Yellow Sea
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
షిప్ నుంచి రాకెట్ ప్రయోగించిన చైనా
బీజింగ్ : అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న ఆ దిశలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సముద్రంలోని షిప్‌పై నుంచి రాకెట్ ప్రయోగాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. ఈ విధంగా రాకెట్‌ను ప్రయోగించడం చైనాకు ఇదే తొలిసారి. ఎల్లో సముద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్ 11 రాకెట్ 7 ఉప్రగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. వాటిలో ఒక శాటిలైట్ తుపాన్ల పరిశీలనకు సంబంధించింది. మరో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్లు బీజింగ్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీకి చెందినవి. ఇటీవలి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న చైనా.. అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా 2030 నాటికి అంతరిక్షరంగంలో అమెరికాను అందుకోవాలని భావిస్తోంది. -
మునిగిన నౌక కెప్టెన్ అరెస్ట్
ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యం వహించారని అభియోగాలు 36కు చేరిన ప్రమాద మృతులు జిందో: పసుపు సముద్రంలో మునిగిపోయిన దక్షిణ కొరియా నౌక కెప్టెన్ లీ జూన్‌సెయోక్, ఆయన సిబ్బందిలోని ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని లీపై అభియోగాలు మోపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులను 40 నిమిషాలు బయటకు రావొద్దని లీ ఆదేశించడం తెలిసిందే. ఆయన, అరెస్టయిన ఇద్దరు సహోద్యోగులు ప్రయాణికులను వారి మానాన వారిని వదిలేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే లీ ప్రయాణికుల తరలింపులో జాప్యాన్ని మరోమారు సమర్థించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే అలా ఆదేశించానన్నారు. ‘అప్పటికింకా సహాయ నౌక రాలేదు. సాయం చేయడానికి చుట్టుపక్కల చేపల పడవలు, ఇతర నౌకలు కూడా లేవు. అలలు బలంగా, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ప్రయాణికులను అనాలోచితంగా తరలిస్తే వారు కొట్టుకుపోతారని అనుకున్నా’ అని చెప్పారు. కాగా, ఈ ప్రమాద మృతుల సంఖ్య శనివారానికి 36కి చేరుకుంది. ఓడలోకి వెళ్లిన ఈతగాళ్లు ఓ క్యాబిన్ కిటికీ గుండా చూడగా లోపల మూడు మృతదేహాలు కనిపించాయి. కిటికీని పగలగొట్టి వాటిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఓడ నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇదే తొలిసారి. 350 మంది విద్యార్థులు సహా 476 మందితో బుధవారం బెజూ ద్వీపానికి వెళ్తూ ప్రమాదానికి గురైన ఈ నౌక నుంచి 174మందిని సహాయక బృందాలు కాపాడ్డం, మిగతా వారి కోసం గాలిస్తుండడం తెలిసిందే.