్లో విడుదల చేశారు. ఒక్కొక్క వైఎస్టీడీ సెంటర్లో 60 మంది వరకు స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి కల్పించే ది«శగా సంస్థ అడుగులు వేస్తుందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో యుఎఫ్‌వో స్పెషల్ ప్రాజెక్టు సీఈవో విష్ణు పటేల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జీఎం లక్ష్మణ్ పాల్గొన్నారు.