నెరవేరని వాగ్దానాలు.. ఫలించని స్వప్నాలు
కొత్తసీసాలో పాతసారా
ఎఫ్‌డీఐలపై యూటర్న్
‘భూసేకరణ’పై మొండిపట్టు
చతికిలబడిన ఉత్పత్తి
పెదవి విరుస్తున్న లెఫ్ట్
ఆరు దశాబ్దాలుగా నిర్వీర్యమైపోయిన వ్యవస్థలో కొత్త తరహా పాలనను తీసుకువస్తామని ప్రధాని నరేంద్రమోదీ పదే పదే ఉద్ఘాటిస్తున్నప్పుడు గతంలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది అనే ప్రాతిపదికే ఆయన ప్రభుత్వ పనితీరును నిగ్గుతేలుస్తుంది. ఈ కోణంలో మోదీ ఏడాది పాలన మౌలికంగా యూపీయే పాలననే కొనసాగిస్తున్నట్లు వామపక్షాల అభిప్రాయం.
నేటితో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. కోట్లాది రూపాయల వ్యయంతో సాగిన హైటెక్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆయన పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాల హోరు ను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అధికారాన్ని సాధించాలనే మోదీ, బీజేపీ స్వప్నసాకారంలో అద్వితీయ పాత్ర పోషించిన మీడియా ప్రచార మాయ లోంచి బయటపడి వాస్తవాలు చూస్తే.. ఆ వాగ్దానాలు, ఆ స్వప్నాలు నెరవే రుతున్న సంకేతాలు ఏ రంగంలోనూ కనిపించడం లేదని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. భావోద్వేగాలు, ట్వీటర్లు, సెల్ఫీలు, ప్రచారార్భాటా లను పక్కన పెడితే ఒక ఏడాది మోదీ పాలన దేశాన్ని ఎటువైపు తీసుకెళుతోం దన్నది అత్యంత ఆందోళనను కలిగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. భారత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్న సమస్త హక్కులపై నేడు దాడి జరుగుతోందన్నది సుస్పష్టమన్నారు. ఆరోగ్యం, విద్య, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి అత్యంత కీలకమైన రంగాలపై కేంద్ర బడ్జెట్ భారీ కోత విధిం చిందనీ, ఉన్న చిక్కులకు తోడు కొత్త సవాళ్లు దేశాన్ని, ప్రజలను వెంటాడుతు న్నాయనీ పేర్కొన్నారు. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలను దూకుడుగా కొనసాగించడంతోపాటు గణతంత్ర భారత్ ప్రజాస్వామిక పునాదులపై దాడి జరుగుతోందనీ, మతపరమైన విభజన, ఎవరినీ లెక్కచేయని నిరంకుశ పాలన అనేవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనీస పరిధులకు కూడా ప్రమా దం వాటిల్ల చేస్తున్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాల కోణంలో ఏం జరగకూడదో ఆ పరిణామాలన్నీ నేడు నిర్భీతిగా జరిగిపోతున్నాయని వామ పక్షాల అభిప్రాయం..
యూటర్న్ మతలబు: గతంలో రిటైల్ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అను మతించడంపై యుద్ధం ప్రకటించిన బీజేపీ అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకుంది. - 2013 భూసేకరణ బిల్లు ప్రాతిపదికకే తూట్లుపెడుతూ, కొత్త సవరణ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం 3 సార్లు ప్రయత్నించి భంగపడింది. రియల్ ఎస్టేట్ పేరుతో గంపగుత్తగా భూ, సహజ వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పరుగులు తీస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కనీవినీ ఎరుగనంత వేగంతో ప్రయివేటీకరిస్తుండటం కళ్లముందే జరిగిపోతోంది.
గత సంవత్సర కాలంగా దేశ ఉత్పత్తి రంగంలో ఏ పెనుమార్పూ చోటు చేసుకోలేదు. ప్రతి త్రైమాసికంలోనూ వస్తూత్పత్తి, పారిశ్రామికోత్పత్తి చతికిల పడినట్లు నమోదైంది. ధరలపై యుద్ధం ప్రకటించి మరీ గెలిచిన మోదీ ప్రభు త్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూచున్నాయి. అం తర్జాతీయ చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఏడాది కాలంగా ప్రజలకు ప్రయోజనం కల్పించక పోగా చమురు ధరలను, వాటిపై పన్నులను మళ్లీ పెంచేస్తున్నారు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే వ్యవసాయ రంగంలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా మొత్తం సాగుభూమి తగ్గిపోయిన ఘనత కూడా మోదీ హయాంలోనే నమోదైంది. ఇవన్నీ గత పాలకుల విధానాల కొన సాగింపే తప్ప మోదీ మార్కు పాలన సుగుణాలు కనిపించడం లేదని వామ పక్షాల నిశ్చితాభిప్రాయం. మోదీ ఏడాది పాలనలో గణనీయ మార్పు ఏదైనా ఉందంటే భారత్‌లోని సంపన్న బిలియనీర్ల సంఖ్య నూటికి నూరు శాతం పెరగడమేనని వీరంటున్నారు. ఆర్థికరంగంలో ఊహించిన మార్పులు కనీసం గా జరుగకపోగా, పర్యావరణం, మానవహక్కులు, కార్మిక చట్టాలు వంటి అంశాల్లో మనం గతంలో అంగీకరించిన అంతర్జాతీయ మర్యాదలను కూడా మోదీ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ప్రభుత్వ పాత్రను కుదించడం ద్వారా కోట్లమందిని దారిద్య్రం కోరల్లోకి నెట్టివేయడం నిశ్శబ్దంగా జరిగిపోతోంది.
ధరల నియంత్రణ హుళక్కి: సార్వత్రిక ఎన్నికల సమయంలో ధరల పెరు గుదలపై యూపీఏ ప్రభుత్వాన్ని అంటకాగిన మోదీ తన ఏడాది పాలనలో ఎడాపెడా ధరలను పెంచడం ఆశ్చర్యమేమీ కాదు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏదన్నా ఉందంటే అది ధరల పెంపుదలలో కొత్తదనమే.
ఊ అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ ధరను లీటరుకు రూ.1.27 పైసల వరకు పెంచారు. ఊ రైల్వే ప్యాసింజర్ చార్జిలను 14.2 శాతం, సరకుల రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. ఊ రోజువారీ ప్రయాణికుల నెలవారీ రైల్వే టికెట్ ధరలను రెట్టింపు చేశారు. ఊ రైల్వే స్టేషన్ల ప్రయివేటీ కరణకు పిలుపిచ్చారు. స్టేషన్లలో లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సౌకర్యా లను ప్రైవేట్ పార్టీలకు అప్పగిస్తామన్నారు. ఊ ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడం ద్వారా రైల్వేల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తామని సూచిం చారు. ఊ రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను గత నెలలో రెట్టింపు చేశారు. ఊడిఫెన్స్, మీడియా రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తామని ప్రతి పాదించారు. ఊ ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ వాటాలను తప్పకుండా 25 శాతం మేరకు ఉప సంహరించుకోవాలని ఆదేశించారు. ఊ చక్కెర ధరను కిలోకు రూ.3లు పెంచారు. ఎల్పీజీ సిలెండర్ ధరను నెలకు రూ.10 చొప్పున పెంచుకుంటూ పోయారు. ఊ డీలర్లకు కమిషన్ పేరిట వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.3లు పెంచారు. ఊ అదే సమయంలో ప్రతి గంటకూ రూ. 7 కోట్ల మేరకు కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూపోయారు. ఊ మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 43 మంది రైతులు చనిపోతున్నారు. ఊఅధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని దేశంలోకి రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలోకి రూ.15 లక్షలను డిపాజిట్ చేస్తామని ఊదర గొట్టారు. కాని ఇప్పుడా ఊసే లేదు.
ఇన్ని అవకతవకలు, వైఫల్యాల మధ్య ప్రభుత్వానికి అవినీతి ఏమాత్రం అంటకపోవడం కారుచీకటిలో కాంతిరేఖగా మోదీ మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ, తన తొలి అయిదేళ్ల పాలనలో నాలుగేళ్లపాటు ఎలాంటి కుంభకోణం బారిన పడని యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ట తదనం తరం ఎంత మసకబారిపోయిందో తెలిసిన విషయమే. ఆశ్రీత పెట్టుబడిదారీ సంస్కృతిని దూకుడుగా ముందుకు నెడుతున్న మోదీ ప్రభుత్వ నిజస్వరూపం బయటపెట్టడానికి సంవత్సర పాలన సరిపోదన్నదే నిజమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మొత్తం మీద మోదీ ఏడాది పాలనతో దేశానికి ఉజ్వల వైభవం సిద్ధించకపోగా, కోట్లమంది అట్టడుగు జనానికి శూన్యమే మిగలనుంది. ఉన్న సామాజిక ప్రయోజనాలు కూడా ఒక్కొక్కటిగా ఊడిపోతున్న దశలో హక్కుల సాధనకు, వాటిని మిగుల్చు కునేందుకు పోరాటాలు మాత్రమే ప్రజలకు మిగలనున్నాయని వామపక్షాల విశ్వాసం.
కె. రాజశేఖరరాజు