యాలాల ఎస్‌ఐది ఆత్మహత్యే!
* శవపరీక్షలో వైద్యుల ప్రాథమిక నిర్ధారణ
* దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అనుమానాస్పదస్థితిలో చనిపోయిన రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్‌ది ఆత్మహత్యేనని తేలింది. చెట్టుకు ఉరేసుకోవడంతోనే ఆయన మరణించారని వైద్యులు నిర్వహించిన శవ పరీక్షల్లో ప్రాథమికంగా గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, మెడ ఎముక విరిగిపోయినట్లు నిర్ధారించారు.
ఆత్మహత్యకు పాల్పడడం వల్లే రమేష్ మృతి చెందినట్లు స్పష్టమైన నేపథ్యంలో ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సున్నిత మనస్తత్వం, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడాలనే గట్టి నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలను ఛేదించే పనిలో పడ్డారు. రమేష్‌ది ముమ్మాటికీ హత్యేనని.. ఇద్దరు పోలీసు అధికారులు, మరో రాజకీయ నేతపై మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కేసు మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. మృతుడి కాల్‌డేటాను విశ్లేషించాయి. చనిపోయిన రోజున తాండూరులో కుటుంబ సభ్యులతో కలసి ఎక్కడెక్కడ సంచరించారో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. గతంలో పెద్దేముల్ ఠాణాలో పనిచేసినప్పుడు స్థానిక రాజకీయ నేతతో వైరం ఏర్పడిందని, అతడే రమేష్ మరణానికి కుట్ర చేశారని కుటుంబసభ్యులు ఆరోపించిన నే పథ్యంలో అతడిని పిలిచి తమదైన శైలిలో విచారించారు.
మానసిక స్థితిపై ఆరా: రమేష్ ఆత్మహత్యకు ముందు ఆయన మానసికస్థితి ఎలా ఉందనే కోణంలోనూ దర్యాప్తు బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. పనిచేసిన ఠాణా సిబ్బంది, చనిపోయిన రోజున సహాయకుడిగా వ్యవహరించిన కానిస్టేబుల్ నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ఇదిలావుండగా, ఆత్మహత్య చేసుకున్న రోజున ఆరోగ్య సంబంధిత అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఒక మహిళా వైద్యురాలిని సంప్రదించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఈ కోణంలోనూ వివరాలను రాబట్టేందుకు వైద్యపరీక్షల రిపోర్టులను సేకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు రమేష్ అంత్యక్రియలు అతని స్వగ్రామమైన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లిపెద్దతండాలో శుక్రవారం నిర్వహించారు. రమేష్ అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని తండావాసులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తండావాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హోంమంత్రితో ఫోన్లో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.