yakub basha
-
నరకలోకం టు నరలోకం!
2200 సంవత్సరం:నరకానికి వచ్చి బోలెడు సంవత్సరాలవుతున్నా... జస్ట్ నిన్నగాక మొన్న వచ్చినట్లే ఉంది వీరప్పన్‌కు.నరకం చాలా బోర్‌గా ఉంది. ఎక్కడి ఎర్రచందనపు చెక్కలు.... ఎక్కడి మనుషుల వేపుళ్లు! నిద్రలో రోజూ గంధపు చెక్కల సువాసనభరిత కలలే!‘‘ఈ నరకంలో ఒక్క గంధపు చెట్టూ లేదు. ఉన్నా వాటిని కొట్టే చాన్స్ ఇవ్వరు. ఛీ... వెధవ చావు అయిపోయింది’’ నిట్టూర్చాడు వీరప్పన్.ఈలోపే... ‘‘అన్నా గుడ్‌న్యూస్’’ అని పరుగెత్తుకు వచ్చాడు పక్క సెల్లో ఉండే కూరప్పన్.‘‘గుడ్‌న్యూస్ అనే మాట వినక ఎన్ని సంవత్సరాలవుతుందిరా కూరప్పన్. ఇంతకీ ఏమిటా న్యూస్?’’ ఆసక్తిగా అడిగాడు వీరప్పన్.‘‘సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను మన భూలోకంలో జాతీయ పర్వదినాల సందర్భంగా విడుదల చేస్తుంటారు అనే విషయం నీకు తెలుసు కదా! భూలోకంలోలాగే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి సిస్టమే అమలు చేయబోతున్నారు’’ చెప్పాడు కూరప్పన్.‘‘మరి ఇక్కడ జాతీయపర్వదినాలేవీ జరుపుకోరు కదా!’’ అనుమానంగా అడిగాడు వీరప్పన్.‘‘యమధర్మరాజుగారి బర్త్‌డేనే మన జాతీయ పర్వదినం... అది ఎప్పుడో కాదు... ఎల్లుండే... ఈ సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన కొందరు నరకవాసులను విడుదల చేస్తారు’’ అన్నాడు ఆనందంగా కూరప్పన్.‘‘ఇక్కడ సత్ప్రవర్తన లేనిది ఎవడికని? ఈ నరకంలో ప్రతివాడూ చచ్చినట్లు మంచివాడుగానే ఉండాలి. ఈ లెక్కన అందరూ మంచివాళ్లే కదా... మరి అందరినీ ఎలా విడుదల చేస్తారు?’’ అడిగాడు వీరప్పన్.‘‘చాలా మంచి క్వశ్చన్ వేశావు భయ్యా.... ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకునే సార్ బర్త్ డే రోజు లక్కీ డ్రా తీస్తారు. ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఆ ముగ్గురు నిరభ్యంతరంగా భూమి మీద వారి సొంత ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. అక్కడ సుఖంగా జీవించవచ్చు’’ చెప్పాడు కూరప్పన్. ఆరోజు యమధర్మరాజు బర్త్‌డే.‘‘యమధర్మరాజుగారి పుణ్యమా అని తీయని కేక్ తినే మహా అవకాశం మనకు వచ్చింది. ఈ తీయని సందర్భంలో కేక్ కంటే తీయని పాట ఎవరైనా పాడితే చాలా బాగుంటుంది. మీలో ఎవరు పాడతారు?’’ అడిగాడు చిత్రగుప్తుడు.‘‘సర్... నేను పాడతాను’’ అంటూ ‘గానఘోరగంధర్వ’ తిత్తిసత్తిపండు అనే గాయకుడు స్టేజీ మీదకు వచ్చాడు. పాట అనగానే యమధర్మరాజుకు హుషారు వచ్చింది. ‘‘మానవా... త్వరగా పాడవా’’ అన్నాడు. సత్తిపండు ‘యమగోల’ సినిమాలో పాట అందుకున్నాడు...‘సమరానికి నేడే ప్రారంభంయమరాజుకి మూడెన్ ప్రారబ్దంనరకలోకమున కార్మికశక్తికితిరుగులేదని చాటిద్దాం.ఇంక్విలాబ్ జిందాబాద్... ఇంక్విలాబ్ జిందాబాద్... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్’పాట విని యమధర్మరాజుకు యమ మండింది.‘‘ఏమీ అసందర్భ గీతం... అభ్యంతరకర రోతం... నీ ఖేల్ ఖతం... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైటా... వీడిని లెఫ్ట్ వైపుకు తీసుకెళ్లి రైట్ చెంప మీద నాలుగిచ్చుకోండి... అలాగే రైట్ వైపుకు తీసుకెళ్లి... లెఫ్ట్ చెంప మీద నాలుగిచ్చుకోండి. అటు పిమ్మట వీడిని సలసల కాగు నూనెలో లెఫ్ట్ అండ్ రైట్ బాగా కాల్చండి’’ అని ఆదేశించాడు యమధర్మరాజు. బర్త్‌డే వేడుకల అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. యమధర్మరాజు మునిమనవని ముని మునవడు చిరంజీవి ఘనధర్మరాజ్ మూడు చీటీలు తీశాడు. మొదటి పేరు: పీటర్ కాస్గ్రోవ్, ఆస్ట్రేలియా.పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.రెండో పేరు: మాల్కం జఫా జఫా, ఇండోనేసియా.మరోసారి గట్టిగా హర్షధ్వానాలు.‘‘చూశావారా కూరప్పన్... ఇక్కడ కూడా మన ఇండియాకు అన్యాయం జరుగుతుంది’’ అన్నాడు ఆవేదనగా వీరప్పన్. ‘‘బాధ పడకన్నా... ఇంకో అవకాశం ఉంది కదా’’ అంటూ ఓదార్చాడు కూరప్పన్. ఇంతలో మూడో పేరు వినిపించింది. ‘కూసుమునిస్వామి వీరప్పన్, ఇండియా’కలా? నిజమా?... ఆనందం పట్టలేక అదేపనిగా ఏడ్చాడు వీరప్పన్. అందరికీ వీడ్కోలు చెప్పి భూలోకానికి పయనమయ్యాడు. భూలోకానికి రావడంతోనేతమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం టౌన్లో అడుగుపెట్టాడు. అక్కడ అందరూ ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ఉన్నారు.‘‘ఈ టౌన్లో అందరూ మాస్క్‌లు «పెట్టుకొని తిరుగుతున్నారేమిటి?’’ దారిన పోయే దానయ్యను అడిగాడు వీరప్పన్.‘‘ఈ టౌన్ అని ఏమిటి! ఈ భూలోకంలో అన్ని టౌన్లలో, ఊళ్లలో మాస్కులు పెట్టుకుంటున్నారు’’ అన్నాడు దానయ్య.‘‘మాస్క్‌ల గొడవ నాకెందుకుగానీ... ఇక్కడ పెద్ద ఫారెస్ట్ ఉండాలి కదా ఏది?’’ అని ఆరాతీశాడు వీరప్పన్.‘‘ఫారెస్టా? అంటే?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ కుర్రాడు. ‘‘అదేనయ్యా... అడవి... అంటే... పెద్ద ఎత్తున చెట్లన్నీ ఒక చోట ఉండటం... అందులో గంధపు చెట్లు కూడా ఉంటాయి’’ వివరించాడు వీరప్పన్.‘‘మ్యూజియంలో తప్ప ఇప్పుడు చెట్లు ఎక్కడా కనిపించడం లేదు. అడవులనేవి ఇప్పుడు ఎక్కడా లేవు’’ అన్నాడు కుర్రాడు. ‘‘మరి జనాలు ఎలా బతుకుతున్నారయ్యా?’’ ఆశ్చర్యంగా అడిగాడు వీరప్పన్.‘‘టేటినో 3.5 సెవన్ లాక్ 4 బై 2 పేరుతో ఆర్టిఫిషియల్ చెట్లు, ఆర్టిఫిషియల్ గాలి, ఆక్సిజన్ మాస్క్‌లు... ఇలా రకరకాలు వచ్చాయి. కృత్రిమ ఆక్సిజన్ కోసం ఎప్పటికప్పుడు బాడీని రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఈ భూమి మీద నూకలు కాదు చేతిలో డబ్బులు ఉండాలి...’’ అని చెప్పాడు దానయ్య. కాసేపటికి వీరప్పన్ కళ్లు తిరిగాయి. గాలి లేక శ్వాస ఆడటం లేదు.....‘‘ఇతనికి శ్వాస ఆడటం లేదు... ఎయిర్ అంబులెన్స్‌కు ఫోన్ చేయండి...’’ ఎవరో అంటున్నారు.‘‘దయచేసి నన్ను బతికించవద్దు. చెట్లు లేని ఈ భూలోకం కంటే నరకమే ఎన్నో రెట్లు మేలు’’ అంటూనే కన్ను మూసి.... నరకానికి మరోసారి క్షేమంగా చేరుకున్నాడు వీరప్పన్! – యాకుబ్ పాషా -
ఒక కాలనీ కహానీ!
‘‘హలో అప్పారావు... నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగాను. నీ అడ్రసు చెప్పు’’ రైల్వేస్టేషన్ నుంచి బయటికి వస్తూ ఫోన్లో అడిగాడు సుబ్బారావు.‘‘నేరుగా ఆటోలో నా బొంద కాలనీకి వచ్చేయ్’’ అన్నాడు అప్పారావు.‘‘నా బొంద కాలనా?! ఇదేం పేరురా బాబు... జోక్ చేస్తున్నావా!’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.‘‘అదేం లేదు...నువ్వు వచ్చేయ్’’ అన్నాడు అప్పారావు.ఒక గంట తరువాత కాలనీకి చేరుకున్నాడు సుబ్బారావు. ‘నా బొంద కాలనీ’ అనే పెద్దబోర్డ్ ఒకటి అక్కడ కనిపిస్తుంది. ‘‘ఇదేం పేరురా బాబు!’’ అంటూ రెండోసారి జడుసుకున్న సుబ్బారావుకు ఆ కాలనీ ఫ్లాష్‌బ్యాక్‌ను ఇలా చెప్పాడు అప్పారావు... మల్లయ్యగారి పుల్లయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఇంజనీర్. రెండో కొడుకు డాక్టర్. మూడో కొడుకు లాయర్.‘‘ఇలా అయితే ఎలా? ఏదైనా చిన్న ఉద్యోగమైనా చేసి చావండి’’ అని రోజూ చాటుగానో మాటుగానో కొడుకులను తిడుతుండేవాడు పుల్లయ్య.‘అదేమిటి? ఒక కొడుకు ఇంజనీర్, ఒక కొడుకు డాక్టర్, ఇంకో కొడుకు లాయర్ కదా... బోలెడు సంపాదన. మరి ఉద్యోగం చేయాల్సిన ఖర్మ వాళ్లకు ఏమిటి?’ అనే కదా మీ డౌటు.నిజానికి పెద్ద కొడుకు ఇంజనీర్ కాదు. అతడి పేరు ఇంజనీర్. రెండో కొడుకు డాక్టర్ కాదు. అతని పేరు డాక్టర్... మూడో వాడి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్!!భవిష్యత్‌లో ఇంజనీర్, డాక్టర్, లాయర్‌గా చూసుకోవాలనే ఆశతో తన కొడుకులకు... ఆ పేర్లు పెట్టుకొని మురిసిపోయాడు పుల్లయ్య. కానీ ఏం లాభం... ఏ కొడుకూ తన పేరును నిజం చేసుకోలేదు.మిగిలిన కొడుకుల విషయం ఎలా ఉన్నా... తండ్రి తిట్లను తట్టుకోలేక పెద్దకొడుకు ఇంజనీర్ ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలను కున్నాడు. అయితే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాఇంజనీర్ ఇంటర్వ్యూలో మాత్రం ఘోరంగా విఫలమయ్యేవాడు. దీనికి కారణం... అతని అజ్ఞానం మాత్రం కాదు... కేవలం ‘ఊతపదం’. ‘నా బొంద’ అనేది అతని ఊతపదం. ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ ఊతపదం అతని కొంపముంచుతూ ఉద్యోగం రాకుండా చేసేది. అదెలాగో చూద్దాం... ఇంజనీర్ ఎప్పటిలాగే ఒక ఇంటర్వ్యూకు వెళ్లాడు.మేనేజర్: ఏం చదువుకున్నావు? ఇంజనీర్: నా బొందా.... ఆ ఏదో బీఏ చదువుకున్నాను!మేనేజర్ లైట్‌గా ఖంగు తిన్నాడు. మళ్లీ మామూలు మనిషై...‘‘నేను కొన్ని దేశాల పేర్లు చెబుతాను. వాటి రాజధానుల పేర్లు చెప్పు చాలు. ఉద్యోగం ఇస్తాను’’ అన్నాడు మేనేజర్.‘‘ఓకే’’ అన్నాడు ఇంజనీర్.మేనేజర్: ఆఫ్గానిస్తాన్ రాజధాని ఏమిటి?ఇంజనీర్: కాబుల్మేనేజర్: జర్మనీ రాజధాని?ఇంజనీర్: బెర్లిన్మేనేజర్: ఫ్రాన్స్ రాజధాని ఎథెన్స్. అవునా కాదా?ఇంజనీర్: మీ బొంద. ఫ్రాన్స్ రాజధాని ఎథెన్స్ ఏమిటి?! ప్యారిస్మేనేజర్:!!!!!...సరే, ఏవైనా ఆటలు వచ్చా?ఇంజనీర్: నా బొంద! నాకేం వస్తాయండి. అప్పుడప్పుడూ క్యారమ్స్ ఆడేవాడిని. పౌడర్ ఎలర్జీ వల్ల అది కూడా ఆడడం మానేశాను.మేనేజర్: అంతా బాగానే ఉంది కానీ.... మధ్యలో ఈ బొంద ఏమిటి? ఇంజనీర్: ఏదో అలా అనడం అలవాటైపోయింది.... నా బొంద! ఎన్నోసార్లు మానేద్దామని ప్రయత్నించానుగానీ కుదరలేదు.‘‘సరే వెళ్లు!’’ అన్నాడు మేనేజర్.‘‘నా బొంద! మీరు ఏం చెప్పనిదే ఎలా వెళతానండి. ఇంతకీ నాకు ఉద్యోగం ఇస్తున్నట్లా? ఇవ్వనట్లా?’’ డౌటు అడిగాడు ఇంజనీర్.‘‘నా బొంద! ఇప్పుడే అడిగితే ఎలా చెబుతాం. వారం తరువాత మేమే కబురు చేస్తాం’’ అన్నాడు మేనేజర్.అప్పుడే ఫోన్ మోగింది. మేనేజర్ భార్య...‘‘యావండీ... ఇవ్వాళ ఏ కూర వండమంటారు?’’ అని అడిగింది.‘‘ ఏదో ఒక కూర వండిచావు... నా బొందలో కూర’’ అని విసుక్కున్నాడు మేనేజర్.ఆ తరువాత సంస్థ యజమాని అప్పల్నాయుడు నుంచి మేనేజర్‌కు ఫోన్ వచ్చింది.‘‘ఏమిటయ్యా కంపెనీ లాస్లో ఉంది... నువ్వేం చేస్తున్నావు?’’ అని కాస్త కోపంగా అడిగాడు.‘‘నా బొందలో లాసు... అదీ ఓ లాసేనా! వ్యాపారం అన్నాక ఈమాత్రం లాస్ ఉండదా... నా బొంద!’’ అన్నాడు మేనేజర్.మేనేజర్‌తో కొద్దిసేపు మాట్లాడిన తరువాత ‘నా బొంద’ అనే ఊతపదం అప్పల్నాయుడు నోట్లోకి దూరిపోయింది. ఇంజనీర్ పుణ్యమా అని... ‘నా బొంద’ అనే ఊతపదం మేనేజర్ నుంచి అప్పల్నాయుడుకు, అటు నుంచి ఆయన భార్యకు, ఆ తరువాత ఆమె తమ్ముడికి... అలా చుట్టాలు పక్కాలు మొత్తానికి పాకింది. అంతేనా!‘నా బొంద’ ఊతపదం ఉన్నవాళ్లు ఫేస్బుక్లో ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు.అంతేనా! అక్కడితో ఆగలేదు.‘నా బొంద’ అనే ఊతపదం ఉన్నవాళ్లందరూ కలిసి ‘నా బొంద’ పేరుతో ఏకంగా ఒక కాలనీ కట్టుకున్నారు. అది మా కాలనీ కథ!’’ – యాకుబ్ పాషా -
మిషన్ పాజిబుల్
పొడుగురావు ఆ అడవిలో తపస్సు మొదలు పెట్టి ఆరు వారాలు దాటిపోయింది. గడ్డంమీసాలు ఎడాపెడా పెరిగి భయపెడుతున్నాయి. ఒకానొకరోజు తపోసమాధిలో ఉన్న పొడుగురావును ఎవరో భుజం తట్టారు. ‘ఖచ్చితంగా... గాడే’ అనుకుంటూ కళ్లు తెరిచాడు. కానీ ఎదురుగా ఫారెస్ట్ గార్డ్!‘‘ఈ జంగల్ల ఏంచేస్తున్నవయ్యా పెద్దమనిషి?’’ అని పొడుగురావును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. గార్డ్‌తో లొల్లి ఎందుకని, అతని కంటపడకుండా కాస్త దూరంలో పొదల చాటున తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు పొడుగురావు. రెండో రోజు...ఎవరో రావు భుజం తట్టారు. ‘‘ఛ...ఇక్కడ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకోనివ్వడం లేదు ఈ గార్డ్’’ అని తిట్టుకుంటూ కళ్లు తెరిచాడు.కాని ఎదురుగా ఉన్నది గార్డ్ కాదు...స్వయానా గాడ్! ‘భక్తా! టైమ్ వేస్ట్ చేయకుండా నీ బాధ ఏమిటో మూడు ముక్కల్లో చెప్పు’’ చేతికి ఉన్న డైమండ్ వాచ్‌ను చూస్తూ అడిగాడు గాడ్.‘‘నా భార్య నేను ఏది చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేసి బాధ పెడుతుంటుంది. పెళ్లైన కొత్తలో...మీకు ఏ కూర అంటే ఇష్టం ఉండదు? అని అడిగింది. కాకరకాయ కూర అని పొరపాటున చెప్పాను. ఇక చూస్కోండి...మరుసటి రోజు నుంచే కాకర ఇడ్లీలతో పొద్దున టిఫిన్, కాకరపొడితో కాఫీ, కాకరకాయ వేపుడు, కాకర పులుసులతో లంచ్, ఇక రాత్రి కాకర పుల్కాలు...లేస్తే కాకరా... కూర్చుంటే కాకరా...నేనో బకరా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పొడుగురావు. ‘‘ఇప్పుడు నన్నెం చేయమంటావు?’’ సానుభూతిగా అడిగాడు గాడ్.‘‘నా భార్యకు నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా... నాకో వరం ఇవ్వు స్వామి’’ అని గాడ్‌ను దీనంగా వేడుకున్నాడు మిస్టర్ రావు. ‘‘వరాల స్కీమ్ ఎప్పుడో అటకెక్కింది. ఇప్పుడు ఎంత సిన్సియర్ భక్తులకైనా, సీనియర్ భక్తులకైనా వరాలు ఇవ్వడం లేదు. ‘దేవలోకం టైమ్స్’ న్యూస్‌పేపర్ చదవడం లేదా ఏమిటి?’’ ఆరా తీశాడు గాడ్. ‘‘ఆ న్యూస్‌పేపర్ సంగతి నాకెందుగానీ... నాకు విముక్తి లేదా స్వామీ?’’ మరింత దీనంగా అడిగాడు రావు.‘‘వరాలతో పనులయ్యే రోజులు పోయాయి. టెక్నాలజీ ఆ లోటును తీర్చుతుంది. ముంబైలో ఉండే పేరు మోసిన సైంటిస్ట్ జఫ్ఫా జమాల్కర్ ఫోన్ నంబర్ ఇస్తాను. జప్ఫా దగ్గరకు వెళ్లి ‘మిషన్ పాజిబుల్’ అనే మిషిన్‌ను కొంటే సరిపోతుంది. ప్రాబ్లం సాల్వ్’’ అభయం ఇచ్చాడు గాడ్.‘‘ఆ మిషిన్ వల్ల ఉపయోగం ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు పొడుగురావు.‘‘సైబోర్గ్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? కచ్చితంగా విని ఉండవులే. చెప్తాను విను. మనుషుల్లా పనిచేసే రోబోల గురించి నీకు తెలుసు. ఇప్పుడు రివర్స్‌గేర్ అన్నమాట. మనుషులే రోబోల్లా పనిచేసే టెక్నాలజీని మీ సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. మనిషి శరీరంలోకి అతి సూక్ష్మమైన చిప్స్‌లను ప్రవేశపెట్టడం ద్వారా... రోబోతో సమానమైన శక్తిసామర్థ్యాలు మనిషికి వస్తాయి. సైబోర్గ్ సిస్టం ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచలను కూడా నియంత్రించే టెక్నాలజీని జఫ్ఫా జమాల్కర్ కనిపెట్టాడు. సపోజ్... ఒకడు కోపంగా నిన్ను తిట్టడానికి వచ్చాడు అనుకుందాం. ‘మిషన్ పాజిబుల్’లో ‘పొగిడింగ్’ అనే మీటను నొక్కితే చాలు తిట్టడానికి వచ్చినవాడు కాస్తా... నిన్ను వేనోళ్ల పొగిడి పోతాడు. ప్రత్యర్థి మెదడులోకి ‘మిషన్ పాజిబుల్’ చిప్‌ను ప్రవేశపెడితేనే మనం ఇచ్చే కమాండ్స్ వర్కవుటవుతాయి’’ చెప్పాడు గాడ్. ‘థ్యాంక్ గాడ్’ అని చెప్పి సెలూన్లో షేవింగ్ చేసుకోకుండానే డైరెక్ట్‌గా ముంబాయిలోని సైంటిస్ట్ జప్ఫా జమల్కార్ ఇంట్లో ప్రత్యక్షమైన రావు, ‘మిషన్ పాజిబుల్’ మిషిన్‌ను నిమిషాల్లో కొనేశాడు. ‘వెధవ నిద్రా నువ్వూనూ...లే...ఆఫీసుకు టైమవుతుంది’ అని రోజూ తిట్ల దండకం వినిపించే రావు భార్య పంకజం ఈరోజు మాత్రం తన కాళ్లు నొక్కుతూ...‘ఏమండీ...మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోండి. తిన్నాక మళ్లీ పడుకోండి. అవసరమైతే ఆఫీసుకు సెలవు పెట్టండి’ అంటూ ‘భర్తను మించిన భాగ్యం ఉన్నదా!’ అనే పాట అందుకుంది. సంతోషం తట్టుకోలేక ఆనందబాష్పాలు తుడుచుకున్నాడు రావు. ఈ దెబ్బకు నిద్ర నుంచి మెలకువ వచ్చింది. ‘‘ఓస్...ఇప్పటి వరకు నేను కలకన్నానన్నమాట’’ అని నిట్టూర్చాడు విమానంలో నిద్ర నుండి లేచిన రావు. ఫ్లైట్ శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే జెట్ స్పీడ్ వేగంతో ఇంట్లోకి వచ్చి పడ్డాడు. ‘మిషన్ పాజిబుల్’ సహాయంతో చిప్‌ను భార్య పంకజం మెదడులోకి పంపడంలో సక్సెస్ అయ్యాడు . మరుసటి రోజు...‘‘ఒసేయ్ పంకజం...నేనూ ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లకుండా అదే పనిగా తాగుతుంటాను. నువ్వు మధ్య మధ్యలో చికెన్–65, మటన్–25లు వేడివేడిగా అందిస్తూ ఉండాలి. వెళ్లు ...వెళ్లి పనిచూడు’’ భార్యను ఆదేశించాడు రావు. క్షణం గ్యాప్ లేకుండా రావు గూబ గుయ్యిమంది పెద్ద సౌండ్‌తో. పంకజం చేతిలోని అప్పడాల కర్ర రావు తలపై అదేపనిగా సల్సా డ్యాన్స్ చేసింది.‘డ్యామిట్ కథ అడ్డం తిరిగింది’ అని మొత్తుకుంటూ సైంటిస్ట్ జఫ్ఫాను కలవడానికి తిరిగి ముంబైకి వెళ్లాడు రావు. జరిగినదంతా అతనికి చెప్పి ఏడ్చాడు. ‘‘నీ భార్య నీకన్నా తెలివైంది. ముందుగానే జాగ్రత్త పడింది. మిషన్ పాజిబుల్ చిప్‌ను ఎప్పుడో నీ మెదడులో ప్రవేశపెట్టింది. నీ మెదడులో ఆ చిప్ ఉన్నంత వరకు నీ కమాండ్స్ ఎదుటి వ్యక్తి మీద పని చేయవు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మెదడులో నుంచి ఆ చిప్‌ను తీసివేస్తే సరిపోతుంది. మిషన్ ఇంపాజిబుల్ బేషుగ్గా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్లే నీ భార్య వింటుంది. ముందు ఆ చిప్‌ను తీసివేయాలి. ఇలా కూర్చో’’ అని రావును కూర్చోపెట్టి ఏదో యంత్రం బిగించాడు జఫ్ఫా. అయిదు నిమిషాల తరువాత...‘‘అదేంటయ్యా...అసలు నీ తలలో మెదడే లేదు. ఖాళీ బుర్రతో ఇన్ని రోజులు నీ భార్య దగ్గర ఎలా మేనేజ్ చేశావు? ఆ చిప్ మెదడులో తప్పా ఏ శరీరావయవంలోనూ పనిచేయదు. మెదడేలేని నీలో ఆ చిప్ పనిచేయడం అసాధ్యం’’ అని పెదవి విరిచి రావును వెనక్కి పంపిచేశాడు సైంటిస్ట్ జఫ్ఫా. హైదరాబాద్ వెళ్లడానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కూర్చున్న రావుకు ఏదో విషయం చటుక్కున గుర్తొచ్చింది. సంతోషం కట్టలు తెంచుకుంది. ‘వస్తున్నా సార్...’ అంటూ సైంటిస్ట్ ఇంటికి పరుగులు తీశాడు. ‘‘ఏమిటయ్యా మళ్లీ వచ్చావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సైంటిస్ట్.‘‘సార్...నాకు మెదడు లేదని మీరు తేల్చి చెప్పారు. కాని అది నిజం కాదు సార్. నా భార్య పంకజం నన్ను ఎప్పుడూ ఒక తిట్టు తిడుతుంది. ‘నీకు మెదడు తలలో లేదు. మోకాళ్లలో ఉంది’ అని. మోకాళ్లలో ఉన్న ఆ చిప్‌ను తీసివేయండి సార్’’ అని సైంటిస్ట్ కాళ్ల మీద పడ్డాడు పొడుగురావు! – యాకూబ్ పాషా -
ఇట్లు నీ ప్రేమికుడు
గ్రేట్ లవ్‌స్టోరీస్ ‘నీ కనురెప్పను తాకి... చినుకు జీవితం ధన్యమైపోయింది. నీ పాదాల్ని తడిమిన మట్టి... కొత్త పరిమళంతో ఊరేగుతోంది.’ తెల్లటి కాగితం మీద ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అక్షరాలను మురిపెంగా తడిమింది కాంచనమాల. మొయిదీన్ తన కళ్ల ముందున్నట్లే అని పించింది. చిన్నప్పటి నుంచి తనతో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాడు. అతడి గోధుమరంగు కళ్లు, మళ్లీ మళ్లీ వినాలని పించే నవ్వు ఆమెకి చాలా ఇష్టం! కేరళలోని ఇరువజింజి నది ఒడ్డున ఉన్న గ్రామం ‘ముక్కం’. ఇరువజింజి నదే కాంచన-మొయిదీన్‌ల ప్రేమకు సాక్షి. ఒకరోజు... ‘‘కాంచనా... నేను నిన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నాను. నువ్వు డాక్టర్ కాకపోయినా ఫరవాలేదుగానీ కుటుంబ పరువును మంటగలపకు. ఆ ముస్లిం కుర్రాడితో తిరగడం మానెయ్’’ అని కుమార్తెను హెచ్చ రించాడు అచ్యుతన్. ‘‘నీవల్ల బయట తలెత్తుకోలేక పోతున్నానురా’’ అంటూ ముఖం కందగడ్డలా చేసుకుని కొడుకును తిట్టడం మొదలుపెట్టాడు ఉన్నిమొయి. అరవయ్యేళ్ల క్రితం... ఒకబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితేనే కలికాలం అని బుగ్గలు నొక్కుకునే రోజుల్లో... వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకోవ డమంటే మాటలు కాదు. అందుకే చదువు మాన్పించి కూతుర్ని ఇంటికి పరిమితం చేశాడు అచ్యుతన్. కొడుకును కత్తితో పొడవడానికి సైతం సిద్ధపడ్డాడు ఉన్ని మొయి. అయిన్పటికీ లేఖల రూపంలో వారి ప్రేమ సజీవంగానే ఉంది. ఎట్టకేలకు ఒకరోజు రహస్యంగా కలుసుకున్నారిద్దరూ. రెండు మూడు రోజుల్లో పారిపోయి పెళ్లి చేసుకోవాలను కున్నారు. విషయం అచ్యుతన్‌కు తెలిసి పోయింది. ఈసారి ఆయన ఆగ్రహంతో ఊగిపోలేదు. ‘‘నీ స్వార్థం నువ్వు చూసు కుంటున్నావు. నీ చెల్లెళ్ల భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వీళ్ల పెళ్లి ఈ జన్మలో జరుగుతుందా!’’ అన్నాడు కన్నీళ్లతో. కరిగిపోయింది కాంచన. చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిపోయేవరకు ఇల్లు దాటి బయటికి వెళ్లకూడదనుకుంది. వెళ్లలేదు కూడా! పెళ్లిళ్లు అయిపోయాయి. ‘ఇక నా పెళ్లి వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు’ అనుకున్న కాంచన పెళ్లికి సిద్ధపడింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ తమ్ముడు చనిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోలేక నాన్న గుండెపోటుతో మరణించాడు. మరోవైపు మొయిదీన్ తండ్రి ఉన్నిమొయి చనిపోయాడు. కాలం దొర్లిపోతోంది. మొయిదీన్ జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. బాధ నుంచి ఉపశమనం కోసం సేవా కార్య క్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. కొద్దికాలం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోదామను కున్నారు. పాస్‌పోర్టుల కోసం ప్రయ త్నాలు మొదలెట్టారు. అప్పుడే విధి వారి జీవితంతో మరోసారి ఆడుకుంది. ఓరోజు పడవలో ఊరికి వస్తున్నప్పుడు, పడవ మునిగిపోయి చనిపోయాడు మొయిదీన్. విలవిల్లాడిపోయింది కాంచన. అతడు లేని లోకంలో ఉండలేనంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కానీ చావు కూడా ఆమెను మోసం చేసింది. దాంతో బతకలేక చావలేక అల్లాడిపోయింది కాంచన. ఆమె వేదన గురించి విన్న మొయిదీన్ తల్లి కాంచనను తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్త గారింట్లోనే ఉంటోంది కాంచన. తమ ఊరిలో ‘మొయిదీన్ సేవా మందిర్’ పేరుతో స్వచ్ఛందసేవా సంస్థను ప్రారంభించింది. ఎన్నో రకాలుగా సేవ చేస్తోంది. ఆ సేవా మందిర్‌లో గోడకు వేళ్లాడుతూ కనిపించే మొయిదీన్ నిలువెత్తు చిత్రం... కాంచనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నేటికీ కవిత్వం చెబుతున్నట్లే ఉంటుంది! మొయిదీన్, కాంచనమాలల ప్రేమకథను మలయాళంలో ‘ఇన్ను నింటె మొయిదీన్’ పేరుతో సినిమా తీసి ఘన విజయం సాధించాడు డెరైక్టర్ ఆర్.ఎస్.విమల్. మొయిదీన్‌గా పృథ్వీరాజ్, కాంచనమాలగా పార్వతి నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలే కాదు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. పృథ్వీరాజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. - యాకూబ్ పాషా -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీ, జాగ్రఫీల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారోవివరించండి. - సీహెచ్ చైతన్యప్రసాద్, బోయిన్పల్లి గతేడాది సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్-1లో హిస్టరీ నుంచి 14 ప్రశ్నల వరకు అడిగారు. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు. కాబట్టి హిస్టరీ నుంచే 140 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఈ పేపర్లోని ప్రశ్నలన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ఛాయిస్ లేదు. ఈ ప్రశ్నలన్నింటినీ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాదిరిగా పది మార్కులకే అడిగినా.. ప్రశ్నల ప్రామాణికత విషయంలో చాలా తేడా ఉంది. ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక దృక్కోణంలో ప్రశ్నలు అడిగారు. ఉదా: 1. దేవాలయ వాస్తు కళా వికాసంలో చోళుల వాస్తు కళను అత్యున్నతమైన దశగా ఎందుకు భావిస్తారు? 2. డల్హౌసీని ఆధునిక భారత నిర్మాతగా నిరూపించండి? ఈ ప్రశ్నల సరళిని బట్టి చూస్తే అభ్యర్థులు గతంలో మాదిరిగా హిస్టరీ విషయంలో సెలెక్టివ్ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదని గమనించాలి. ఇక జాగ్రఫీ నుంచి అణు విద్యుత్, చమురు, సహజవాయువుకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రశ్నలు అడిగారు. సదరన్ స్టేట్స్లో పంచదార మిల్లులు ఎక్కువగా ఉండటానికి, పత్తి, వస్త్ర పరిశ్రమలు వికేంద్రీకృతం కావడానికి గల కారణాలను విశ్లేషించండి? పశ్చిమ కనుమల్లో నదులు డెల్టాలను ఏర్పరచకపోవడానికి కారణాలేంటి? లాంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. ‘తూర్పు కోస్తా తీరంలో ఫైలిన్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా తుపానులకు ఏవిధంగా పేర్లు పెడతారు? - వివరించండి’ లాంటి ప్రశ్నల తీరును చూస్తే ఇవన్నీ వర్తమాన వ్యవహారాలకు అనుసంధానంగానే ఉంటున్నట్లు గమనించవచ్చు. చిన్నరాష్ట్రాలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో ‘ప్రాంతీయవాదం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది - వివరించండి’ అని అడిగారు. ప్రపంచీకరణ భారతదేశంలో ఏజ్డ్ పాపులేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? భారతదేశంలో పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎదురయ్యే సామాజిక సమస్యలను చర్చించండి - లాంటి ప్రశ్నలు కూడా సమకాలీన పరిస్థితులపైనే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు వర్తమాన పరిస్థితులను గమనిస్తూ వాటికి సంబంధించిన చారిత్రక అంశాలపై దృష్టి సారించాలి. దీని కోసం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. మారుతున్న ప్రశ్నల సరళిని దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కోణంలో పరిశీలిస్తూ సన్నద్ధమవ్వాలి. ఈ విషయంలో ప్రామాణిక పుస్తకాలు బాగా తోడ్పడతాయి. ఇన్పుట్స్: యాకూబ్ బాష, గురజాల శ్రీనివాసరావు,సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ