సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీ, జాగ్రఫీల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారోవివరించండి.
- సీహెచ్ చైతన్యప్రసాద్, బోయిన్‌పల్లి
గతేడాది సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్-1లో హిస్టరీ నుంచి 14 ప్రశ్నల వరకు అడిగారు. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు. కాబట్టి హిస్టరీ నుంచే 140 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఈ పేపర్‌లోని ప్రశ్నలన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ఛాయిస్ లేదు. ఈ ప్రశ్నలన్నింటినీ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాదిరిగా పది మార్కులకే అడిగినా.. ప్రశ్నల ప్రామాణికత విషయంలో చాలా తేడా ఉంది. ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక దృక్కోణంలో ప్రశ్నలు అడిగారు.
ఉదా: 1. దేవాలయ వాస్తు కళా వికాసంలో చోళుల వాస్తు కళను అత్యున్నతమైన దశగా ఎందుకు భావిస్తారు?
2. డల్హౌసీని ఆధునిక భారత నిర్మాతగా నిరూపించండి?
ఈ ప్రశ్నల సరళిని బట్టి చూస్తే అభ్యర్థులు గతంలో మాదిరిగా హిస్టరీ విషయంలో సెలెక్టివ్ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదని గమనించాలి. ఇక జాగ్రఫీ నుంచి అణు విద్యుత్, చమురు, సహజవాయువుకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రశ్నలు అడిగారు. సదరన్ స్టేట్స్‌లో పంచదార మిల్లులు ఎక్కువగా ఉండటానికి, పత్తి, వస్త్ర పరిశ్రమలు వికేంద్రీకృతం కావడానికి గల కారణాలను విశ్లేషించండి? పశ్చిమ కనుమల్లో నదులు డెల్టాలను ఏర్పరచకపోవడానికి కారణాలేంటి? లాంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. ‘తూర్పు కోస్తా తీరంలో ఫైలిన్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా తుపానులకు ఏవిధంగా పేర్లు పెడతారు? - వివరించండి’ లాంటి ప్రశ్నల తీరును చూస్తే ఇవన్నీ వర్తమాన వ్యవహారాలకు అనుసంధానంగానే ఉంటున్నట్లు గమనించవచ్చు.
చిన్నరాష్ట్రాలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో ‘ప్రాంతీయవాదం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది - వివరించండి’ అని అడిగారు. ప్రపంచీకరణ భారతదేశంలో ఏజ్‌డ్ పాపులేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?
భారతదేశంలో పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎదురయ్యే సామాజిక సమస్యలను చర్చించండి - లాంటి ప్రశ్నలు కూడా సమకాలీన పరిస్థితులపైనే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు వర్తమాన పరిస్థితులను గమనిస్తూ వాటికి సంబంధించిన చారిత్రక అంశాలపై దృష్టి సారించాలి. దీని కోసం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. మారుతున్న ప్రశ్నల సరళిని దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కోణంలో పరిశీలిస్తూ సన్నద్ధమవ్వాలి. ఈ విషయంలో ప్రామాణిక పుస్తకాలు బాగా తోడ్పడతాయి.
ఇన్‌పుట్స్: యాకూబ్ బాష, గురజాల శ్రీనివాసరావు,సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Thu, Jul 31 2014 10:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement