Yajna
-
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్‌పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్‌పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్‌సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
ఘనంగా లలితా పారాయణ యజ్ఞం
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో శ్రీలలితా పారాయణ పరిషత్ ఆధ్వర్యంలో 54రోజులుగా నిర్వహిస్తున్న శ్రీలలితా పారాయణం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీలలితా పారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ లలితా మాతకు, శ్రీలక్ష్మిగణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులతో లలితా పారాయణాన్ని పఠిస్తూ శ్రీలలితా యజ్ఞం నిర్వహించారు. అనంతరం 18 రకాల వనమూలికలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, ఈగా దయాకర్, విద్యాసాగర్‌రావు, తాళ్లపల్లి రామయ్య, పాపిరెడ్డి, బెలిదె అశోక్, సురేష్, యామా వెంకటేశ్వర్లు, నూకా ముత్యాలమ్మ, నాగమణి, రత్నమాల, పద్మ, విజయలక్ష్మి, సంపత్, జగన్నాథశర్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హనుమ యాగము
యాదగిరిగుట్ట: స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠి చేపట్టిన హనుమ యాగము మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గణపతి పూజ, యాగ సంకల్పం, కలశస్థాపన, మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, సాయంత్రం స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త హవనము, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. ఉదయం జరిగిన పూజల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర, యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని కోరుతూ యాగాన్ని చేపట్టినట్లు వెంకటరామ సూర్యనారాయణ తెలిపారు. ఈ పూజల్లో గుళ్లపల్లి సీతారామ ఫణికుమారశర్మ, కనకదండి శ్రీకాంత్ శర్మ, హిందుదేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, రచ్చ యాదగిరి, రచ్చ శ్రీనివాస్, కర్రె ప్రవీణ్, గాయత్రి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. -
అదే బ్రహ్మవిద్య!
ముండకోపనిషత్ ‘ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామదేవాః... ఓం శాంతిశ్శాంతి శాంతిః’ (శాంతిమంత్రం). తలలు బోడులైనంత మాత్రాన సన్న్యాసులు కారు. తలపులు (ఆలోచనలు, ఊహలు, కోరికలు) బోడులైనవారే నిజమైన సన్న్యాసులు. ఈ ముండకోపనిషత్తు అటువంటివారికోసం ఆవిర్భవించింది. ముండకం అంటే నున్నగా క్షౌరం చేసేది అని అర్థం. పరిణతి చెందినవారు ఎవరైనా దీనిని వినవచ్చు. దేవతలలో మొదటివాడు, సృష్టికర్త, జగద్రక్షకుడు అయిన బ్రహ్మదేవుడు తన పెద్దకొడుకు అధర్వునికి అన్ని విద్యలలో శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను ఉపదేశించాడు. అధర్వుడు ఆ విద్యను అంగిరునికి ఉపదేశించాడు. అంగిరుడు సత్యవంతునికి బోధించాడు. సంప్రదాయ బద్ధం గా ప్రసరిస్తున్న ఈ విద్యను అంగిరుని వంశస్థుడైన అంగిరసునికి చెప్పాడు. ఒకప్పుడు శౌనకుడు అనే మరో గృహస్థు వినయవిధేయతలతో అంగిరసుని పూజించి ‘భగవాన్ దేనిని తెలుసుకోవటం వల్ల అంతా తెలుస్తుందో చెప్పండి’ అని అడిగాడు. అంగిరసుడు శౌనకునకు అందజేసిన సమగ్రమైన బ్రహ్మవిద్యయే ఈ ముండకోనిషత్తు. ‘‘శౌనకా! పరా, అపరా అని విద్యలు రెండు విధాలు. అక్షరమైన అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చే విద్య పరావిద్య. కంటికి కనపడ నిదీ, పట్టుకోవడానికి దొరకనిదీ, పుట్టుక, రంగు, కాళ్లు, చేతులు, కన్ను, ముక్కు వంటి అవయవాలు లేనిదీ, నిత్యమైనదీ, అంతటా వ్యాపించినదీ, పరమసూక్ష్మమైనదీ, నాశనం లేనిదీ, సమస్త సృష్టికి పుట్టుకచోటు అయిన పరబ్రహ్మజ్ఞానాన్ని ధీరులు మాత్రమే పొందగలరు. వారే చూడగలరు. సాలెపురుగు తనలోనుంచి దారాలను సృష్టించుకుని, వాటితో గూడు ఎలా అల్లుకుంటుందో, భూమిలో నుంచి ఓషధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో, మనిషి తలనుంచి శరీరం నుంచి వెంట్రుకలు సహజంగా ఎలా పుడుతున్నాయో అలాగే అక్షర పరబ్రహ్మం నుండి ఈ విశ్వం అంతా ఏర్పడుతోంది. తపస్సుతో ఆ బ్రహ్మపదార్థం చైతన్యవంతం అవుతుంది. దానినుండి అన్నం పుడుతుంది. ఆహారం నుంచి ప్రాణం ఏర్పడుతుంది. ప్రాణం నుంచి మనస్సు, సత్యమూ, లోకాలు, కర్మలు వాని నుండి అమృతమూ రూపొందుతున్నాయి. సర్వజ్ఞుడూ, సర్వవిద్యాస్వరూపుడు, జ్ఞానమయమైన తపస్సు రూపంలో ఉండేవాడు అయిన నిరాకార పరబ్రహ్మం నుండి పేర్లు, రూపాలు గల ప్రాణులు, ఆహార పదార్థాలు జన్మిస్తున్నాయి. అగ్నికార్యం చేసేటప్పుడు హోమకుండంలో సమిధలతో చక్కగా మండే అగ్నిలో మధ్యలో పడేటట్టు ఆహుతులను శ్రద్ధగా వెయ్యాలి. యజ్ఞంతో మాత్రమే పుణ్యలోకాలు వస్తాయని మిగిలిన బాధ్యతలు వదులుకోకూడదు. యజ్ఞకర్మలే శ్రేయోదాయకం అనుకునేవాడు మూఢుడు. అటువంటివారు మళ్లీ పుట్టి జరామరణాలకు లోనవుతారు. ఇది ముండకోపనిషత్తులో అంగిరసుడు శౌనకునికి చెప్పిన మొదటి ముండకంలోని మొదటి ఖండం. ఇలా ఈ ఉపనిషత్తు మొత్తం మూడు ముండకాలు, ఆరు ఖండాలుగా ఉంది. ప్రథమ ముండకం- ద్వితీయ ఖండం శౌనకా! ఋషులు మంత్రాలలో ఏ యజ్ఞకర్మలను చూశారో అవి అన్నీ సత్యమే. అవన్నీ ఋక్, యజుస్, సామవేదాలలో పలువిధాలుగా వర్ణించబడ్డాయి. సత్యకాములారా! ఆ యజ్ఞకర్తలన్నిటినీ నియమ నిష్ఠలతో మీరు ఆచరించండి. పుణ్యలోకాలకు చేరుకోవడానికి మీకు ఇది ఒక్కటే మార్గం. అమావాస్య, పౌర్ణమి, చాతుర్మాస్యం, పంటకుప్ప నూర్పిడి పనులు మొదలైన కర్తవ్యాలు మానుకొని యజ్ఞం చేసినా, అతిథులు లేకుండా భోజనం చేసినా, విశ్వేదేవతలకు ఆహుతులు ఇవ్వకపోయినా, యథావిధిగా ఆచరించకపోయినా అలా యజ్ఞం చేసినవాడికి ఏడు తరాలు పుణ్యలోకాలు నశించిపోతాయి. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే ఏడు పేర్లతో ఏడు జ్వాలలు అగ్నిహోత్రునికి ఏడు నాలుకలు. ఈ ఏడు జ్వాలలు బాగా ప్రజ్వలించేటప్పుడు సమయానుగుణంగా ఆహుతులు ఇస్తూ ఉంటాడో అతణ్ణి అవి సూర్యరశ్మిగా దేవతల ప్రభువైన ఇంద్రుని వద్దకు తీసుకుపోతాయి. వర్ఛస్సుతో ప్రకాశించే ఆహుతులు, యజ్ఞకర్తలకు దారి చూపిస్తూ సూర్యకిరణాల ద్వారా పైలోకాలకు తీసుకుపోతాయి. ప్రేమగా పలకరిస్తాయి. పూజిస్తాయి. ఇదే మా సుకృతం వల్ల లభించిన బ్రహ్మలోకం’అంటాయి. శౌనకా! అజ్ఞానంలో పడి కొట్టుకునేవారు తామే ధీరులమనీ, పండితులమనీ చెప్పుకుంటారు. గుడ్డివాని వెంట నడిచే గుడ్డివారిలాగా దారి తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అవిద్యలో కొట్టుమిట్టాడేవారు పసిపిల్లల్లాగా తమకు తాము కృతార్థులుగా భావిస్తారు. వీరికి కర్మఫలాసక్తి ఉన్నంతవరకు నిత్యజ్ఞానం కలగదు. వారు చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించినా పుణ్యం పూర్తికాగానే మళ్లీ కిందిలోకాలకు వచ్చేస్తారు. మూఢులు యజ్ఞకర్మలే శ్రేష్ఠమనుకుంటారు. ఆ పుణ్యంతో స్వర్గానికి పోయి తిరిగి వస్తూ ఉంటారు. హీనమైన లోకాలకు పోతూ ఉంటారు. నాయనా! జ్ఞానవంతులు శాంతులు, విద్వాంసులు, భిక్షాజీవనులై అరణ్యంలో ఉంటూ శ్రద్ధగా తపస్సు చేస్తారు. వారు తమ పాపాలన్నిటినీ పోగొట్టుకుని సూర్యమండలంలో నుండి అమృతమయమైన, అవ్యయమైన పరబ్రహ్మలో లీనమౌతారు. మోక్షాన్ని పొందదలచినవాడు ఏ కర్మకు ఏ లోకం లభిస్తుందో తెలుసుకుని వాటిపై విరక్తిని పొందాలి. కామ్యకర్మల వల్ల మోక్షాన్ని పొందలేరు. అది తెలుసుకోవడానికి శ్రోత్రియుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువు దగ్గరకు వెళ్లాలి ప్రశాంత చిత్తుడు, శమాన్వితుడు, సాధకుడు అయి తన దగ్గరకు వచ్చిన వానికి సద్గురువు అక్షరమైన బ్రహ్మవిద్యను, సత్యమైన పరబ్రహ్మను గురించి స్పష్టంగా ఉపదేశించాలి’’ అంటూ అంగిరసుడు శౌనకునికి ప్రథమ ముండక ద్వితీయ ఖండాన్ని వివరించాడు. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
అనగనగా ఓ యజ్ఞం
90 ఏళ్ల కారా కాళీపట్నం రామారావు 50 ఏళ్ల కింద- 1966లో ‘యజ్ఞం’ కథ రాశారు. అప్పట్నించి ఇప్పటి వరకూ చదివినవాళ్లూ చదవనివాళ్లూ దాని గురించి మాటలాడుకుంటూనే ఉన్నారు. కాగితాలు కాగితాలు రాసేస్తూనే ఉన్నారు. ఇది ఊరు కథ కాదు దేశం కథ అన్న వాళ్లున్నారు. కాలం కథ అన్నవాళ్లున్నారు. ఓ గ్రామం మౌఢ్యం గురించి గురజాడ రాస్తే దాని రాక్షసం గురించి రాసిన కథ అన్నవాళ్లున్నారు. చదరం ఎండ అని రాశాడంటే ఈ లెక్కల మాస్టరు కొలవకుండా రాయడన్న వాళ్లున్నారు. అంతా బానే ఉంది కాని కొడుకుని చంపడం ఏంటి... టట్.. అన్నవాళ్లున్నారు. ఈ మాస్టరికి రైతు సెంటిమెంటు తెలియదన్నవాళ్లున్నారు. అసలీయన కథ ప్రభుత్వం గుర్తించిందంటే ఇందులో ఏదో మర్మం ఉందని శోధించిన వాళ్లున్నారు. అసలు హరిజనులకి భూములుంటాయా ఓవేళ ఎవడో ఒకరికో ఇద్దరికో ఉంటే మాత్రం అది సమాజమంతటికీ వర్తింపజెయ్యొచ్చా అనీ ఓ ఉద్యమం నడుపుతామని ఎగేసుకుని వెళ్లినవాళ్లున్నారు. ఈ కథని మొయ్యొచ్చా ఇలాంటి తప్పుడు అవగాహన వల్లే మార్క్సు అన్న అసలు విషయాలు మర్చిపోయారు అని అన్నవాళ్లున్నారు. ఇలా ఈ కథ 50 ఏళ్లుగా రకరకాలుగా పొగిడించుకుంటూ తెగిడించుకుంటూ తెగ బతికేస్తోంది. ఇంకో వందేళ్లయినా చూసేట్టుంది. ఈ రామారావుగారు 50 ఏళ్లు నిండకుండానే కొన్ని కథలు రాసేడు. అన్నీ కలిపి ఓ యేబై వేసుకోవ చ్చు. అందులో మంచివి ఓ పాతిక ఉండొచ్చు. గొప్పవి ఓ డజనుండొచ్చు. పాతిక గుర్తుండే కథల్రాసి నలభై ఏళ్లకి పైగా దాని మీద బతికేస్తున్నాడని విసుక్కున్న వాళ్లున్నారు. ఓ కథ రాయటానికి గింజుకుగింజుకు తీసుకుంటాడు ఈయన రచయితా అని ముద్దుముద్దుగా తిట్టుకున్న వాళ్లున్నారు. నిజంగా ఆ కీర్తి మీదే ఆయన బతికేశాడా? చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడా? తన కథలు లేదా సృజన పేరు చెప్పి మెరిగేస్తున్నాడా? రాసిన పుటలు కన్న చించిన కథలు ఎక్కువ అంటాడాయన. ఏమో మనం చూడొచ్చామా? నమ్మొద్దు. అసలు ఆయన కథలు రాయనేలేదనీ ఇంకెవరో రాసేరనీ కూడా మనం తీరీలు పీకొచ్చు. గురజాడ కన్యాశుల్కమే రాయనేదనేసినట్టు... ఉదాహరణకు ఇంత మెత్తటోడు అంతలా దొరికిన తాటిమట్టతో కనిపించని నక్కల మీదకు పరుగెత్తే పిల్లని చూడగలడా.. లోకం నాకు అవుద్ది అనే వెంపటాపు సత్యాన్ని భయం వెనక సత్యంగా మలచగలడా? అసలు భారతీయుడు, తెలుగోడు, ఆ మాటకొస్తే ఇంగ్లిషోడంత ఆలోచించగలడా? ఆవిడెవరో ఆఫ్రికా ఆవిడ తన నవలలో- కొడుకు బానిస కాకూడదని నరికేసే తండ్రిని రాసింది కదా- దానికి నోబెల్ ఇచ్చారు కదా- అజ్జదివీసి నేదంటే ఆ నోటా ఈ నోటా ఇనేసి ఈ మాస్టరు రాసేసి ఇంత కీర్తి కొట్టేసాడా? మాస్టరి పంచెకట్టూ, సెకండ్రీగ్రేడు టీచరు వృత్తీ, మాటాడ్డానికి అన్నిన్ని జాగ్రత్తలు పడటం చూసి అనుమానించి.. మన దృష్టిలో ఉండే ఊహకి భిన్నంగా వాస్తవ రూపం ఉంది కనుక డౌటైతే పడొచ్చు. కాని కారాగారు లక్ష కథల నోము పట్టారనే సంగతిని మాత్రం డౌటు పడటానికి వీల్లేదు. అంటే తన జీవిత కాలంలో కనీసం లక్ష కథలు చదవాలనే నోము. 40 ఏళ్లుగా చూస్తున్నాను. పత్రికో, పుస్తకమో లేకుండా ఆయన్ని చూట్టం గగనం. తన గురించి గప్పాలు కొట్టకుండా ఇంకోళ్ల కథల గురించి డబ్బా కొట్టటం ఇన్నిసార్లు చూసాన్నేను. ఇలా కథలు చదూకుంటూ నవ్వొచ్చినపుడు నవ్వూ... ఏడుపొచ్చినపుడు ఏడుపూ... ఆలోచన వచ్చినపుడు ఆలోచనా... కోపం వచ్చినపుడు కోపం... ఏం కథ ఇది అనిపించినపుడు విరక్తీ... బతికెయ్యొచ్చుగదా... అలాగని చదివీసి ఊరుకోలేదు. రాసినవాళ్లని వెతుక్కుంటూ వెళ్లాడు. ఉత్తరాలప్పుడు ఉత్తరాలు.. ఫోన్లప్పుడు ఫోన్లు.. నీ కథ బావుంది గురూ.. ఇలా రాసి చూడు.. అలా ఆలోచించి చూడు. ఫోను చేసినపుడు పెద్దంత్రం చిన్నంత్రం ఉండాలి గదా అదీలేదు. కథ కదిలించేస్తే ఆ కదలికంతా గొంతులో.. వాళ్లందరూ ఇప్పుడాయన సైన్యం అని నా అనుమానం. ఎందుకంటే రాతగాళ్లకన్నా ఎర్రోళ్లుండరు. ఎవడో చదివానంటే చాలు ఆ వేళ పెళ్లాం పిల్లల్ని సినిమాకు తీసుకుపోయే బాపతు. స్నేహితులకి మందుపోసి మరీ సంబరం పంచుకునే అల్ప సంతోషులు. ఇది తెలిసే ఈయన ఈ స్ట్రాటజీ ఫాలో అయాడా? పోనీ అలా కూడా బతికెయ్యలేదు. త నకి తెలిసిందేంటో వాళ్లు తెలుసుకోవాలని క థాకథనం పేరిట వ్యాసాలు రాసాడు. గింజుకు గింజుకు రాసే ఈ మనిషి కథలెలా రాయాలో ఇంకొకళ్లకి చెప్పేపాటా అని పుసు శర్మ వాపోయాట్ట. కాని అవి కూడా చదవీసి తెలుగు జనాలు ఆహా ఓహో అనీసారు. పోనీ రాసేడు. ఏదో అయింది. ఆ లక్ష కథల నోముల కథ ఏమయింది? రోజుకి అధమపక్షం రెండు కథలు తీసుకున్నా 90 ఏళ్లు అంటే 32,850 రోజులకి 60 లేదా 65 వేలైనా నమిలేసి ఉండాలిగదా.. లేదు. అసలు అన్ని కథలున్నాయా అనీసి డౌటొచ్చిందో ఏంటో 72వ ఏట ఉన్న కథలన్నీ ఓ దగ్గర పడేస్తే పోలా అనుకుని నడుం బిగించాడు. తనకొచ్చిన సాహిత్యం డబ్బులు పెట్టి స్థలం కొన్నాడు. ఇల్లు కట్టాడు. ఉన్న పుస్తకాలు అందులో పెట్టాడు. దాన్ని కథానిలయం అన్నాడు. వచ్చిన ప్రతి కథనీ రచయితలు పుస్తకంగా వేసేస్తారని లెక్కేసి అవి సంపాదించేస్తే చాలని భ్రమపడ్డాడు. నాలాంటోళ్లు వచ్చి అబ్బే పుస్తకాల్లో వచ్చినవి నూటికి ఒకటో రెండో శాతం ఉంటాయంతే అనీసరికి అప్పటికే వచ్చిన చప్పట్లతో బతికెయ్యొచ్చుగదా... లేదు. పత్రికల మీద పడ్డాడు. తిరిగాడండీ.. చిత్తు కాగితాలు పోగేసుకునేవాడిలా తిరిగాడు. అలా పోగేసినవన్నీ పుస్తకాలలో రాసి దాసరి రామచంద్రరావు లాంటి వెర్రాళ్లు దొరికితే రాయించి అది సరింగా లేదనిపించితే అయ్యవార్లంగారేం చేస్తున్నారయ్యా అంటే అన్నట్టు మళ్లీ మళ్లీ కొత్తపుస్తకాల్లో రాసి.. ఏం చెప్పమంటారు.. పదేహేనేళ్లు.. దాంతో ఏం పంజేస్తున్నాడయ్యా ఈ ముసిలాయన అని మెచ్చుకున్నోళ్లు.. పొగట్టానికి తెలుగులో పదాలు దొరక్క నోళ్లు వెళ్లబెట్టినోళ్లు.... పోనీ లక్షకథల నోము మర్చిపోయాడా అంటే అదీలేదు. వెనకబెట్టాడు కాని వదిలిపెట్టలేదు. ఈ బాకీ సంగతి తెలిసే కాబోలు అక్కడెక్కడో ఉన్నాడని చాలామంది నమ్మేవాడు ఆనోము పూర్తయే వరకూ నువ్వక్కడే ఉండనీసీడు. రాసినా చప్పట్లే.. చదివినా చప్పట్లే.. చదివిన వాటి గురించి రాసినా చప్పట్లే.. చప్పట్లు శాశ్వతం కాదని కీర్తికాముడు కథ రాసి తేల్చుకున్న కారాకి చప్పట్లే.. చప్పట్లు... వద్దంటే డబ్బులా. ఆ బరువుని పడిపోకుండా కాసుకుంటా నాబోటాళ్లు దోవ తప్పాడని నొచ్చుకుంటే ఓ దణ్ణంపెట్టి తన మానాన తాను 90 పూర్తి చేసుకుని సాగుతున్నాడు కారా మాస్ట్రు. అందరూ కలిసి ఈ కథానిలయానికి 90 ఏళ్లు నిండుతున్నాయని సంబరాలు ఆరంభించారు. సాధారణ ంగా ఇంద్రుడనీ, చంద్రుడనీ మనిషిని దేవుణ్ణి చేసేసే రాసేయటమే కనిపిస్తుంది ఇలాంటి సంబరాలలో. మరి నా తిక్కలు నావి కదా.. అందుకని సాఫల్యాలతో బాటు వైఫల్యాలూ, నిలబడ్డంతో బాటు పడిపోటాలూ, చెప్పినవాటితోబాటు చెప్పలేకపోటాలూ, తెలియటంతో బాటు తెలియకపోటాలూ.. అన్నీ కలిస్తేనే గదా.. మొత్తం గుదిగుచ్చితేనే కదా.. మనిషి బొమ్మ అవుతుంది. లేకపోతే నాలుగు తలల బ్రహ్మో, పది తలల రావణాసురుడో, మూడుకళ్ల శివుడో అవుతాడుగాని మనిషి అవడనీసి.. నేను అనుకున్నాను. ఇవన్నీ కలిపి చదూకున్న వారికి ఓ వ్యక్తి ఒక సమాజంలోనే పుడతాడనీ, తన కాలానికి అడుగు ముందుకో వెనక్కో తప్ప అతీతంగా ఉండలేడనీ అనిపించాలని నా ఊహ. 90 ఏళ్ల కారా మాస్టారు.. నా తండ్రి తర్వాత నా ఆలోచనలకు కేటలిస్టు, కాళీపట్నం రామారావు గారి లక్ష కథల నోము పూర్తయే వరకూ వదిలేస్తానని భీష్మించుకు కూర్చున్న అదేదో ఉందో లేదో తెలీనిది ఉండుంటే.. దానికి అంత శక్తి ఉండుంటే.. వదిలేస్తే.. అందాకా నేనుంటే.. వందేళ్ల సంబరాలలో కలుసుకుందాం మరి.. సెలవు. - వివిన మూర్తి, 9603234566