yandapalli
-
యండపల్లికే పట్టం
► పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఎన్నిక ► ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం ► వైఎస్సార్సీపీ మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థుల జయకేతనం ► చతికిల పడిన టీడీపీ సాక్షి, చిత్తూరు: రాయలసీమ తూర్పు విభాగం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరోమారు యండపల్లి శ్రీనివాసులకే విద్యావంతులు పట్టం కట్టారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరావిురెడ్డిపై ఘనవిజయాన్ని సాధించారు. వరుసగా రెండోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి విజయకేతనం ఎగుర వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్‌కు మద్దతు పలకడంతో ఉపాధ్యాయుల, పట్టభద్రుల స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పుతో అధికార టీడీపీ చతికిల పడింది. దీంతో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. తూర్పు రాయలసీమ విభాగంలో వరుసగా మూడోసారి కూడా టీడీపీకి ఘోర పరా జయం ఎదురుకావడంతో ఆ పార్టీ వర్గీయుల్లో భవిష్యత్‌పై అంతర్మథనం మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 1,47,907 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 14,551 కాగా మిగిలిన 1,33,202 ఓట్లను అధికారులు పరి గణనలోకి తీసుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత కింద 50 శాతానికి పైబడి ఒక్క ఓటుతో మెజారిటీ సాధించాలంటే 66,602 కోటా ఓట్లు ఒకే అభ్యర్థికి రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత రౌండ్లో యండపల్లి శ్రీని వాసులురెడ్డికి 64,089 ఓట్లు రాగా, పట్టాభిరావిురెడ్డికి 60,898 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్యత కోటా ఓట్ల మెజారిటీకి గాను యండపల్లికి 2,513 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో అధికారులు ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ ప్రక్రియలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ తరువాత యండపలికి మెజారిటీ దక్కింది. దీంతో సమీప ప్రత్యర్థి పట్టాభిరామిరెడ్డిపై 3,232 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. -
మన్నవరం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
– వెంకయ్య, బాబు చేతగాని దద్దమ్మలు : యండపల్లి – ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్దాం : ఎంపీ వరప్రసాద్ – రక్షణ వలయంలో సన్మానమా.. సిగ్గుండాలి : రోజా – ఐక్యవేదిక ద్వారా సాధిద్దాం : భూమన కరుణాకరరెడ్డి తిరుపతి తుడా: రాయలసీమకు వెన్నెముక లాంటి మన్నవరం ప్రాజెక్టు సాధన కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. మన్నవరం పరిశ్రమ సాధన కోసం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షను శనివారం సాయంత్రం ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా యండపల్లి మాట్లాడుతూ సీమ ప్రజల గొంతు నొక్కుతున్న వెంకయ్య, చంద్రబాబులకు ప్రజలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలన్నారు. మన్నవరం తరలించుకు పోతుంటే చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అఖిల పక్షంగా ఏర్పడి మన్నవరం సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్పారు. తన దీక్షకు మద్దతిచ్చిన కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లదాం మన్నవరాన్ని తరలించుకుని పోవాలని చూస్తే ఊరుకోమని ఎంపీ వరప్రసాద్ హెచ్చరించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని తాను ఇప్పటికే కేంద్రానికి గుర్తుచేశామన్నారు. తరలింపు కుట్రను భగ్నం చేసేందుకు అందరం కలసి కట్టుగా ఢిల్లీలో గర్జించి కేంద్రం కల్లు తెరిచేలా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రక్షణ వలయంలో సన్మానమా? ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజల్ని, మన్నవరం, దుగరాజపట్నం ప్రాజెక్టులను అడ్డుకుని సీమ ప్రజలకు తీవ్రం దోహం చేసిన వెంకయ్యనాయుడు రక్షణ వలయంలో సన్మానం చేసుకోవడానికి సిగ్గుండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. దీక్షకు మద్దతిచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ తనను ఎక్కడ అడ్డుకుంటారేమోననే భయంతో వెంకయ్య పోలీసుల చేత దారుణంగా అరెస్టు చేయించారన్నారు. అప్పటి కేంద్ర మంత్రులను ఎదిరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన్నవరం సాధించారన్నారు. 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కలిగించే ఈ ప్రాజెక్టును వెంకయ్య బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలించడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదాను సమాధి చేసినట్టే మన్నవరాన్ని తరలించేందుకు వెంకయ్య, బాబూ పోటీ పడుతున్నారని విమర్శించారు. ఐక్యవేదిక ద్వారా సాధించుకుందాం మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌ను ఐక్యవేదిక ఏర్పాటు చేసి సాధించుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. దీక్షకు దిగిన ఎమ్మెల్సీతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే చంద్రబాబు రోజుకొక దేశంలో తిరిగి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించుకోవడం హాస్యస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6వేల కోట్ల భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుంటే అవినీతి మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ దీక్షకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, గుణశేఖర్ నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం పలికారు.