యాదగిరీశుడి దర్శనానికి బారులు
యాదగిరికొండ, న్యూస్‌లైన్,యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దర్శనానికి ఆదివారం భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. కొండపై రద్దీ పెరగడంతో సంగీతభవనం, ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి ధర్మదర్శనంతో పాటు ప్రత్యేక క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. సుమారు 80వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. కాగా స్వామి దర్శనానికి 6 గంటల సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాహనాలను తులసీ కాటేజీ మీదుగా మళ్లించారు.
భక్తుల ఇబ్బందులు
స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన మహిళా భక్తురాలు ఒకరు క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోవడంతో ఆలయ సిబ్బంది చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రసాదాల విక్రయశాల వద్ద భక్తులు బారులు తీరారు. లడ్డూ ప్రసాదం ఒకరికి రెండు మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలయంలో విశేష పూజలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ఆది వారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయం భూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకించి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఉత్స వ మూర్తులను ప్రత్యేక సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. కల్యాణ మండపంలో స్వా మివారి నిత్యకల్యాణాలు జరిపించారు.
కాగా ఆదివారం వివిధ విభాగాల ద్వారా 14, 65,729 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ కృష్ణవేణి, ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యు లు, కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నరసిం హామూర్తి, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, రామరావు, లక్ష్మణ్, నరేందర్ పాల్గొన్నారు.