మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ భరత్ హతం
యశవంతపుర : హత్యలు, వసూళ్లు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు ఇలా అన్ని రకాల్లో నేరాల్లో ఆరితేరి, ముఠాలు నడుపుతూ బెంగళూరువాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘరానా రౌడీ స్లం భరత్ కథకు పుల్‌స్టాప్ పడింది. ఉత్తరప్రదేశ్‌లో దాక్కున్న అతన్ని పోలీసులు బెంగళూరుకు తీసుకురాగా, అతని అనుచరులు అడ్డగించి విడిపించుకెళ్లారు. ఈ క్రమంలో రౌడీ భరత్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా నేరగాడు హతమైనట్లు పోలీసుల వెల్లడించారు.
గురువారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన కాల్పుల్లో పేరుమోసిన రౌడీ స్లం భరత్ హతమయ్యాడు. 20 రోజుల క్రితం పుట్టినరోజు విందులో తాగి సుబ్రమణ్యనగర సీఐ శివస్వామి, ఎస్ఐ శివరాజ్‌లను వాహనంతో ఢీకొట్టి పరారయ్యాడు. రౌడీ లక్ష్మణ హత్య కేసు, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బెంగళూరు నగరంలో స్లం భరత్ అనేక గొడవల్లో పాల్గొన్నాడు. 150 మంది అనుచరులను వెంటపెట్టుకొని బెంగళూరులో రౌడీయిజంను చలాయించాలని ప్రయత్నాలు చేశాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, పోలీసులపై దాడులతో పాటు రాజగోపాలనగర, కామాక్షిపాళ్య, మాదనాయకనళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో 50కి పైగా కేసులున్నాయి. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. నిత్యం నేరాలతో బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారటంతో అతనికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర విభాగం పోలీçసు అధికారుల ప్రత్యేక బృందాలతో వెంటాడి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉన్న భరత్‌ను బెంగళూరుకు తీసుకొచ్చారు.
పోలీసుల వాహనంపై కాల్పులు జరిపి..
ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్ కథనం మేరకు గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తుమకూరు రోడ్డులోని పీణ్య ఎస్ఆర్ఎస్ బస్‌స్టేషన్ వద్ద స్లం భరత్‌ను తీసుకువస్తుండగా అనుచరులు పోలీసులు జీపును మారుతీ ఓమ్ని, జెన్ కారుతో ఢీకొట్టించారు. కొడవలి, లాంగ్ కత్తులతో పోలీసు జీపుపై దాడి చేసి పోలీసులపై రెండు రౌడ్లు కాల్పులు జరిపారు. సినిమా ఫక్కీలో పోలీసుల అదుపులో ఉన్న భరత్‌ను అనుచరులు విడిపించుకుని జెన్ కారులో పరారయ్యారు. దీంతో పోలీసులు నగరవ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి బెంగళూరు నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో మోహరించారు.
హెసరఘట్ట వద్ద ఎదురుకాల్పులు
తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హెసరఘట్ట చెరువు వద్ద సోలదేవనహళ్లి సమీపంలో జెన్ కారులో స్లం భరత్ ఉన్నట్లు సమాచారం అందింది. తక్షణం రాజగోపాలనగర సీఐ దేనేశ్ పాటిల్, నందిని లేఔట్ సీఐ లోహిత్‌లు చేరుకున్నారు. తనను పట్టుకోవటానికి పోలీసులు వస్తున్న విషయంను గ్రహించి భరత్ పోలీసులపై మూడు రౌడ్లు కాల్పులు జరిపాడు. ఒక బులెట్ సీఐ దినేశ్ కడుపులోకి వెళ్లింది. గతంలో ఇతడు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలు ఉన్న దృష్ట్యా ముందుజాగ్రత్తతో సీఐ దినేశ్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను ధరించాడు. దీనితో స్వల్ప గాయంతో ప్రమాదం నుండి బయట పడ్డారు.
భరత్ రెండో రౌడ్‌ను పోలీసుల జీపుపై గుర్తి పెట్టి కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా భరత్ పట్టించుకోలేదు. దీనితో సీఐ లోహిత్ మొదట గాలిలోకి కాల్పులోకి తరువాత ఆత్మరక్షణ కోసం భరత్‌పై లోహిత్ జరిపిన కాల్పులు జరిపారు. భరత్‌కు బులెట్ తగలటంతో అక్కడిక్కడే కూప్పకూలి పడిపోయాడు. గాయాలైన భరత్‌ను పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.భరత్ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలుసుకున్న అతడి అనుచరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీనితో 10 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనేక మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
భరత్ నేరాల చిట్టా పెద్దదే
బెంగళూరులో తనదైన పంథాను సృష్టించిన భరత్ మృతి బెంగళూరు రౌడీ వర్గాల్లో కలకలం రేపింది. భరత్ అతని అనుచరుల నేర చిట్టా పెద్దదే. బెంగళూరులో అండర్‌వరల్డ్ డాన్ కావాలని కలలు కనేవాడు. 150 మంది అనుచరులను పెట్టుకుని అమాయకులను బెదిరించేవారు. రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జనవరి 19న మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు నిలిపిన వాహనాలను భరత్ అనుచరులు ఆరు మంది నుజ్జునుజ్జు చేశారు. అదే రోజు తెల్లవారు జామున నందినిలేఔట్లో చేతన్ అనే వ్యక్తి కారులో నిద్రిస్తుండగా భరత్ అనుచరులు దాడి చేసి అద్దాలను ధ్వసం చేశారు. అతడి వద్దనున్న 22 వేలు విలువ గల ముబైల్, డబ్బులను దోచుకెళ్లారు. పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలోని తిప్పేనహళ్లి డెల్లి పబ్లిక్ స్కూల్ వద్ద జనవరి 1న హొంబేగౌడనగరలో గిరిశ్ అనే వ్యక్తి పిస్తోల్‌ను చూపించి నగదు, కారును లాక్కోని పరారయ్యారు. సోలదేవనహళ్లి పోలీసుస్టేషన్పరిధిలోని హెసరఘట్ట మెయిన్ రోడ్డులో జనవరి 21న గస్తీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సిద్ధలింగస్వామిలపై భరత్ అనుచరులు దాడి చేశారు. జనవరి 24న సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్ట్ చేయటానికీ వెళ్లగా పోలీసులపై కారును ఎక్కించటానికీ యత్నించారు.