2200 సంవత్సరం:నరకానికి వచ్చి బోలెడు సంవత్సరాలవుతున్నా... జస్ట్ నిన్నగాక మొన్న వచ్చినట్లే ఉంది వీరప్పన్‌కు.నరకం చాలా బోర్‌గా ఉంది. ఎక్కడి ఎర్రచందనపు చెక్కలు.... ఎక్కడి మనుషుల వేపుళ్లు! నిద్రలో రోజూ గంధపు చెక్కల సువాసనభరిత కలలే!‘‘ఈ నరకంలో ఒక్క గంధపు చెట్టూ లేదు. ఉన్నా వాటిని కొట్టే చాన్స్ ఇవ్వరు. ఛీ... వెధవ చావు అయిపోయింది’’ నిట్టూర్చాడు వీరప్పన్.ఈలోపే... ‘‘అన్నా గుడ్‌న్యూస్’’ అని పరుగెత్తుకు వచ్చాడు పక్క సెల్‌లో ఉండే కూరప్పన్.‘‘గుడ్‌న్యూస్ అనే మాట వినక ఎన్ని సంవత్సరాలవుతుందిరా కూరప్పన్. ఇంతకీ ఏమిటా న్యూస్?’’ ఆసక్తిగా అడిగాడు వీరప్పన్.‘‘సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను మన భూలోకంలో జాతీయ పర్వదినాల సందర్భంగా విడుదల చేస్తుంటారు అనే విషయం నీకు తెలుసు కదా! భూలోకంలోలాగే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి సిస్టమే అమలు చేయబోతున్నారు’’ చెప్పాడు కూరప్పన్.‘‘మరి ఇక్కడ జాతీయపర్వదినాలేవీ జరుపుకోరు కదా!’’ అనుమానంగా అడిగాడు వీరప్పన్.‘‘యమధర్మరాజుగారి బర్త్‌డేనే మన జాతీయ పర్వదినం... అది ఎప్పుడో కాదు... ఎల్లుండే... ఈ సందర్భంగా సత్‌ప్రవర్తన కలిగిన కొందరు నరకవాసులను విడుదల చేస్తారు’’ అన్నాడు ఆనందంగా కూరప్పన్.‘‘ఇక్కడ సత్‌ప్రవర్తన లేనిది ఎవడికని? ఈ నరకంలో ప్రతివాడూ చచ్చినట్లు మంచివాడుగానే ఉండాలి. ఈ లెక్కన అందరూ మంచివాళ్లే కదా... మరి అందరినీ ఎలా విడుదల చేస్తారు?’’ అడిగాడు వీరప్పన్.‘‘చాలా మంచి క్వశ్చన్ వేశావు భయ్యా.... ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకునే సార్ బర్త్ డే రోజు లక్కీ డ్రా తీస్తారు. ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఆ ముగ్గురు నిరభ్యంతరంగా భూమి మీద వారి సొంత ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. అక్కడ సుఖంగా జీవించవచ్చు’’ చెప్పాడు కూరప్పన్.
ఆరోజు యమధర్మరాజు బర్త్‌డే.‘‘యమధర్మరాజుగారి పుణ్యమా అని తీయని కేక్ తినే మహా అవకాశం మనకు వచ్చింది. ఈ తీయని సందర్భంలో కేక్ కంటే తీయని పాట ఎవరైనా పాడితే చాలా బాగుంటుంది. మీలో ఎవరు పాడతారు?’’ అడిగాడు చిత్రగుప్తుడు.‘‘సర్... నేను పాడతాను’’ అంటూ ‘గానఘోరగంధర్వ’ తిత్తిసత్తిపండు అనే గాయకుడు స్టేజీ మీదకు వచ్చాడు. పాట అనగానే యమధర్మరాజుకు హుషారు వచ్చింది. ‘‘మానవా... త్వరగా పాడవా’’ అన్నాడు. సత్తిపండు ‘యమగోల’ సినిమాలో పాట అందుకున్నాడు...‘సమరానికి నేడే ప్రారంభంయమరాజుకి మూడెన్ ప్రారబ్దంనరకలోకమున కార్మికశక్తికితిరుగులేదని చాటిద్దాం.ఇంక్విలాబ్ జిందాబాద్... ఇంక్విలాబ్ జిందాబాద్... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్’పాట విని యమధర్మరాజుకు యమ మండింది.‘‘ఏమీ అసందర్భ గీతం... అభ్యంతరకర రోతం... నీ ఖేల్ ఖతం... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైటా... వీడిని లెఫ్ట్ వైపుకు తీసుకెళ్లి రైట్ చెంప మీద నాలుగిచ్చుకోండి... అలాగే రైట్ వైపుకు తీసుకెళ్లి... లెఫ్ట్ చెంప మీద నాలుగిచ్చుకోండి. అటు పిమ్మట వీడిని సలసల కాగు నూనెలో లెఫ్ట్ అండ్ రైట్ బాగా కాల్చండి’’ అని ఆదేశించాడు యమధర్మరాజు. బర్త్‌డే వేడుకల అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. యమధర్మరాజు మునిమనవని ముని మునవడు చిరంజీవి ఘనధర్మరాజ్ మూడు చీటీలు తీశాడు.
మొదటి పేరు: పీటర్ కాస్‌గ్రోవ్, ఆస్ట్రేలియా.పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.రెండో పేరు: మాల్కం జఫా జఫా, ఇండోనేసియా.మరోసారి గట్టిగా హర్షధ్వానాలు.‘‘చూశావారా కూరప్పన్... ఇక్కడ కూడా మన ఇండియాకు అన్యాయం జరుగుతుంది’’ అన్నాడు ఆవేదనగా వీరప్పన్. ‘‘బాధ పడకన్నా... ఇంకో అవకాశం ఉంది కదా’’ అంటూ ఓదార్చాడు కూరప్పన్. ఇంతలో మూడో పేరు వినిపించింది. ‘కూసుమునిస్వామి వీరప్పన్, ఇండియా’కలా? నిజమా?... ఆనందం పట్టలేక అదేపనిగా ఏడ్చాడు వీరప్పన్. అందరికీ వీడ్కోలు చెప్పి భూలోకానికి పయనమయ్యాడు. భూలోకానికి రావడంతోనేతమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం టౌన్‌లో అడుగుపెట్టాడు. అక్కడ అందరూ ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ఉన్నారు.‘‘ఈ టౌన్‌లో అందరూ మాస్క్‌లు «పెట్టుకొని తిరుగుతున్నారేమిటి?’’ దారిన పోయే దానయ్యను అడిగాడు వీరప్పన్.‘‘ఈ టౌన్ అని ఏమిటి! ఈ భూలోకంలో అన్ని టౌన్లలో, ఊళ్లలో మాస్కులు పెట్టుకుంటున్నారు’’ అన్నాడు దానయ్య.‘‘మాస్క్‌ల గొడవ నాకెందుకుగానీ... ఇక్కడ పెద్ద ఫారెస్ట్ ఉండాలి కదా ఏది?’’ అని ఆరాతీశాడు వీరప్పన్.‘‘ఫారెస్టా? అంటే?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ కుర్రాడు. ‘‘అదేనయ్యా... అడవి... అంటే... పెద్ద ఎత్తున చెట్లన్నీ ఒక చోట ఉండటం... అందులో గంధపు చెట్లు కూడా ఉంటాయి’’ వివరించాడు వీరప్పన్.‘‘మ్యూజియంలో తప్ప ఇప్పుడు చెట్లు ఎక్కడా కనిపించడం లేదు. అడవులనేవి ఇప్పుడు ఎక్కడా లేవు’’ అన్నాడు కుర్రాడు. ‘‘మరి జనాలు ఎలా బతుకుతున్నారయ్యా?’’ ఆశ్చర్యంగా అడిగాడు వీరప్పన్.‘‘టేటినో 3.5 సెవన్ లాక్ 4 బై 2 పేరుతో ఆర్టిఫిషియల్ చెట్లు, ఆర్టిఫిషియల్ గాలి, ఆక్సిజన్ మాస్క్‌లు... ఇలా రకరకాలు వచ్చాయి. కృత్రిమ ఆక్సిజన్ కోసం ఎప్పటికప్పుడు బాడీని రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఈ భూమి మీద నూకలు కాదు చేతిలో డబ్బులు ఉండాలి...’’ అని చెప్పాడు దానయ్య. కాసేపటికి వీరప్పన్ కళ్లు తిరిగాయి. గాలి లేక శ్వాస ఆడటం లేదు.....‘‘ఇతనికి శ్వాస ఆడటం లేదు... ఎయిర్ అంబులెన్స్‌కు ఫోన్ చేయండి...’’ ఎవరో అంటున్నారు.‘‘దయచేసి నన్ను బతికించవద్దు. చెట్లు లేని ఈ భూలోకం కంటే నరకమే ఎన్నో రెట్లు మేలు’’ అంటూనే కన్ను మూసి.... నరకానికి మరోసారి క్షేమంగా చేరుకున్నాడు వీరప్పన్!
– యాకుబ్ పాషా
నరకలోకం టు నరలోకం!
Published Sun, Apr 22 2018 12:04 AM | Last Updated on Sun, Apr 22 2018 12:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment