మిషన్‌ పాజిబుల్‌ | Mission Possible | Sakshi
Sakshi News home page

మిషన్‌ పాజిబుల్‌

Published Sat, Dec 2 2017 11:51 PM | Last Updated on Sat, Dec 2 2017 11:51 PM

Mission Possible - Sakshi

పొడుగురావు ఆ అడవిలో తపస్సు మొదలు పెట్టి ఆరు వారాలు దాటిపోయింది. గడ్డంమీసాలు ఎడాపెడా పెరిగి భయపెడుతున్నాయి. ఒకానొకరోజు తపోసమాధిలో ఉన్న పొడుగురావును ఎవరో భుజం తట్టారు. ‘ఖచ్చితంగా... గాడే’ అనుకుంటూ కళ్లు తెరిచాడు. కానీ ఎదురుగా ఫారెస్ట్‌ గార్డ్‌!‘‘ఈ జంగల్ల ఏంచేస్తున్నవయ్యా  పెద్దమనిషి?’’ అని పొడుగురావును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. గార్డ్‌తో లొల్లి ఎందుకని, అతని కంటపడకుండా కాస్త దూరంలో పొదల చాటున తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు పొడుగురావు. రెండో రోజు...ఎవరో రావు భుజం తట్టారు. ‘‘ఛ...ఇక్కడ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకోనివ్వడం లేదు ఈ గార్డ్‌’’ అని తిట్టుకుంటూ కళ్లు తెరిచాడు.కాని ఎదురుగా ఉన్నది గార్డ్‌ కాదు...స్వయానా గాడ్‌! ‘భక్తా! టైమ్‌ వేస్ట్‌ చేయకుండా నీ బాధ ఏమిటో మూడు ముక్కల్లో చెప్పు’’ చేతికి ఉన్న డైమండ్‌ వాచ్‌ను చూస్తూ అడిగాడు గాడ్‌.‘‘నా భార్య నేను ఏది చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేసి బాధ పెడుతుంటుంది. పెళ్లైన కొత్తలో...మీకు ఏ కూర అంటే ఇష్టం ఉండదు? అని అడిగింది. కాకరకాయ కూర అని పొరపాటున చెప్పాను. ఇక చూస్కోండి...మరుసటి రోజు నుంచే కాకర ఇడ్లీలతో పొద్దున టిఫిన్, కాకరపొడితో కాఫీ,  కాకరకాయ వేపుడు, కాకర పులుసులతో లంచ్, ఇక రాత్రి కాకర పుల్కాలు...లేస్తే కాకరా... కూర్చుంటే కాకరా...నేనో బకరా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పొడుగురావు.

‘‘ఇప్పుడు నన్నెం చేయమంటావు?’’ సానుభూతిగా అడిగాడు గాడ్‌.‘‘నా భార్యకు నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా... నాకో వరం ఇవ్వు స్వామి’’ అని గాడ్‌ను దీనంగా వేడుకున్నాడు మిస్టర్‌ రావు.
‘‘వరాల స్కీమ్‌ ఎప్పుడో అటకెక్కింది. ఇప్పుడు ఎంత సిన్సియర్‌ భక్తులకైనా, సీనియర్‌ భక్తులకైనా వరాలు ఇవ్వడం లేదు. ‘దేవలోకం టైమ్స్‌’ న్యూస్‌పేపర్‌ చదవడం లేదా ఏమిటి?’’ ఆరా తీశాడు గాడ్‌.
‘‘ఆ న్యూస్‌పేపర్‌ సంగతి నాకెందుగానీ... నాకు విముక్తి లేదా స్వామీ?’’ మరింత దీనంగా అడిగాడు రావు.‘‘వరాలతో పనులయ్యే రోజులు పోయాయి. టెక్నాలజీ ఆ లోటును తీర్చుతుంది. ముంబైలో ఉండే పేరు మోసిన సైంటిస్ట్‌ జఫ్ఫా జమాల్కర్‌ ఫోన్‌ నంబర్‌ ఇస్తాను. జప్ఫా దగ్గరకు వెళ్లి ‘మిషన్‌ పాజిబుల్‌’ అనే మిషిన్‌ను కొంటే సరిపోతుంది.  ప్రాబ్లం సాల్వ్‌’’ అభయం ఇచ్చాడు గాడ్‌.‘‘ఆ మిషిన్‌ వల్ల ఉపయోగం ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు పొడుగురావు.‘‘సైబోర్గ్‌ అనే పదం ఎప్పుడైనా విన్నావా? కచ్చితంగా విని ఉండవులే. చెప్తాను విను. మనుషుల్లా పనిచేసే రోబోల గురించి నీకు తెలుసు. ఇప్పుడు రివర్స్‌గేర్‌ అన్నమాట. మనుషులే రోబోల్లా పనిచేసే టెక్నాలజీని మీ సైంటిస్టులు డెవలప్‌ చేస్తున్నారు. మనిషి శరీరంలోకి అతి సూక్ష్మమైన చిప్స్‌లను ప్రవేశపెట్టడం ద్వారా... రోబోతో సమానమైన శక్తిసామర్థ్యాలు మనిషికి వస్తాయి. సైబోర్గ్‌ సిస్టం ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచలను కూడా నియంత్రించే టెక్నాలజీని  జఫ్ఫా జమాల్కర్‌ కనిపెట్టాడు. సపోజ్‌... ఒకడు కోపంగా నిన్ను తిట్టడానికి వచ్చాడు అనుకుందాం. ‘మిషన్‌ పాజిబుల్‌’లో ‘పొగిడింగ్‌’ అనే మీటను నొక్కితే చాలు తిట్టడానికి వచ్చినవాడు కాస్తా... నిన్ను వేనోళ్ల పొగిడి పోతాడు. ప్రత్యర్థి మెదడులోకి ‘మిషన్‌ పాజిబుల్‌’ చిప్‌ను ప్రవేశపెడితేనే మనం ఇచ్చే కమాండ్స్‌ వర్కవుటవుతాయి’’ చెప్పాడు గాడ్‌.

‘థ్యాంక్‌ గాడ్‌’ అని చెప్పి సెలూన్‌లో షేవింగ్‌ చేసుకోకుండానే డైరెక్ట్‌గా ముంబాయిలోని సైంటిస్ట్‌ జప్ఫా జమల్కార్‌ ఇంట్లో ప్రత్యక్షమైన  రావు,  ‘మిషన్‌ పాజిబుల్‌’ మిషిన్‌ను నిమిషాల్లో కొనేశాడు.
‘వెధవ నిద్రా నువ్వూనూ...లే...ఆఫీసుకు టైమవుతుంది’ అని రోజూ తిట్ల దండకం వినిపించే రావు భార్య పంకజం ఈరోజు మాత్రం తన కాళ్లు నొక్కుతూ...‘ఏమండీ...మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోండి. తిన్నాక మళ్లీ పడుకోండి. అవసరమైతే ఆఫీసుకు సెలవు పెట్టండి’ అంటూ  ‘భర్తను మించిన భాగ్యం ఉన్నదా!’ అనే పాట అందుకుంది. సంతోషం తట్టుకోలేక ఆనందబాష్పాలు తుడుచుకున్నాడు రావు. ఈ దెబ్బకు నిద్ర నుంచి మెలకువ వచ్చింది. ‘‘ఓస్‌...ఇప్పటి వరకు నేను కలకన్నానన్నమాట’’ అని నిట్టూర్చాడు విమానంలో నిద్ర నుండి లేచిన రావు. ఫ్లైట్‌ శంషాబాద్‌లో ల్యాండ్‌ కాగానే జెట్‌ స్పీడ్‌ వేగంతో ఇంట్లోకి వచ్చి పడ్డాడు. ‘మిషన్‌ పాజిబుల్‌’ సహాయంతో చిప్‌ను భార్య పంకజం మెదడులోకి పంపడంలో సక్సెస్‌ అయ్యాడు . మరుసటి రోజు...‘‘ఒసేయ్‌ పంకజం...నేనూ ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లకుండా అదే పనిగా తాగుతుంటాను. నువ్వు మధ్య మధ్యలో చికెన్‌–65, మటన్‌–25లు వేడివేడిగా అందిస్తూ ఉండాలి. వెళ్లు ...వెళ్లి పనిచూడు’’ భార్యను ఆదేశించాడు రావు. క్షణం గ్యాప్‌ లేకుండా రావు గూబ గుయ్యిమంది పెద్ద సౌండ్‌తో. పంకజం చేతిలోని అప్పడాల కర్ర రావు తలపై అదేపనిగా సల్సా డ్యాన్స్‌ చేసింది.‘డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అని మొత్తుకుంటూ సైంటిస్ట్‌ జఫ్ఫాను కలవడానికి తిరిగి ముంబైకి వెళ్లాడు రావు. జరిగినదంతా అతనికి చెప్పి ఏడ్చాడు.

‘‘నీ భార్య నీకన్నా తెలివైంది. ముందుగానే జాగ్రత్త పడింది. మిషన్‌ పాజిబుల్‌ చిప్‌ను ఎప్పుడో నీ మెదడులో ప్రవేశపెట్టింది. నీ మెదడులో ఆ చిప్‌ ఉన్నంత వరకు నీ కమాండ్స్‌ ఎదుటి వ్యక్తి మీద పని చేయవు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మెదడులో నుంచి ఆ చిప్‌ను తీసివేస్తే సరిపోతుంది. మిషన్‌ ఇంపాజిబుల్‌ బేషుగ్గా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్లే  నీ భార్య వింటుంది. ముందు  ఆ చిప్‌ను తీసివేయాలి. ఇలా కూర్చో’’ అని రావును కూర్చోపెట్టి ఏదో యంత్రం బిగించాడు జఫ్ఫా. అయిదు నిమిషాల తరువాత...‘‘అదేంటయ్యా...అసలు నీ తలలో మెదడే లేదు. ఖాళీ బుర్రతో ఇన్ని రోజులు నీ భార్య దగ్గర ఎలా మేనేజ్‌ చేశావు? ఆ చిప్‌ మెదడులో తప్పా ఏ శరీరావయవంలోనూ పనిచేయదు. మెదడేలేని నీలో ఆ చిప్‌ పనిచేయడం అసాధ్యం’’ అని పెదవి విరిచి రావును వెనక్కి పంపిచేశాడు  సైంటిస్ట్‌ జఫ్ఫా. హైదరాబాద్‌ వెళ్లడానికి ముంబై  ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కూర్చున్న రావుకు ఏదో విషయం చటుక్కున గుర్తొచ్చింది. సంతోషం కట్టలు తెంచుకుంది. ‘వస్తున్నా  సార్‌...’ అంటూ  సైంటిస్ట్‌ ఇంటికి పరుగులు తీశాడు.
‘‘ఏమిటయ్యా మళ్లీ వచ్చావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సైంటిస్ట్‌.‘‘సార్‌...నాకు మెదడు లేదని మీరు తేల్చి చెప్పారు. కాని అది నిజం కాదు సార్‌. నా భార్య పంకజం నన్ను ఎప్పుడూ  ఒక తిట్టు తిడుతుంది. ‘నీకు మెదడు తలలో లేదు. మోకాళ్లలో ఉంది’ అని.  మోకాళ్లలో ఉన్న ఆ చిప్‌ను తీసివేయండి సార్‌’’ అని సైంటిస్ట్‌ కాళ్ల మీద పడ్డాడు పొడుగురావు!
– యాకూబ్‌ పాషా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement