యండపల్లితో దీక్ష విరమింపజేస్తున్న భూమన కరుణాకర రెడ్డి, ఎంపీ వరప్రసాద్
– వెంకయ్య, బాబు చేతగాని దద్దమ్మలు : యండపల్లి
– ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్దాం : ఎంపీ వరప్రసాద్
– రక్షణ వలయంలో సన్మానమా.. సిగ్గుండాలి : రోజా
– ఐక్యవేదిక ద్వారా సాధిద్దాం : భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి తుడా: రాయలసీమకు వెన్నెముక లాంటి మన్నవరం ప్రాజెక్టు సాధన కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. మన్నవరం పరిశ్రమ సాధన కోసం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన 30 గంటల నిరాహార దీక్షను శనివారం సాయంత్రం ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా యండపల్లి మాట్లాడుతూ సీమ ప్రజల గొంతు నొక్కుతున్న వెంకయ్య, చంద్రబాబులకు ప్రజలంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలన్నారు. మన్నవరం తరలించుకు పోతుంటే చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అఖిల పక్షంగా ఏర్పడి మన్నవరం సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్పారు. తన దీక్షకు మద్దతిచ్చిన కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లదాం
మన్నవరాన్ని తరలించుకుని పోవాలని చూస్తే ఊరుకోమని ఎంపీ వరప్రసాద్ హెచ్చరించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని తాను ఇప్పటికే కేంద్రానికి గుర్తుచేశామన్నారు. తరలింపు కుట్రను భగ్నం చేసేందుకు అందరం కలసి కట్టుగా ఢిల్లీలో గర్జించి కేంద్రం కల్లు తెరిచేలా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
రక్షణ వలయంలో సన్మానమా?
ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజల్ని, మన్నవరం, దుగరాజపట్నం ప్రాజెక్టులను అడ్డుకుని సీమ ప్రజలకు తీవ్రం దోహం చేసిన వెంకయ్యనాయుడు రక్షణ వలయంలో సన్మానం చేసుకోవడానికి సిగ్గుండాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. దీక్షకు మద్దతిచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ తనను ఎక్కడ అడ్డుకుంటారేమోననే భయంతో వెంకయ్య పోలీసుల చేత దారుణంగా అరెస్టు చేయించారన్నారు. అప్పటి కేంద్ర మంత్రులను ఎదిరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన్నవరం సాధించారన్నారు. 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కలిగించే ఈ ప్రాజెక్టును వెంకయ్య బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలించడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదాను సమాధి చేసినట్టే మన్నవరాన్ని తరలించేందుకు వెంకయ్య, బాబూ పోటీ పడుతున్నారని విమర్శించారు.
ఐక్యవేదిక ద్వారా సాధించుకుందాం
మన్నవరం భెల్ ప్రాజెక్ట్‌ను ఐక్యవేదిక ఏర్పాటు చేసి సాధించుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. దీక్షకు దిగిన ఎమ్మెల్సీతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే చంద్రబాబు రోజుకొక దేశంలో తిరిగి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించుకోవడం హాస్యస్పదంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6వేల కోట్ల భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుంటే అవినీతి మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ దీక్షకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, గుణశేఖర్ నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం పలికారు.