మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..?
1999 చివరలో ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది Y2K సమస్య. దీని కారణంగా ఎన్నో కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు మూలన పడిపోయాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది Y2K. తాజాగా ఇలాంటి టెక్ బగ్ ఒకటి మరోకటి వెలుగులోకి వచ్చింది.
అప్డేట్ వెర్షన్‌తో...!
Y2K కొత్త ఏడాదితో సరికొత్తగా అప్డేట్ వెర్షన్‌తో Y2K22 అనే కొత్త బగ్ వచ్చింది. విచిత్రంగా ఈ సమస్య కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. Y2K22 సమస్య యూకే, యూఎస్, కెనడాలో వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి.
హోండా, అకురా పాత కార్లలో..!
హోండా, అకురా బ్రాండ్స్‌కు చెందిన ఆయా కారు మోడల్స్‌లో Y2K22 బగ్ కన్పించినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది 2022 లోకి ప్రవేశించినప్పుడు ఆయా హోండా పాత కార్లలో జనవరి 1, 2022 బదులుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి జనవరి 1, 2002 తేదీని చూపించినట్లు యూకేకు చెందిన ఓ నెటిజన్ ట్విటర్లో తెలిపారు. ఈ సమస్య గురించి ఆయా వాహనదారుడు హోండా సంస్థకు నివేదించాడు. ఆయా హోండా, అకురా కార్ మోడల్స్‌లో సమస్యను వెలుగుచూసిన యాజమానుల ప్రకారం... సమయం, తేదీని సర్దుబాటు చేయడానికి మాన్యువల్ ఓవర్‌రైడ్ పని చేయడం లేదని నివేదించారు.
స్పందించిన కంపెనీ..!
నయా Y2K22 సమస్యపై కంపెనీ స్పందిస్తూ త్వరలోనే పరిష్కారం చూపుతామని హోండా వెల్లడించింది. కార్లలోని నావీ క్లాక్ సమస్య గురించి కంపెనీ ఇంజనీర్ బృందాలకు తెలియజేసినట్లు హోండా తెలిపింది. ఈ సమస్య జనవరి 2022 నుంచి ఆగస్టు 2022 వరకు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అది స్వయంచాలకంగా సరిదిద్దబడుతుందని వెల్లడించింది. కాగా ఈ సమస్య గురించి కంపెనీకి ముందుగానే తెలిసి ఉంటుందని సమాచారం.
ప్రభావమెంత..!
2000 సంవత్సరంలో Y2K బగ్ టెక్ ప్రపంచాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి వేసింది. ఎంతో మంది Y2K సమస్యతో తమ ఉద్యోగులను కూడా పొగోట్టుకున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా ఏకంగా 100 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ చిన్న బగ్ అప్పట్లో పీడకల లాగే మిగిలిపోయింది. కాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన Y2K22 సమస్య ప్రభావం తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదృష్టవశాత్తూ Y2K22 సమస్య కేవలం తప్పుడు సమయం, తేదీల్లో మాత్రమే సమస్యగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఆయా కార్లలో ఇతర ఫంక్షన్లతో పాటుగా, నావిగేషనల్ సిస్టమ్స్ బాగా పనిచేస్తున్నాయని ఆయా వాహనదారులు తెలిపారు. దీంతో Y2K22 ప్రభావం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఏడాది ముందే Y2K22 సమస్యను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్ సేవలకు అంతరాయం కల్గించిన Y2K22 బగ్‌ను మైక్రోసాఫ్ట్ వెంటనే పరిష్కరించింది.
My @Honda 2007 CR-V clock now useless in 2022; resets to 2:00 MST on 1/1/2002 after every startup. 32-bit signed integer overflow of yymmddHHMM? Would unsigned int fix it? This is time-critical. ;-) Thousands of us need a software update! pic.twitter.com/BSGCaxnMmx
— Sumner Hushing (@_______shushing) January 4, 2022
చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!