444 మంది జలసమాధి!
చైనాలో ఘోర పడవ ప్రమాదం
458 మందితో పర్యాటక విహారానికి బయలుదేరిన భారీ పడవ
తుపానులో చిక్కుకుని బోల్తా.. ఐదుగురి మృతదేహాలు లభ్యం
బీజింగ్: అంతా పెద్ద వయసు వాళ్లు.. చరమాంకంలో హాయిగా గడుపుదానుకున్న వాళ్లు.. ఓ పర్యాటక ప్రదేశాన్ని సందర్శిద్దామని వెళుతున్నవాళ్లు.. కానీ ప్రకృతి బీభత్సానికి బలైపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 444 మంది నీటిలో గల్లంతయ్యారు. వీరందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిలో ప్రయాణిస్తున్న పడవ తుపాను కారణంగా తిరగబడి, మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
చైనా తూర్పు ప్రాంతంలోని నాన్జింగ్ పట్టణం నుంచి యాంగ్జీ నదిలో ‘ఈస్టర్న్ స్టార్ షిప్’ సోమవారం మధ్యాహ్నం 1.15కు (అక్కడి కాలమానం ప్రకారం) బయలుదేరింది. చైనా ప్రభుత్వ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ భారీ పడవ.. మొత్తం 458 మందితో చోంగ్‌కింగ్ పట్టణానికి వెళుతోంది. రాత్రి తొమ్మిదిన్నర సమయంలో జియాన్లీ ప్రాంతంలో పడవ ప్రయాణిస్తుండగా తుపాను విరుచుకుపడింది. రెండు నిమిషాల్లోనే ప్రళయం సృష్టించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో.. 76 మీటర్ల పొడవుతో నాలుగు అంతస్తులున్న ఈ పడవ నీటిలో తిరగబడింది. కొందరు నదిలో కొట్టుకుపోగా, మరికొందరు అందులోనే ఉండిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని గుర్తించిన మరో బోట్లోనివారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సహాయ చర్యలు చేపట్టారు. పడవ కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ సహా 14 మంది ప్రాణాలతో బయటపడగా, ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో 444 మంది జాడ తెలియలేదు. తిరగబడిన ఈ పడవ అడుగుభాగం నీటిపైకి తేలుతూ కనిపిస్తోంది.
అందులోంచి కొందరు కేకలు వేస్తూ, చప్పుడు చేస్తున్నట్లుగా సహాయ చర్యల్లో ఉన్న సిబ్బంది గుర్తించారు. దీంతో నీటిపైకి తేలిఉన్న పడవ అడుగుభాగానికి రంధ్రాలు చేసి ఆక్సిజన్‌ను పంపుతున్నారు. లోపల చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు పెద్ద రంధ్రాలు చేస్తున్నారు. అయితే దీనివల్ల పడవ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సహాయ చర్యలను నేరుగా పర్యవేక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక మంత్రుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపారు.
తుపానే కారణం.. ఈ భారీ పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడానికి కచ్చితమైన కారణమింకా తెలియలేదు. అయితే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పడవ కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ మాత్రం తుపానులో చిక్కుకోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం తెలిసిన వెంటనే చైనా ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. 36 పడవల్లో పోలీసు, అగ్నిమాపక, తీరరక్షక బృందాలను పంపింది. 117 బోట్లు కూడా వెళ్లాయి. సైనికులు, పోలీ సులు, ప్రజలు సహా 4 వేల మంది సహాయ చర్యలు, గాలింపులో పాల్గొంటున్నారు. కానీ ఇంకా తుఫాను, వర్షాల వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది.
అంతా పెద్దవాళ్లే..
ఈ ‘ఈస్టర్న్ స్టార్ షిప్’లో ప్రయాణిస్తున్న 458 మందిలో మూడేళ్ల నుంచి 83 ఏళ్ల వయసువారు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 60 నుంచి 70 ఏళ్ల వయసువారే. ప్రమాదంలో వారంతా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన 14 మందిలో ఇద్దరు వయోవృద్ధులు ఉన్నారు. పడవలో ప్రయాణిస్తున్నవారిలో 406 మంది పర్యాటకులుకాగా, 47 మంది సిబ్బంది, ఐదుగురు గైడ్లు ఉన్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
చైనాలో పడవ నీట మునిగి 444 మంది గల్లంతైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జాడ తెలియకుండా పోయినవారు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లుగా చైనాకు చెందిన సోషల్ వెబ్సైట్ ‘వైబో’లో మోదీ పోస్ట్ చేశారు.