యే దిల్ మాంగే మోర్..!
కార్గిల్ అమరుడు బాత్రా నినాదాన్ని ప్రచారంలో వాడిన మోడీ చెలరేగిన రాజకీయ దుమారం
పాలంపూర్ (హిమాచల్‌ప్రదేశ్)/న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కార్గిల్ యుద్ధ అమరవీరుడు విక్రమ్ బాత్రా ఇచ్చిన నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంపై రాజకీయ దుమారం రేగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బాత్రా స్వస్థలం పాలంపూర్‌లో మంగళవారం మోడీ ప్రచారం చేశారు. ‘ఈ నేలపై పుట్టిన కెప్టెన్ విక్రమ్ బాత్రా దేశం కోసం ప్రాణాలర్పించారు. అతను యే దిల్ మాంగే మోర్(నా హృదయం ఇంకా కోరుకుంటోంది) అని చెప్పాడు. నేనూ అదే చెపుతున్నా యే దిల్ మాంగే మోర్. మాకు హిమాచల్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలు కావాలి. దేశంలో 300 కమలాలు కావాలి. యే దిల్ మాంగే మోర్..’ అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశా రు. బాత్రా యుద్ధంలో మరణించే ముందు ‘యే దిల్ మాంగే మోర్’ అని అన్నారు. మోడీ ఈ నినాదాన్ని వాడడంపై బాత్రా తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు పార్టీలూ మండిపడ్డాయి.
‘ఎన్నికల్లో వాడుకోవద్దు’: దేశం కోసం ప్రాణాల్పించిన తన కుమారుని పేరును ఎన్నికల్లో వాడడం తగదని బాత్రా తండ్రి జీఎల్ బాత్రా అన్నారు. ప్రసు ్తతం తన కుమారుని గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. హమీర్పూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న తన భార్య కమల్ కాంత్‌పై వారి అభ్యర్థి అనురాగ్ ఠాకూర్‌ను ఎందుకు ఉపసంహరించలేదని ప్రశ్నించారు. మోడీకి విక్రమ్, ఇతర అమరులపై గౌరవముంటే ఠాకూర్‌ను పోటీ నుంచి ఉపసంహరించాలన్నారు. కాంగ్రెస్, ఆప్‌లు కూడా మోడీని తప్పుబట్టాయి. కార్గిల్ యుద్ధ సమయంలో బీజేపీ హిమాచల్ ఇన్చార్జిగా ఉన్న మోడీ విక్రమ్ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన పేరును వాడారని ఆప్ విమర్శిం చింది. కాగా, దిల్ మాంగేమోర్ నినాదం.. కుటుంబ ఆస్తి కాదని, దానిని ఓ శీతల పానీయాల కంపెనీ కూడా వాడుకుంటోందని బీజేపీ పేర్కొంది.
రాజకీయాల నుంచి తప్పుకుంటా: మోడీ
వివాదంపై మోడీ స్పందించారు. ‘విక్రమ్ బాత్రా, అతని తల్లిదండ్రులంటే నాకెంతో గౌరవం. అలాంటి పౌరులను అగౌరవించాలన్న ఆలోచన వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా’నన్నారు. ‘అమరులను కూడా స్మరించుకోవద్దా? ఇవేం రాజకీయాలు?’ అని త్రీడీ టెలికాస్ట్ ద్వారా చేసిన ప్రసంగంలో మండిపడ్డారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ తనపై అన్ని రకాలుగా బురద జల్లుతోందన్నారు. తాను కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్‌చంద్ర బోస్‌ను, ఝాన్సీ వె ళ్లినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకున్నానని, హిమాచల్‌లో భరతమాత ముద్దుబిడ్డ విక్రమ్ బాత్రాను తలచుకున్నానన్నారు. అంతకుముందు... హిమాచల్, ఉత్తరాఖండ్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ దగాకోరు పార్టీ అని విమర్శించారు.