అదే బ్రహ్మవిద్య! | special story about homagundam | Sakshi
Sakshi News home page

అదే బ్రహ్మవిద్య!

Published Sun, Jun 5 2016 12:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అదే బ్రహ్మవిద్య! - Sakshi

అదే బ్రహ్మవిద్య!

ముండకోపనిషత్
‘ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామదేవాః... ఓం శాంతిశ్శాంతి శాంతిః’ (శాంతిమంత్రం). తలలు బోడులైనంత మాత్రాన సన్న్యాసులు కారు. తలపులు (ఆలోచనలు, ఊహలు, కోరికలు) బోడులైనవారే నిజమైన సన్న్యాసులు. ఈ ముండకోపనిషత్తు అటువంటివారికోసం ఆవిర్భవించింది. ముండకం అంటే నున్నగా క్షౌరం చేసేది అని అర్థం. పరిణతి చెందినవారు ఎవరైనా దీనిని వినవచ్చు.

దేవతలలో మొదటివాడు, సృష్టికర్త, జగద్రక్షకుడు అయిన బ్రహ్మదేవుడు తన పెద్దకొడుకు అధర్వునికి అన్ని విద్యలలో శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను ఉపదేశించాడు. అధర్వుడు ఆ విద్యను అంగిరునికి ఉపదేశించాడు. అంగిరుడు  సత్యవంతునికి బోధించాడు. సంప్రదాయ బద్ధం గా ప్రసరిస్తున్న ఈ విద్యను అంగిరుని వంశస్థుడైన అంగిరసునికి చెప్పాడు. ఒకప్పుడు శౌనకుడు అనే మరో గృహస్థు వినయవిధేయతలతో అంగిరసుని పూజించి ‘భగవాన్ దేనిని తెలుసుకోవటం వల్ల అంతా తెలుస్తుందో చెప్పండి’ అని అడిగాడు. అంగిరసుడు శౌనకునకు అందజేసిన సమగ్రమైన బ్రహ్మవిద్యయే ఈ ముండకోనిషత్తు.

‘‘శౌనకా! పరా, అపరా అని విద్యలు రెండు విధాలు. అక్షరమైన అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చే విద్య పరావిద్య. కంటికి కనపడ నిదీ, పట్టుకోవడానికి దొరకనిదీ, పుట్టుక, రంగు, కాళ్లు, చేతులు, కన్ను, ముక్కు వంటి అవయవాలు లేనిదీ, నిత్యమైనదీ, అంతటా వ్యాపించినదీ, పరమసూక్ష్మమైనదీ, నాశనం లేనిదీ, సమస్త సృష్టికి పుట్టుకచోటు అయిన పరబ్రహ్మజ్ఞానాన్ని ధీరులు మాత్రమే పొందగలరు. వారే చూడగలరు.

 సాలెపురుగు తనలోనుంచి దారాలను సృష్టించుకుని, వాటితో గూడు ఎలా అల్లుకుంటుందో, భూమిలో నుంచి ఓషధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో, మనిషి తలనుంచి శరీరం నుంచి వెంట్రుకలు సహజంగా ఎలా పుడుతున్నాయో అలాగే అక్షర పరబ్రహ్మం నుండి ఈ విశ్వం అంతా ఏర్పడుతోంది. తపస్సుతో ఆ బ్రహ్మపదార్థం చైతన్యవంతం అవుతుంది. దానినుండి అన్నం పుడుతుంది. ఆహారం నుంచి ప్రాణం ఏర్పడుతుంది. ప్రాణం నుంచి మనస్సు, సత్యమూ, లోకాలు, కర్మలు వాని నుండి అమృతమూ రూపొందుతున్నాయి. సర్వజ్ఞుడూ, సర్వవిద్యాస్వరూపుడు, జ్ఞానమయమైన తపస్సు రూపంలో ఉండేవాడు అయిన నిరాకార పరబ్రహ్మం నుండి పేర్లు, రూపాలు గల ప్రాణులు, ఆహార పదార్థాలు జన్మిస్తున్నాయి.
అగ్నికార్యం చేసేటప్పుడు హోమకుండంలో సమిధలతో చక్కగా మండే అగ్నిలో మధ్యలో పడేటట్టు ఆహుతులను శ్రద్ధగా వెయ్యాలి. యజ్ఞంతో మాత్రమే పుణ్యలోకాలు వస్తాయని మిగిలిన బాధ్యతలు వదులుకోకూడదు. యజ్ఞకర్మలే శ్రేయోదాయకం అనుకునేవాడు మూఢుడు. అటువంటివారు మళ్లీ పుట్టి జరామరణాలకు లోనవుతారు.

ఇది ముండకోపనిషత్తులో అంగిరసుడు శౌనకునికి చెప్పిన మొదటి ముండకంలోని మొదటి ఖండం. ఇలా ఈ ఉపనిషత్తు మొత్తం మూడు ముండకాలు, ఆరు ఖండాలుగా ఉంది.

ప్రథమ ముండకం- ద్వితీయ ఖండం
శౌనకా! ఋషులు మంత్రాలలో ఏ యజ్ఞకర్మలను చూశారో అవి అన్నీ సత్యమే. అవన్నీ ఋక్, యజుస్, సామవేదాలలో పలువిధాలుగా వర్ణించబడ్డాయి. సత్యకాములారా! ఆ యజ్ఞకర్తలన్నిటినీ నియమ నిష్ఠలతో మీరు ఆచరించండి. పుణ్యలోకాలకు చేరుకోవడానికి మీకు ఇది ఒక్కటే మార్గం. అమావాస్య, పౌర్ణమి, చాతుర్మాస్యం, పంటకుప్ప నూర్పిడి పనులు మొదలైన కర్తవ్యాలు మానుకొని యజ్ఞం చేసినా, అతిథులు లేకుండా భోజనం చేసినా, విశ్వేదేవతలకు ఆహుతులు ఇవ్వకపోయినా, యథావిధిగా ఆచరించకపోయినా అలా యజ్ఞం చేసినవాడికి ఏడు తరాలు పుణ్యలోకాలు నశించిపోతాయి.

 కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే ఏడు పేర్లతో ఏడు జ్వాలలు అగ్నిహోత్రునికి ఏడు నాలుకలు. ఈ ఏడు జ్వాలలు బాగా ప్రజ్వలించేటప్పుడు సమయానుగుణంగా ఆహుతులు ఇస్తూ ఉంటాడో అతణ్ణి అవి సూర్యరశ్మిగా దేవతల ప్రభువైన ఇంద్రుని వద్దకు తీసుకుపోతాయి. వర్ఛస్సుతో ప్రకాశించే ఆహుతులు, యజ్ఞకర్తలకు దారి చూపిస్తూ సూర్యకిరణాల ద్వారా పైలోకాలకు తీసుకుపోతాయి. ప్రేమగా పలకరిస్తాయి. పూజిస్తాయి. ఇదే మా సుకృతం వల్ల లభించిన బ్రహ్మలోకం’అంటాయి.

 శౌనకా! అజ్ఞానంలో పడి కొట్టుకునేవారు తామే ధీరులమనీ, పండితులమనీ చెప్పుకుంటారు. గుడ్డివాని వెంట నడిచే గుడ్డివారిలాగా దారి తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అవిద్యలో కొట్టుమిట్టాడేవారు పసిపిల్లల్లాగా తమకు తాము కృతార్థులుగా భావిస్తారు. వీరికి కర్మఫలాసక్తి ఉన్నంతవరకు నిత్యజ్ఞానం కలగదు. వారు చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించినా పుణ్యం పూర్తికాగానే మళ్లీ కిందిలోకాలకు వచ్చేస్తారు. మూఢులు యజ్ఞకర్మలే శ్రేష్ఠమనుకుంటారు. ఆ పుణ్యంతో స్వర్గానికి పోయి తిరిగి వస్తూ ఉంటారు. హీనమైన లోకాలకు పోతూ ఉంటారు.

నాయనా! జ్ఞానవంతులు శాంతులు, విద్వాంసులు, భిక్షాజీవనులై అరణ్యంలో ఉంటూ శ్రద్ధగా తపస్సు చేస్తారు. వారు తమ పాపాలన్నిటినీ పోగొట్టుకుని సూర్యమండలంలో నుండి అమృతమయమైన, అవ్యయమైన పరబ్రహ్మలో లీనమౌతారు. మోక్షాన్ని పొందదలచినవాడు ఏ కర్మకు ఏ లోకం లభిస్తుందో తెలుసుకుని వాటిపై విరక్తిని పొందాలి. కామ్యకర్మల వల్ల మోక్షాన్ని పొందలేరు. అది తెలుసుకోవడానికి శ్రోత్రియుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువు దగ్గరకు వెళ్లాలి

ప్రశాంత చిత్తుడు, శమాన్వితుడు, సాధకుడు అయి తన దగ్గరకు వచ్చిన వానికి సద్గురువు అక్షరమైన బ్రహ్మవిద్యను, సత్యమైన పరబ్రహ్మను గురించి స్పష్టంగా ఉపదేశించాలి’’ అంటూ అంగిరసుడు శౌనకునికి ప్రథమ ముండక ద్వితీయ ఖండాన్ని వివరించాడు.
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement