గు‘లాబీ’లకే యంత్ర లక్ష్మి!
* అధికార పార్టీ కార్యకర్తలకే రాయితీ
* పక్కదారి పట్టిన సబ్సిడీ ట్రాక్టర్లు...
* అర్హులైన రైతులకు మళ్లీ మొండిచేయి
* దుర్వినియోగమైన రూ.10 కోట్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘బంగారు తెలంగాణ నిర్మాణంలో రైతుల శ్రేయస్సే మా ప్రభుత్వం లక్ష్యం... వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తాం... ఆధునిక వ్యవసాయ విధానాలైన హరిత పందిళ్లు, యాంత్రీకరణను రైతులకు పరిచయం చేసి బంగారు పంటలు పండేలా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తాం’ అని ప్రభుత్వం వాగ్దానం చేసింది.
ఈ మేరకు నిధులు, యూనిట్లు కూడా మంజూరు చేస్తోంది. అయితే కొందరు అ ధికారులు, అధికార పార్టీ నేతల వైఖరి కారణంగా ఆ పథకా లు పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం మాట లు నీటి మూటలే అవుతున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమిం చి పండించిన పంటను ప్రకృతి వైపరీత్యాలు, దళారులు దెబ్బతీస్తుంటే.. మరోవైపున వారికి రాయితీపై అందే సౌకర్యాలను అధికార పార్టీ కార్యకర్తలు లాగేసుకుంటున్నారు.
వ్యవసాయంలో ఆధునిక విధానాలైన యంత్ర పరికరాల వి నియోగం ద్వారా పంటల దిగుబడి పెంచాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన యూంత్రీకరణ పథకంలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నారుు. రాష్ట వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు కలిసి యంత్రలక్ష్మి పథకం ద్వారా రైతులకు అందవలసిన రాయితీ ట్రాక్టర్లను అధికార పార్టీ కార్యకర్తలకు ధారాదత్తం చేశారు.
ఈ వ్యవహారంపై ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న మంత్రి.. సదరు నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. దీనికి తార్కాణమే జిల్లాలో అమలవుతున్న యంత్రలక్ష్మి పథకం. జిల్లా సహరక్షణ వేదిక సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా వారిచ్చిన సమాచారంతో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక అక్రమ రాయితీలు బయటకు వచ్చాయి.
మండల కమిటీల సిఫారసు జాబితా చెత్తబుట్టలోకి..
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు యూంత్రీకరణ విధానాలను అమలులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన యంత్రలక్ష్మి పథకం ప్రస్తుతం అభాసుపాలవుతోంది. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకే ప్రాధాన్యతనిచ్చిన అధికారులు మండల కమిటీల ద్వారా పంపిన అర్హులైన రైతుల జాబితాను చెత్తబుట్టలో వేసి అనర్హులైన అధికార పార్టీ కార్యకర్తలకు దర్జాగా అప్పగించారు.
50 శాతం రాయితీతో రొటవేటర్లు, కల్టివేటర్లు, నాగళ్లు, చాప్కట్టర్స్, ట్రాక్టర్లు ఈ పథకం ద్వారా రైతులకు అందించాలి. కానీ జిల్లాలో అధికార పార్టీ ‘కష్ట జీవులకు’ అప్పగించారు. 2014-15 సంవత్సరంలో జిల్లాలో ఈ పథకం కింద రూ. 22.86 కోట్లు విడుదల కాగా 202 మందికి 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు మంజూరు చేశారు. దీనిపై లబ్ధిదారులకు రూ.15.15 కోట్లు రాయితీ ఇచ్చారు.
ఇందులో అనేక అక్రమాలు జరిగాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, మండల పరిషత్ అధ్యక్షుడు, ఆదర్శ రైతులు సభ్యులుగా యంత్రలక్ష్మి పథకం అమలు కోసం కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల ద్వారానే అర్హులైన రైతులను యంత్ర పరికరాలు, రాయితీ ట్రాక్టర్ల కోసం ఎంపిక చేయాలి. కానీ అధికార పార్టీ నాయకుల సిఫారసు లేఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని రైతులకు కాని వారికి.. అంటే వ్యాపారస్తులు, వైద్యులు, పార్టీ కోసం పనిచేసిన వారికి లబ్ధి చేకూర్చారు. రాయితీ ట్రాక్టర్లలో 80 శాతం అనర్హులకే చేరడం గమనార్హం. ఇలా జిల్లాలో దాదాపు రూ. 610 కోట్ల మేర అవినీతి జరిగింది.
అక్రమాలకు ఉదాహరణలివే....
మోర్తాడ్‌లో మండల కమిటీ ద్వారా 25 మంది అర్హులైన రైతుల జాబితా పంపగా, తొమ్మిది మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. అయితే కమిటీ పంపిన జాబితా నుంచి ఐదుగురుని మాత్రమే ఎంపిక చేసి, మిగితా నలుగురి పేర్లు జాబితాలో లేకున్నా స్థానిక నాయకుల సిఫారస్ లేఖల ద్వారా ఎంపిక చేయడం విశేషం.
* రెంజల్ మండలంలో ఒక వైద్యుడికి, నిజాంసాగర్‌లో ఇద్దరు వ్యాపారులకు రాయితీ ట్రాక్టర్లను అందజేశారు.
* వేల్పూర్ మండలంలో 11 మందికి రాయితీ ట్రాక్టర్లు అందించగా, అందులో నలుగురు అధికార పార్టీ కార్యకర్తలు, ఉపసర్పంచులు ఉన్నారు. వారిలో ఒకరు రాష్ట్ర విత్తనోత్పత్తి కేంద్రం డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.
* భీంగల్ మండలంలో రాయితీ ట్రాక్టర్లు ఐదుగురికి కేటాయించగా అందులో ఒకరు అధికార పార్టీ టౌన్ అధ్యక్షుడు, మరొకరు మండల ప్రజాప్రతినిధి బంధువు ఉన్నారు. ఇంకో నాయకుడు బినామీ పేరు మీద రాయితీ ట్రాక్టర్ అందుకున్నారు.
* బోధన్ మండలంలో 13 మందికి రాయితీ ట్రాక్టర్లు ఇవ్వగా అందులో ఒకరు సొసైటీ చైర్మన్ (అధికార పార్టీ) కాగా మిగిత నలుగురు పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
* జుక్కల్ మండలంలో రాయితీ ట్రాక్టర్లు ఇద్దరికి కేటాయించగా అందులో ఒకరు జిల్లా పరిషత్ ప్రాధేశిక సభ్యుడు(జడ్పీటీసీ) కాగా, ఇంకొకరు మాజీ సర్పంచ్(అధికార పార్టీ కార్యకర్త).
* డిచ్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో మొత్తం రాయితీ ట్రాక్టర్లు 8 మందికి కేటాయించగా అందులో ఏడుగురు అధికార పార్టీ కార్యకర్తలే ఉండటం గమనార్హం.
లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తేనే స్పందించారు...
జిల్లా సహరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాయితీ ట్రాక్టర్లపై సమాచార హక్కు చట్టం కింద వేదిక ప్రతినిధులు సహదరఖాస్తు చేయగా జిల్లా వ్యవసాయ కార్యాలయ అధికారులు సమాచారం ఇవ్వలేదు. మొదట అప్పీల్ చేసినా స్పందన లేకపోవడంతో సమాచార కమిషన్, లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త జిల్లా వ్యవసాయ అధికారికి, అప్పటి కలెక్టర్‌కు నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న సంయుక్త వ్యవసాయ సంచాలకులు సహరక్షణ వేదిక ప్రతినిధులకు సమాచారం అందించారు.