‘అచ్ఛే దిన్’ వచ్చాయా!
మోదీ సర్కారుపై వెల్లడైన సానుకూలత
సర్వేల్లో స్పష్టమైన మద్దతు
న్యూఢిల్లీ: మోదీ ఏడాది పాలనకు ఫస్ట్ క్లాస్ మార్కులే పడ్డాయి. టైమ్స్ నౌ, సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఆంగ్ల వార్తాచానెళ్ల వేర్వేరు సర్వేల్లో మోదీ సర్కారు పనితీరుపై స్పష్టమైన సానుకూల వైఖరి వ్యక్తమైంది. గత యూపీఏ పాలనాకాలం కంటే ఇవి ‘అచ్ఛేదిన్(మంచి రోజులు)’ అనే సర్వేల్లో పాల్గొన్న వారిలో మెజారిటీ తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో నిర్దిష్ట ఫలితాలేం పెద్దగా కనిపించకపోయినా.. మోదీ సర్కారుపై ప్రజల విశ్వాసం సడలలేదని ఈ సర్వేల్లో తేలింది. ఎన్డీయే సర్కారు ఏడాది పాలనపై దేశవ్యాప్తంగా 75 వేల మందిపై టైమ్స్ నౌ ఆంగ్ల వార్తాచానెల్, సీ ఓటర్ సంయుక్తంగా జరిపిన సర్వేలో మోదీ అనుకూల వైఖరి స్పష్టంగా కనిపించింది. ‘అచ్ఛే దిన్’ హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని 27.7% స్పష్టం చేయగా, త్వరలో మంచి రోజులొస్తాయన్న నమ్మకాన్ని 37.6% మంది వ్యక్తపరిచారు. యూపీఏ పాలన కన్నా మెరుగ్గా ఉందని 62.5% ప్రజలు అంగీకరించడం, స్పష్టమైన ఫలితాలు కనిపించేందుకు మరింత సమయం అవసరమని 84.2% మంది అభిప్రాయపడటం మోదీ పాలనపై నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. సంస్కరణలు, అవినీతిపై పోరు, విదేశాంగ విధానం, బ్రాండ్ మోదీ.. ఇవి ఏడాది పాలనలో సాధించిన విజయాలని, అలాగే, భూ సేకరణ బిల్లు, పాక్‌తో సంబంధాలు, ద్రవ్యోల్బణం, నల్లధనం.. ఇవి వైఫల్యాలని పలువురు అభిప్రాయపడ్డారు.
52.9% మంది నల్లధనం వెనక్కు తెచ్చే విషయంలో మోదీ సర్కారు విఫలమైందని తేల్చి చెప్పారు. యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానం కన్నా ఎన్డీయే విదేశాంగ విధానం చాలా బావుందని 71% మంది చెప్పడం గమనార్హం. అవినీతిని అంతం చేయడంలో ప్రభుత్వ తీరు ప్రశంసనీయంగా ఉందని 52.3% మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ‘సీఎన్‌ఎన్ ఐబీఎన్’ జరిపిన సర్వేలో 72% మంది మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం మోదీకి తగ్గని ప్రజాదరణను ప్రతిఫలిస్తోంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 153 జిల్లాల్లో సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే జరిపింది.
72 % మంది ఓకే
మోదీ సర్కారు ఏడాది పాలనపై సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానెల్ దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 153 జిల్లాల్లో సర్వే చేయించింది. సర్వేలో పాల్గొన్న 72 శాతం మంది మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తంచేశారు. అదే సమయంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, భూసేకరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు.