పాముతో సెల్ఫీ తీసుకుని బుక్కయ్యాడు!
అహ్మదాబాద్: నాగుపాముతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిన వ్యాపారవేత్త ఒకరు తగిన మూల్యం చెల్లించుకున్నారు. వడోదరకు చెందిన యాశేష్ బారోత్ జంతు ప్రేమికులు కాపాడిన కోబ్రాతో సెల్ఫీ తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఈ స్వీయచిత్రాన్ని ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసి 'వెయ్యి రూపాయిలకు కోబ్రా' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు లక్షకు పైగా లైకులు రావడం గమనార్హం. వాట్సాప్ ద్వారా చాలా మంది ఈ ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటో చూసి నేహా పటేల్ అనే జంతు ప్రేమికురాలు ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. యాశేష్ కు రూ.25 వేలు జరిమానా విధించారు. 'కోబ్రాతో తీసుకున్న సెల్ఫీని ఆన్లైన్ లో తానే పెట్టినట్టు యాశేష్ ఒప్పుకున్నాడు. తర్వాత ఈ పోస్ట్ ను తొలగించాడు. అతడికి రూ. 25వేలు జరిమానా విధించాం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత ప్రాణులను అమ్మకానికి పెట్టడం నేరమ'ని వడోదర ఫారెస్ట్ ఆఫీసర్ పీబీ చౌహాన్ తెలిపారు.